నాపై అస‌భ్య పోస్టులు పెడితే ఏం చేశారు?

ఏపీ సీఐడీ అధికారుల‌పై టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గౌతు శిరీష మండిప‌డుతున్నారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టులు పెట్టిన‌ప్పుడు సీఐడీ అధికారులు ఏం చేశార‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. గౌతు శిరీష‌కు గ‌త…

ఏపీ సీఐడీ అధికారుల‌పై టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గౌతు శిరీష మండిప‌డుతున్నారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టులు పెట్టిన‌ప్పుడు సీఐడీ అధికారులు ఏం చేశార‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. గౌతు శిరీష‌కు గ‌త రాత్రి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అమ్మఒడి, వాహనమిత్ర పధకాలు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను గౌతు శిరీష షేర్ చేశారు.

ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కుట్ర‌పూరితంగా దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని అధికార పార్టీ నేత‌లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వాహనమిత్ర, అమ్మఒడి పథకాలను జ‌గ‌న్‌ ప్రభుత్వం రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డంపై మే 30న ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ పోస్టుల‌కు కార‌ణ‌మైన ప‌లువురిని సీఐడీ విచారించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడిని కూడా సీఐడీ విచారించింది.

ఈ పోస్టుల వెనుక టీడీపీ పెద్ద‌లున్నార‌ని చెప్పాల‌ని సీఐడీ అధికారులు ఒత్తిడి చేసిన‌ట్టు విచార‌ణ ఎదుర్కొన్న టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు చెప్పారు. ఈ నేప‌థ్యంలో జూన్ 6న విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని గౌతు శిరీష‌కు గ‌త రాత్రి సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డంపై గౌతు శిరీష ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోస్టులను షేర్ చేసిన మాట వాస్త‌వ‌మే అని, అయితే ఫేక్‌గా గుర్తించ‌డంతో వెంట‌నే తొల‌గించాన‌న్నారు.

త‌న‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌పుడు సీఐడీకి ఫిర్యాదు చేశాన‌న్నారు. అప్పుడు చ‌ర్యలు ఎందుకు తీసుకో లేద‌ని గౌతు శిరీష ప్ర‌శ్నిస్తున్నారు. సీఐడీ నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ చేయ‌క‌పోవ‌డంతో దానిపై న‌మ్మ‌కం పోయింద‌న్నారు. సోష‌ల్ మీడియాలో తానెలాంటి దుష్ప్ర‌చారం చేయ‌లేద‌న్నారు.