ధనవంతులంతా వలస వచ్చిన వారేనట…

పేరు గొప్ప ఊరు దిబ్బ అని అంటారు. అలాంటిదే విశాఖ మెగా సిటీ కధ కూడా. వివరాలు వింటే చివరికి మెగా పిటీ అని ఎవరైనా చింతించాల్సిందే. విశాఖ ఏపీలో ఇపుడు రాజధాని నగరంగా…

పేరు గొప్ప ఊరు దిబ్బ అని అంటారు. అలాంటిదే విశాఖ మెగా సిటీ కధ కూడా. వివరాలు వింటే చివరికి మెగా పిటీ అని ఎవరైనా చింతించాల్సిందే. విశాఖ ఏపీలో ఇపుడు రాజధాని నగరంగా మారుమోగుతున్న పేరు. విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని వైసీపీ సహా మేధావులు ప్రజా సంఘాలు అంటున్న మాట. అయితే విశాఖ రాజధానిగా వద్దు అమరావతే ముద్దు అన్నది తెలుగుదేశం, ఇతర విపక్షాల వాదన.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ మహానగరంగా ఎదిగింది. ఏపీలో విలాసవంతమైన నగరంగా ఉంది. మరి ఆ విలాసాలూ వైభోగాలు అన్నీ కూడా ఉత్తరాంధ్రా వాసులవేనా అంటే కాదు అన్నదే జవాబు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే విశాఖలో వందమంది ధనవంతులు ఉంటే తొంబై తొమ్మిది మంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే. అందులో రాజకీయంగా బలంగా ఉన్న వివిధ వర్గాల వారే విశాఖలో దర్జా దర్పం అంతా చేస్తున్నారు. హోదాలు అధికారాలూ అన్నీ వారే అనుభవిస్తున్నారన్నది ఒక ఆరోపణ.

ఈ మాత్రం దానికి విశాఖను రాజధానిగా చేస్తే వారికి పోయేది ఏమీ లేదు కదా ఇంకా చాలానే సమకూరుతుంది. అమరావతి రాజధాని అని పట్టుబడుతున్న వారిలో కూడా ఎక్కువ మంది విశాఖలో ఆస్తులు పోగేసుకున్న వారే. అలాంటి విశాఖ రాజధాని అయితే మొదటి లబ్దిదారులు వారే అవుతారు. కానీ వారు మాత్రం విశాఖలో ఎటూ దర్జా కొనసాగుతోంది కదా అమరావతి పేరిట రెండవ చోట కూడా తామే బలంగా కాళ్ళూ వేళ్ళూ ఊనాలని ఆరాటపడుతున్నారు అన్నది ఇతర వర్గాల వాదన.

విశాఖ నగరం అని పేరే కానీ ఇతర ప్రాంతాల వారి పెత్తనమే ఎక్కువగా ఉందని  అంతా అంటున్న మాటే. మంత్రి ధర్మాన ప్రసాదరావు దీని మీద మాట్లాడుతూ విశాఖలో ఈ రోజుకీ ధనవంతుల జాబితా తీస్తే ఉత్తరాంధ్రా వారు నూటికి ఒక్కరో ఇద్దరో ఉంటారని లెక్క తీసి మరీ చెబుతున్నారు. అందుకే తాము ఉత్తరాంధ్రా వెనకబాటుతనం పోవడానికి రాజధానిగా చేయమని కోరుతున్నామని, తద్వారా పక్క జిల్లాలు బాగుపడితే శతాబ్దాల దారిద్ర్యం ఎంతో కొంత మటుమాయం అవుతుంది అన్నదే తమ వాదన వేదన అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.

అయితే విశాఖ నుంచి అభివృద్ధి ఫలాలు తాము గుంజుకోవాలి కానీ ఈ ప్రాంతానికి రాజసం దక్కకూడదన్న కొన్ని శక్తులు వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత ఈ ప్రాంతానికి శాపంగా మారుతోంది అంటున్నారు. బాగు కోసం ఉపాధ్ కోసం వ్యాపారం కోసం వచ్చిన వారు విశాఖను గుత్తకు తీసుకుని పెత్తనం చేస్తే తాము సహించి ఊరుకోవాలా అన్నదే భూమిపుత్రుల ధర్మాగ్రహంగా ఉంది. విశాఖ రాజధాని అవుతుందో లేదో తెలియదు కానీ అయితే ఎంతో కొంత వెలుగు రేఖలు ఇతర జిల్లాలకు విస్తరిస్తాయన్న ఆశ బడుగు జీవులది. ఇందులో ధర్మమేదో  న్యాయమేదో అంతా ఆలోచించి చెప్పాలి అని అంటున్నారు.