75 యేళ్ల కిందట బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన జాతికి సంబంధించిన వాడు.. ఈ రోజు బ్రిటన్ ప్రధానమంత్రి కావడం అనేది అద్భుతం అనుకోదగిన సందర్భమే. బ్రిటన్ పాలకుల్లో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఎన్నిక కావడం భారత జాతి నాయకత్వ పటిమకు నిదర్శమే. ఇదే సమయంలో ప్రజాస్వామ్య భావన పరిణతిని కూడా మెచ్చుకుని తీరాలి.
ఆ సంగతలా ఉంటే.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి శునక్ కు పెను సవాళ్లు ముందున్నాయి. ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని అనే గర్వకారణం ఒక అంశం అయితే, ముందున్న సవాళ్లను సునక్ ఏ విధంగా అధిగమిస్తాడనేది మరో కీలకమైన అంశం.
ఇటీవలి కాలంలో బ్రిటన్ లో ఒక రకంగా రాజకీయ సంక్షోభం కొనసాగుతూ వస్తోంది. బోరిస్ జాన్సన్ పీఠం ఎక్కిన దగ్గర నుంచి వివాదాలు రాజుకున్నాయి. కరోనా సమయం నుంచినే జాన్సన్ తీరుపై వివాదాలు రేగాయి. బోలెడంత రచ్చ తర్వాత చివరకు జాన్సన్ తప్పుకున్నాడు. అప్పుడే రిషికి అవకాశం దక్కుతుందనే అభిప్రాయాలు, ప్రచారాలు జరిగాయి. అయితే రిషికి అవకాశం దక్కకుండా జాన్సన్ చూసుకున్నాడనే వార్తలు కూడా అప్పుడు వచ్చాయి.
ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి కొన్ని నెలల పాటు కూడా నిలదొక్కుకోలేకపోయారు. మినీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆమె తన మంత్రివర్గ విశ్వాసాన్ని కోల్పోయారు. కనీసం ఏడాది పాటు పదవిలో కొనసాగే అవకాశం కూడా ఆమెకు దక్కలేదు. ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి పడేశారనే అభియోగాల మధ్యన లిజ్ ట్రస్ రాజీనామా చేసి..రిషికి మార్గం సుగమం చేశారు.
మరి ఏ సవాళ్లు లిజ్ రాజీనామాకు కారణం అయ్యాయో.. ఏ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక లిజ్ రాజీనామా చేసి తప్పుకున్నారో.. ఇప్పుడు అవే సవాళ్లు రిషి ముందున్నాయి. ఆ ఆర్థిక వ్యవస్థనే ఆయన ఇప్పుడు చక్కదిద్దాల్సి ఉంది. గతంలో బ్రిటన్ ఆర్థికమంత్రిగా పని చేసిన అనుభవం రిషికి ఇప్పుడు ఉన్న పెద్ద ఆస్తి. ఆ అనుభవంతో ఆయన ముందున్న సవాళ్లను అధిగమిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇక కన్జర్వేటివ్ పార్టీ వ్యవహారాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వరసగా ప్రధానమంత్రులు మారడంపై విమర్శల జడి కురుస్తోంది. ప్రధానులు మారడం కాదు.. తక్షణం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్లు తలెత్తున్నాయి. అయితే రాజకీయంగా అధికార పార్టీకి అనుకూలత ఉంది. మెజారిటీ ఉంది కాబట్టి.. ప్రధానులను మార్చుకుంటూ వెళ్లొచ్చు. అయితే రేపటి ఎన్నికల నాడు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇదంతా! అనేది కూడా పెద్ద ప్రశ్నే. తాము జాన్సన్ ను చూసి ఈ పార్టీకి ఓటేశామని.. వీరిని ప్రధానమంత్రి అభ్యర్థులుగా ప్రజలు పరిగణించలేదనేది కూడా వాస్తవమే.
అలాగే రిషికి స్వపక్షంలో కూడా విపక్షం ఉండబోతోందని స్పష్టం అవుతోంది. ఇంతకు ముందు ఆయన విపక్షం తరహాలో వ్యవహరించి జాన్సన్ ను దింపడంలో కీలక పాత్ర పోషించాడనే పేరుంది. ఇలాంటి నేపథ్యంలో… ఇప్పుడు వారు ఈయనకు ఏ మేరకు మద్దతుగా నిలుస్తారో వేచి చూడాల్సి ఉంది. ప్రధానమంత్రి పదవి దక్కిందనే ఆనందం లిజ్ ట్రస్ కు ఎక్కువకాలం నిలవలేదు. ఈ రాజకీయ పరిణామాల మధ్యనే రిషి కూడా పీఠం ఎక్కుతున్నారు. బ్రిటన్ రాజకీయంలో ఇంకా ఏం జరుగుతుందో!