టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీలు బాదకపోవడం మొన్నటి వరకూ బాగా చర్చలో ఉండిన అంశం. సెంచరీల విషయంలో సచిన్ రికార్డులను అధిగమిస్తాడు అనే అంచనాలను మోసిన విరాట్ కొహ్లీ వంద పరుగులకు మొహం వాచాడు. 2019లో వరస సెంచరీలను బాదిన విరాట్ కొహ్లీ ఆ తర్వాత మళ్లీ సెంచరీ కొట్టడానికి దాదాపు మూడేళ్లు పెట్టింది.
ఏకంగా వెయ్యి రోజుల పాటు విరాట్ కొహ్లీ సెంచరీ లేకుండా గడిపేశాడంటూ విశ్లేషణలు వచ్చాయి. రోజువారీగా లెక్కలొచ్చాయి. అభిమానుల నుంచి కూడా పెదవి విరుపులు తప్పలేదు. ఒక కొహ్లీ కెరీర్ ఖతం అనే అభిప్రాయాలూ వచ్చాయి. విరాట్ ఇక రిటైర్మెంట్ ప్లాన్లు చేసుకోవాలంటూ కొందరు ఉచిత సలహాలు ఇచ్చారు.
గతంలో చాలా మంది లెజండరీ ప్లేయర్లూ కూడా ఒక దశలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్న వారే. స్టీవ్ వా, సచిన్, లారా.. ఇలా అంతా తమ కెరీర్ కొనసాగుతున్న దశలోనే ఏదో ఒక సందర్భంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే వారితో పోలిస్తే కొహ్లీ సుదీర్ఘకాలం పాటు ఇలా కార్నర్ లో నిలబడ్డాడు! సచిన్ వైఫల్యాలూ ఉన్నాయి. కెప్టెన్ గా రాణించిన స్టీవ్ వా ఆటగాడిగా ఫెయిలయి కార్నర్ అయ్యాడు. లారా నాయకత్వంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు క్షీణ దశ మొదలైంది! అయితే కొహ్లీ పై విమర్శల జడి మరింతగా కురిసింది.
వెయ్యి రోజుల పాటు కొహ్లీ ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడనేది బాగా నానిన అంశం. ఆ వెయ్యి రోజుల గ్యాప్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సెంచరీని సాధించి విరాట్ కొహ్లీ అందరూ ఆశించినది సాధించి చూపాడు. అయినప్పటికీ కొహ్లీపై విమర్శల జడి ఆగలేదు.
కొహ్లీ టీ20 ల నుంచి తప్పుకుంటాడనే ప్రచారమూ మొదలైంది. 20-20లకు రిటైర్మెంట్ ప్రకటించి అతడు వన్డేలు, టెస్టుల మీద దృష్టి సారిస్తాడనే టాక్ ఈ మధ్యనే మొదలైంది. టీ20 ప్రపంచకప్ తర్వాత కొహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడనే అభిప్రాయాలు వినిపించాయి. అభిమానులు కూడా కొహ్లీపై మొన్నటి వరకూ భారీ ఆశలేవీ పెట్టుకోలేదు!
ఆఖరికి పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా కొహ్లీపై ఆ స్థాయి ఎక్స్ పెక్టేషన్లు లేవు! పది ఓవర్లకే టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరింది. అయితే మరీ భారీ లక్ష్యం లేదు, టీ20ల్లో ఏదైనా సాధ్యమే అనే లెక్కలే అభిమానులను టీవీల ముందు కూర్చోబెట్టాయి కానీ, కొహ్లీ అద్భుతాన్ని చేస్తాడనే అంచనాలు ఉన్నది తక్కువమందికే! కొహ్లీ- హార్దిక్ లు కొంత వరకూ ముందుకు తీసుకెళ్లినా.. ఆ తర్వాత ఏ దినేష్ కార్తీకో ఉన్నాడనే ఆశలే ఉన్నాయి. అయితే కొహ్లీ ఆడిన మరపు రాని ఇన్నింగ్స్ కథలో అసలైన ట్విస్టుగా నిలిచింది.
టీ20 మజా కొహ్లీ ఇన్నింగ్స్ తో క్రికెట్ పై నే మళ్లీ ఉత్తేజాన్ని పెంచేస్థాయిలో ఉంది. మరి ఇప్పుడు మరో కీలకమైన అంశం.. విరాట్ కొహ్లీ విశ్వరూపం ఇక మళ్లీ పాత స్థాయిలో కొనసాగుతుందా? అనేది! మూడేళ్ల కిందటి వరకూ మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదిన ఇతడు తన విరాట్ రూపాన్ని మళ్లీ ప్రదర్శిస్తాడా! వంద సెంచరీల వరకూ ఇక వెనక్కు తిరిగి చూసుకోడా! అనేవి ఆసక్తిదాయకమైన అంశాలు. రానున్న రోజుల్లో విరాట్ కొహ్లీ ప్రదర్శన ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వనుంది.