సాధారణంగా జాతీయ పార్టీకి దగ్గర కావాలని లేదా పొత్తు పెట్టుకోవాలని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే, ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల సహకారం కావాలని జాతీయ పార్టీలు కూడా అనుకుంటూ ఉంటాయి. అందుకోసం ఆ పార్టీలను ప్రలోభపెడుతుంటాయి. పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన ఎప్పుడూ వన్ సైడ్ గా ఉండదు. కానీ ఏపీలో రాబోయే ఎన్నికల్లో వన్ సైడ్ గా ఉంటుందని బీజీపీ చెబుతోంది. తాము జనసేనలో మాత్రమే పొత్తు పెట్టుకుంటామని కమలం పార్టీకి చెందిన జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర నాయకులవరకూ చెబుతున్నారు. మరో పక్క టీడీపీ -జనసేన ఒక్కటవుతాయనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీతో తమ దోస్తీ ముగిసినట్లేనని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తున్నప్పటికీ బీజేపీ వాళ్ళు పవన్ ను వదిలేలా లేరు. టీడీపీతో తమకు ఎట్టి పరిస్థితిలోనూ పొత్తు ఉండదని అంటున్నారు. బహుశా పాత జ్ఞాపకాలను బీజీపీ వాళ్ళు మర్చిపోనట్లుగా ఉంది. అధికారం చివరి రోజుల్లో టీడీపీ-బీజేపీ సంబంధాలు చెడిపోయాయికదా. అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నాయకులు మోడీని వ్యక్తిగతంగా దూషించారు కూడా. దాన్ని బీజేపీ వాళ్ళు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై బీజేపీ పెద్దగా కంగారు పడటం లేదు. తమపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి.. వ్యూహం మార్చుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించి చంద్రబాబుతో సమావేశం అయినప్పటికీ బీజేపీ నేతలు ఇంకా పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని నమ్ముతున్నారు.
చంద్రబాబునాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ కేవలం సంఘీభావం కోసమే జరిగిందని.. అలాంటి సమావేశాన్ని చంద్రబాబు కంటే ముందే సోము వీర్రాజు నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజుకు ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించే కొంత మంది బీజేపీ పెద్దలు మాట్లాడారు. పవన్ కల్యాణ్ .. తాము బీజేపీతో కటీఫ్ చెబుతున్నానని ఎప్పుడూ ప్రకటించలేదని.. రోడ్ మ్యాప్ ఆలస్యంపై అసంతృప్తి, బలంగా కలిసి ముందుకు వెళ్లలేకపోయామన్న ఆవేదన మాత్రమే వ్యక్తం చేశారని అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ విషయంలో ఎవరూ తొందరపడి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని ఆయన పొత్తులో ఉన్నట్లుగానే మాట్లాడాలని పార్టీలోని అన్ని స్థాయిల నేతలకు సమాచారం పంపారు.
ఈ మేరకు బీజేపీ నేతలంతా.. తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత జనసేన పార్టీ అనూహ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏదైనా ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తాయి. కానీ పవన్ కల్యాణ్ ఎలాంటి ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత వారి పోరాటం కలసి కట్టుగా సాగలేదు. బీజేపీలో కొంత మంది నేతలు వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదును జనసేన పార్టీ నాయకులు హైకమాండ్‌కు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కారణం ఏదైనా కానీ జనసేన – బీజేపీ కలిసి కట్టుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు.
తిరుపతి ఉపఎన్నికల్లో తప్ప.. బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో జనసేన పార్టీ బేజీపికి మద్దతివ్వలేదు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ బిజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రాజకీయాల కోసం వైసీపీతో కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉండటం.. రాష్ట్ర సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తులు కూడా పట్టించుకోలేదని ఫీల్ కావడంతో ఆయన దూరం జరుగుతూ వస్తున్నారు. ప్రతీ దానికి తాము ఢిల్లీకి వెళ్లలేమని.. రాష్ట్రంలోనే తేల్చుకుంటామన్నారు. బీజేపీ అనుకున్నట్లుగా స్పందించడం లేదని.. వ్యూహం మార్చుకుంటామని అన్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాలను సానుకూలంగానే డీల్ చేస్తోంది. దీంతో ఇప్పటికిప్పుడు బీజేపీ వైపు నుంచి ఎలాంటి దూకుడైన ప్రకటనలు ఉండవని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర బీజేపీ ఇంచార్జి సునీల్ థియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ -జనసేన కలిసి పోటీ చేస్తాయని సునీల్ థియోధర్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెటుకోబోమని కుండ బద్దలు కొట్టారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఏపీ సునీల్ థియోధర్ వ్యాఖ్యానించారు. ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం లేదన్నారు. మరి రాబోయే రోజుల్లో జనసేన -టీడీపీ మాత్రమే పొత్తు పెట్టుకుంటాయా ? లేదా బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలుస్తుందా?