ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. ప్రజాస్వామ్య విలువల విషయంలో అనేక దేశాలకు ఆదర్శం బ్రిటన్. తప్పక ఒప్పుకోవాల్సిన సత్యాలు ఇవి.
అలాగని ఈ దేశ రాజకీయ వ్యవస్థల్లో తప్పుల్లేవా అంటే ఉంటే ఉండవచ్చు. అయితే ఒక గొప్ప తత్వ వేత్త చెప్పినట్టు.. పాలన పద్ధతుల్లో ప్రజాస్వామ్యం అంత ఉత్తమమైనది కాదు కానీ, అంతకన్నా మెరుగైన పద్ధతేదీ లేదు!
పౌరులందరికీ ఓటు హక్కూ, రాజకీయ అవకాశాల విషయంలో కుల, జాతి, మత ప్రమేయం తక్కువగా ఉండటం. ఎవరికైనా అవకాశం దక్కే అవకాశం ఉండటం! ఈ రోజు బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని ఏ భారతీయ మూలాలున్న వాడో ఎక్కడని కాదు. శునక్ పదవి విషయంలో అతడి మూలాలు అడ్డు కాలేదు! ఇదీ నిజంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం.
అతడు ఇండియనా, ఆఫ్రికనా.. అనేది పక్కన పెడితే, ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించింది బ్రిటన్. ఇలాంటి పరిణతిని అమెరికా కూడా ప్రదర్శిస్తూ ఉంది. ఒక ఆఫ్రో అమెరికన్ ను అధ్యక్షుడిగా చేయడం, ప్రస్తుత ఉపాధ్యక్షురాలి మూలాలు.. ఇవన్నీ అమెరికా ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనాలే.
హాలీవుడ్ లో కొన్నేళ్ల కిందట వచ్చిన అబ్రహం లింకన్ బయోపిక్ లో ఒక నల్ల సైనికుడు చెప్పే డైలాగ్ ఉంటుంది. అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న తరుణంలో లింకన్ ఒక సైనికా శిబిరాన్ని సందర్శిస్తాడు. అక్కడ కొంతమంది నల్ల సైనికులతో మాట్లాడతుంది లింకన్ పాత్ర. * కొన్నేళ్లలో అమెరికాలో బానిసత్వం రద్దు అవుతుంది. ఆ తర్వాత వందేళ్లకు అయినా.. నల్ల వాళ్లకు ఓటు హక్కు దక్కుతుంది. ఆ తర్వాత మరో వందేళ్లకు అయినా ఒక నల్లవాడు అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడు..* అంటూ ఆ నల్ల సైనికుడు ఆశాభావమైన రీతిలో నాటి వారి ప్రియతమ ప్రెసిడెంట్ తో సంభాషించినట్టుగా ఆ సీన్ సాగుతుంది.
ఒబామా యూఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాలంలో వచ్చిన సినిమా అది. దీంతో.. ఆ సీన్ ను గొప్ప ప్రిడిక్షన్ గా చెప్పలేం కానీ, నల్ల అమెరికన్ల కోరిక రెండు వందలేళ్లకు తీరిన వైనం మాత్రం ఆ సీన్ చర్చలోకి తీసుకు వస్తుంది.
సాధారణంగా ప్రజాస్వామ్యం అనేది పాత బడాలి. అది మరిగిన కొద్దీ, పాత పడిన కొద్దీ సుగంధమే వ్యాపిస్తుంది. అమెరికా అయినా, బ్రిటన్ అయినా.. పురాతన ప్రజాస్వామ్యాలు అవుతుండటం వల్ల జాతి బేధాల్లేని రీతిలో పాలకులు వస్తున్నారు. శునక్ ను బ్రిటీష్ పౌరులు ప్రధానిగా ఎన్నుకోలేదు. రాజకీయ సమీకరణాల ఆధారంగా మాత్రమే ఆయన ప్రధాని అవుతున్నారు. మరి ఈ హోదాలో ఆయన మెప్పించి రేపు ఎన్నికలకు వెళ్లవచ్చు. పదవి ముందు దక్కి ఆ తర్వాత ఫలితం కోరే అవకాశం ఆయనకు లభించింది.
అలాగే లండన్ మేయర్ గా ఒక పాకిస్తానీ మూలాలున్న ముస్లిం నేత వ్యవహరిస్తున్నట్టున్నారు. భారతీయులు, పాకిస్తానీలు బోలెడంతమంది బ్రిటిష్ సిటిజన్ షిప్ పొందుతున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో.. పక్కనే ఉన్న ఐర్లాండ్ మూలాలున్న వారు, ఇండియన్, పాకిస్తానీ మూలాలున్న వాళ్లు బోలెడంతమంది స్థానం సంపాదించుకుంటూనే ఉన్నారు. ఎంతగా తిట్టడానికి అవకాశం ఉన్నా.. అమెరికా, బ్రిటన్ వంటి ప్రజాస్వామ్యిక దేశాల ఔన్నత్యాలే ఇవి.