స్టాలిన్ ని పొగిడిన పవన్.. బీజేపీ గరంగరం

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశారు.…

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశారు. గతంలో ఎన్నడూ లేనట్టు ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. 

ఇక్కడి వరకూ ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ జనసేన ఇప్పుడు సోలో పార్టీ కాదు, బీజేపీ తోకపార్టీ. అలాంటి పార్టీ తమిళనాడులో బీజేపీ ప్రత్యర్థి, అందులోనూ కాంగ్రెస్ ప్రాయోజిత యూపీఏలో కీలక భాగస్వామి అయిన డీఎంకేను పొగడటం అంటే మామూలు విషయం కాదు. బీజేపీని ధిక్కరించినట్టే లెక్క.

పవన్ కేవలం సీఎంని పొగడ్తల్లో ముంచెత్తడమే కాదు, మీరు రాజకీయ నాయకులందరికీ ఆదర్శం అనేశారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం అని తేల్చేశారు. దీంతో సహజంగానే బీజేపీకి మండింది. అధిష్టానం ఈ విషయంలో సీరియస్ అయింది. స్టాలిన్ ని పొగడటంపై వివరణ కోరింది. మరి జనసేనాని దీనికి ఎలా రియాక్ట్ అవుతారో, ఏమని సమాధానమిస్తారో.. ? తేలాల్సి ఉంది.

బీజేపీ వాదన ఇదీ..

స్టాలిన్ ని పొగిడితే పర్లేదు కానీ, ఇటీవలే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టిపోటీ ఇవ్వాలని చూసింది. బీజేపీ-అన్నాడీఎంకే కూటమిని మట్టికరిపించి స్టాలిన్ అక్కడ తన సామ్రాజ్యం స్థాపించారు. అందులోనూ పాలనలో మరీ దూకుడుగా వెళ్తున్నారు. 

ఇటీవలే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అప్పుడు జరిగిన గొడవతో బీజేపీ-అన్నాడీఎంకే కూటమి సభ నుంచి వాకౌట్ చేసింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడా పార్టీని, ఆ పార్టీ అధినేతను తమ మిత్రపక్ష నేత పొగిడితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే బీజేపీ ఈ విషయంలో సీరియస్ అయింది. అయితే ఈ కోపం బయటకు ప్రకటించకుండా, నేరుగా జనసేనానినే వివరణ అడిగింది.

పవన్ సమర్థింపు ఎలా ఉండబోతోంది..?

బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే, పవన్ కి ఆ పార్టీ విషయం అర్థమైంది. అందుకే అప్పటినుంచి ఆయన పొగిడితే అది కేవలం మోదీనే, ఆరాధిస్తే అది అమిత్ షా నే. అలాంటి పవన్ అనుకోకుండా స్టాలిన్ ఇష్యూతో రూటుమార్చారు. కానీ ఇప్పుడాయన తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. బీజేపీకి కోపం వచ్చినా పర్లేదు
అనుకుంటున్నారు.

బీజేపీ మరీ ఓవర్ యాక్షన్ చేస్తే.. పొత్తు బంధనాల్ని తెంచుకోడానికి సైతం వెనకాడేది లేదనే ఆలోచనలో ఉన్నారట. నిజానికి పవన్ తో పాటు జనసైనికులు కోరుకునేది ఇదే. రాబోయే రోజుల్లో బీజేపీ-జనసేన బంధం వీగితే.. దానికి తొలి అడుగు స్టాలిన్ పై పవన్ వేసిన ట్వీటే అనుకోవాలేమో.