ప్రతిపక్షాలపై సహజంగా ప్రజల్లో సింపతీ ఉంటుంది. ఐదేళ్లు పూర్తయ్యేలోపు కచ్చితంగా ప్రజల పక్షాన ఏవో కొన్ని పోరాటాలు చేసి కాస్తో కూస్తో మంచి పేరు తెచ్చుకుంటాయి. మరోవైపు సహజంగానే అధికార పక్షంపై ఉండే వ్యతిరేకత కూడా ప్రతిపక్షాలకు వరంగా మారుతుంది. దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు చూసినా ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలు సీట్లు పెంచుకోవడం సహజం. అధికారం దక్కించుకోలేకపోయినా తమ బలం పెరిగిందని నిరూపించుకుంటాయి. కానీ రాష్ట్రంలో ఇది పూర్తిగా రివర్స్ లో జరుగుతోంది.
కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత అధోగతిపాలు కావడం ఖాయం. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, నీచమైన పనులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బైటకు వస్తుండటమే దీనికి కారణం. ప్రజలకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని ఇందులో ఉన్నాయి. పోలవరం, అమరావతి నిర్మాణం, నీరుచెట్టు, జన్మభూమి కమిటీల అవినీతి.. ఇలాంటివి ప్రజలందరికీ తెలుసు. కొత్తగా వీటి గురించి.. వీటి పేరుతో టీడీపీ సాగించిన అక్రమాల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు.
అయితే కోడెల ఫర్నిచర్ స్కామ్, తిరుమల టికెట్లపై అన్యమత ప్రచారం లాంటివన్నీ.. రోజులు గడిచేకొద్దీ టీడీపీ దిగజారుడు తనాన్ని ప్రజల ముందుకు తెస్తున్నాయి. ప్రజావేదిక పేరుతో తాత్కాలిక సెటప్ వేసి కోట్ల రూపాయలు నొక్కేశారని తెలియడంతో ప్రజలు ముక్కునవేలేసుకున్నారు. రాజధాని తరలింపు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు రాసేసిన విధానం చూసి అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అవాక్కవుతున్నారు. కరెంటు కొనుగోళ్లలో సాగిన అవినీతి సాక్ష్యాధారాలతో సహా బైటపడుతోంది.
రోజులు గడిచేకొద్దీ ప్రజల్లో టీడీపీపై సింపతీ పెరగకపోగా.. వారి అక్రమాల చిట్టా బైటపడుతుండటంతో ఆ పార్టీ అంటేనే అసహ్యమేస్తోంది. కేవలం మూడు నెలల కాలంలోనే టీడీపీపై కొంతమందిలో ఎక్కడో మిగిలున్న కాస్తో కూస్తో అభిమానం కూడా తుడిచిపెట్టుకుపోతోంది. భవిష్యత్తులో ఆ పార్టీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావడం కష్టమే అనిపిస్తోంది.