ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. వారంరోజుల పర్యటన నిమిత్తం జగన్ మోహన్ రెడ్డి యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది జగన్ వ్యక్తిగత పర్యటనే. తన కూతురు యూఎస్ వర్సిటీ అడ్మిషన్ కోసం జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్లారు. దాంతో పాటు అక్కడ తెలుగు వారితో సమావేశం కావడం, వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనడం జరిగింది.
పర్యటన ముగించుకుని సుదీర్ఘ ప్రయాణం అనతరం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇక జగన్ మోహన్ రెడ్డి తిరిగి రావడంతో కీలక అంశాల గురించి ఆయన ఇప్పుడెలా స్పందించబోతున్నారనే అంశం గురించి ఆసక్తి నెలకొని ఉంది. రాజధాని విషయంలో రచ్చరేగింది.. ప్రధానంగా స్పందించాల్సింది అదే అంశమే. రాజధాని మార్పు ఊహాగానాలు చెలరేగాయి.
తెలుగుదేశం పార్టీ వాటికి వీలైనంత ఊపును ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. రాజధాని మార్చితే ఏదో కొంపలు మునిగిపోతాయనే రీతిలో తెలుగుదేశం ప్రచారం చేస్తూ ఉంది. అయితే అసలు నిర్మాణమే లేని రాజధానిని మార్చితే ఏంటి, మార్చకపోతే ఏమిటి.. అనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశం మీద ముఖ్యమంత్రి ఎలా స్పందించబోతున్నారనేది ఆసక్తిదాయకమైన అంశం.