రాష్ట్రం అట్టుడికిపోతోంది, వరదల్లో ప్రజల్ని ఆదుకోలేదు, వరదనీటిని మళ్లించి పంటలు ముంచారు, రాజధానిని తరలించేస్తున్నారు.. ఇవీ కొన్ని రోజులుగా చంద్రబాబు, లోకేష్ సహా ఇతర టీడీపీ నేతలు వైసీపీపై వేస్తున్న నిందలు. అంతా బాగానే ఉంది. మరి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దొంగతనం సంగతేంటి? నిస్సిగ్గుగా, మరీ లేకిగా ప్రభుత్వ కుర్చీలు, సోఫాలు, కంప్యూటర్లు ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లడం ఏంటి? పోనీ తిరిగిచ్చేయాలని తెలిసినా మర్చిపోయానంటూ కబుర్లు చెప్పడమేంటి?
4 రోజులుగా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కనీసం స్పందించరేంటి? ట్విట్టర్ చిలుక లోకేష్ కి కనీసం కోడెలపై ఓ ట్వీట్ చేయడానికి మనసు రాలేదెందుకు? చంద్రబాబు అయినా కోడెల తప్పేంలేదు, అంతా దుష్ప్రచారం అని ఎందుకు కొట్టిపారేయ లేదు? ఈ ఎపిసోడ్ మొత్తంలో కోడెల తన పరువు పూర్తిగా బజారున పెట్టుకోగా, పెదబాబు-చినబాబు తేలు కుట్టిన దొంగల్లా మారిపోయారు.
అసలు కోడెల తరపున వకాల్తా పుచ్చుకోడానికి ఏ ఒక్క టీడీపీ నేత కూడా సిద్ధంగా లేరంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దొంగతనం జరిగిందనే విషయం వాస్తవం, దొంగే ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు, దీంతో ఇక సమర్థించడానికి టీడీపీకి కూడా అవకాశం లేకుండా పోయింది. అందుకే ఆ ఎపిసోడ్ తెలియనట్టే ఉంటున్నారు టీడీపీ నేతలు. అంటే కోడెల చేసింది తప్పేనని చంద్రబాబు ఒప్పుకున్నట్టే. అందుకే ఆయన మౌనందాల్చారు. ఇక మిగిలింది ఏంటంటే.. ఆ కుటుంబాన్ని పార్టీ నుంచి దూరంగా పెట్టడం.
కోడెల కొడుకు, కూతురు అవినీతి బాగోతం బైటపడ్డప్పటి నుంచీ ఆ కుటుంబాన్ని టీడీపీ వదిలించుకోవాలని చూస్తోంది. కోడెల కూతురు, కొడుకు ఇద్దరిపై పార్టీ వేటు వేస్తోందనే వార్తలొచ్చినా అవి జరగలేదు. తీరా ఇప్పుడు దొంగతనం వ్యవహారం బైటపడటంతో.. కోడెలకు టీడీపీ ఇక మంగళం పాడబోతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయకున్నా.. పొమ్మనకుండా పొగపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇది మినహా టీడీపీకి, చంద్రబాబుకి మరో ప్రత్యామ్నాయం కూడా లేదు.