బాబు ‘జాతీయ చక్రం’ మళ్లీ తిరుగుతుందా?

'కలిమి నిలవదు.. లేమి మిగలదు..కలకాలం ఒకరీతి గడవదు' అన్నాడో సినీ కవి. ప్రతి రాజకీయ నాయకుడికి, నాయకురాలికి ఇది వర్తిస్తుంది. రాజకీయ పరిభాషలో కలిమి అంటే అధికారం. అధికారం ఉంటే వారికి సంపద ఉన్నట్లే.…

'కలిమి నిలవదు.. లేమి మిగలదు..కలకాలం ఒకరీతి గడవదు' అన్నాడో సినీ కవి. ప్రతి రాజకీయ నాయకుడికి, నాయకురాలికి ఇది వర్తిస్తుంది. రాజకీయ పరిభాషలో కలిమి అంటే అధికారం. అధికారం ఉంటే వారికి సంపద ఉన్నట్లే. అది లేకపోతే బికారులుగా మారినట్లే. రాజకీయ నాయకులకు డబ్బుకు కొదవ ఉండదు కదా. అధికారం,పలుకుబడి, తమ మాట చెల్లుబాటు కావడం… ఇలాంటివే వారికి ప్రధానం. ఈ రోజుల్లో మున్సిపల్‌ కౌన్సిలర్‌ల దగ్గర, కార్పొరేటర్ల దగ్గరే బొచ్చెడు డబ్బు ఉంటుంటే రాష్ట్ర, జాతీయ రాజకీయ నాయకుల సంగతి చెప్పేదేముంది.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దగ్గర విపరీతంగా డబ్బుంది. ప్రస్తుతం ఆయనకు లేనిది అధికారం. అధికారం పోతే దానికి అనుబంధంగా ఉండే ఇతరత్రా శక్తులన్నీ హరించుకుపోతాయి. దీంతో నాయకులు ఏమీ చేయలేని అశక్తులవుతారు. చేష్టలుడిగిపోయి చూస్తుంటారు. గత వైభవాన్ని తలచుకొని బాధపడుతుంటారు. 'ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేవాడు. ఇప్పుడు ఇలా అయిపోయాడు' అంటూ మీడియాలో కథనాలు వస్తుంటే అవి చదువుకొని, చూసుకొని నేతలు మరింత బాధపడుతుంటారు. చంద్రబాబు పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అందులో చంద్రబాబు ప్రస్తావన లేకుండా ఉండదు. జాతీయ రాజకీయాల నుంచి బాబును విడదీయలేం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ హయాం నుంచీ జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది ప్రధాన పాత్రే. బీజేపీతో దోస్తీ కటీఫ్‌ అయ్యాక ఆయన కాంగ్రెసుతో రాసుకుపూసుకు తిరిగారుగాని అంతకు ముందు వరకు కాంగ్రెసేతర పార్టీలు నడిపిన రాజకీయాల్లో ఆయనదే ప్రధాన పాత్ర కదా. కాంగ్రెసు వ్యతిరేక పక్షాలను కూడగట్టడంలో, నాయకులతో చర్చలు జరిపి భిన్నధ్రువాలను ఒక్క వేదిక మీదికి తీసుకురావడంలో చంద్రబాబు చురుగ్గా వ్యవహరించారనడంలో సందేహం లేదు.

కాంగ్రెసేతర కూటముల ప్రధాని అభ్యర్థులను నిర్ణయించడంలో తానే కీలకపాత్ర పోషించానని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. తనకు రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించానని కూడా చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీతో బంధం తెంచుకున్న తరువాత బీజేపీని మళ్లీ ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెసు, ఇతర ప్రతిపక్షాలతో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెసు నేతృత్వం వహించే కూటమిలో చేరి సీట్లు పంచుకున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీతో చెట్టపట్టాలేసుకొని తిరిగారు.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను చుట్టబెట్టారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెసు వ్యతిరేక పునాదుల మీద. అలాంటి కాంగ్రెసుతో బాబు క్లోజ్‌గా ఉండటం టీడీపీలోనే అనేకమంది నాయకులకు నచ్చలేదు. కాని ఎన్ని విమర్శలు వచ్చినా బాబు లెక్క చేయలేదు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనేదే ఆయన లక్ష్యం, పంతం. చివరకు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకూడదనుకుంటే అది మరింత విజృంభించి బంపర్‌ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకోవడం, ఏపీలో బాబు అధికారం కోల్పోవడం ఏకకాలంలో జరిగిపోయింది.

అప్పటినుంచి ఈరోజు వరకు చంద్రబాబు 'జాతీయ చక్రం' తిరగకుండా ఆగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైకిల్‌ చక్రాలే తిగకుండా ఆగిపోయిన తరువాత జాతీయ చక్రం తిప్పడం సాధ్యం కాదు. ఆంధ్రాలో సైకిల్‌ను రిపేర్‌ చేసుకోవాలి. తెలంగాణలో కొత్త సైకిల్‌ కొనుక్కోవాలి. అంటే పార్టీని గ్రామస్థాయి నుంచి పునర్నిర్మించాలని చంద్రబాబే చెప్పారు. ఎన్నికలకు ముందు బీజేపీపై, కేంద్రంపై వీరంగం వేసిన బాబు, ఇప్పుడు మోదీ సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటున్నా 'అయితే ఓకే' అని పరిస్థితిలో ఉన్నారు.

సీఎం జగన్‌ మీద విమర్శలు చేస్తున్నారుగాని బీజేపీని, ప్రధాని మోదీని ఏమీ అనడంలేదు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసులో కీలక నాయకుడు చిదంబరం వ్యవహారంలో ఏ కామెంటూ చేయడంలేదు. మోదీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెసుతో అంటకాగిన బాబు ఇప్పుడు కాంగ్రెసుకు మద్దతుగా మాట్లాడటంలేదు. తెలంగాణలో అనేకమంది టీడీపీ నేతలను బీజేపీ లాగేసినా మౌనంగానే ఉన్నారు. ఏపీలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఒకప్పటి ఆయన కుడిభుజాలే చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకొని తప్పు చేశారని, ఆనాడు తాము చెప్పినా ఆయన వినలేదని అంటున్నారు. మాతో కలిసుంటే బాబు గెలిచేవాడని బీజేపీ నేతలు సానుభూతి చూపిస్తున్నారు. పరిస్థితి చూస్తే బాబు చక్రం వచ్చే ఎన్నికల వరకు జాతీయ రాజకీయాల్లో తిరగదనిపిస్తోంది. ఈ ప్రజాస్వామ్య పరిరక్షకుడికి పనిలేకుండాపోయింది. 

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి