సెకెండ్ వేవ్ ప్రభావం టాలీవుడ్ బాక్సాఫీస్ పై గట్టిగా పడింది. వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత థియేటర్లు మూతపడగా.. జులై నెలాఖరు నుంచి పాక్షికంగా, ఆగస్ట్ మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. వారానికి కనీసం అరడజను సినిమాలకు తగ్గకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలా ఆగస్ట్ లో అటుఇటుగా 27 సినిమాలు రిలీజ్ అవ్వగా, వాటిలో నిలదొక్కుకున్నవి 2 సినిమాలు మాత్రమే.
ఆగస్ట్ మొదటి వారంలో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా రిలీజైంది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వ్యూహాత్మక ప్రచారంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగింది. ఇంకా చెప్పాలంటే, సెకెండ్ వేవ్ తర్వాత హిట్టయిన తొలి సినిమాగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసేసరికి థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రూపంలో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆర్జించింది.
ఎస్ఆర్ కళ్యాణమండపంతో పాటు వచ్చిన ఇప్పుడుకాక ఇంకెప్పుడు, ముగ్గురు మొనగాళ్లు, మెరిసే మెరిసే, మ్యాడ్, క్షీరసాగర మథనం సినిమాలన్నీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.
ఇక ఆగస్ట్ రెండో వారంలో ఏకంగా 9 సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. అయితే వీటిలో బాక్సాఫీస్ లో నిలదొక్కుకున్న సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. సుందరి, ఒరేయ్ బామ్మర్ది, బ్రాందీ డైరీస్, రావే నా చెలియా.. ఇలా చాలా సినిమాలు ఆ వారం ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
ఆగస్ట్ మూడో వారంలో వచ్చిన రాజరాజ చోర సినిమా క్లీన్ హిట్. శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. సున్నితమైన హాస్యం, సునిశితమైన భావోద్వేగాల్ని మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో పాటు వచ్చిన కనబడుటలేదు, క్రేజీ అంకుల్స్, బజార్ రౌడీ లాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి.
ఇక ఆగస్ట్ చివరి వారంలో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. క్రిటిక్స్ కూడా పూర్తిస్థాయిలో మెచ్చుకోలేదు. అయినప్పటికీ తన సినిమాను ప్రేక్షక విజయంగా చెప్పుకుంటున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ కోసం విస్తృతంగా పర్యటిస్తున్నాడు.
చివరి వారంలో వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ఫ్లాప్ అయింది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా అతడి కెరీర్ కు హెల్ప్ అవ్వలేదు. ఇదే వారం హౌజ్ అరెస్ట్, సూర్యాస్తమయం, గ్రేట్ శంకర్ లాంటి సినిమాలొచ్చినా అన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. డైరక్ట్ ఓటీటీ రిలీజ్ గా వచ్చిన వివాహ భోజనంబు కూడా ఫ్లాప్ అయింది.
ఓవరాల్ గా ఆగస్ట్ నెలలో ఎస్ఆర్ కళ్యాణమండపం, రాజ రాజ చోర సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి.