మనుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రసవత్తర దశకు చేరుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే హోదా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాతో అనివార్యం అయిన ఈ ఉప ఎన్నిక ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్యన అమీతుమీగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉపపోరులో ఉన్నా కూడా.. ప్రధాన పోటీదారుగా మాత్రం లేదు. అలాగని కాంగ్రెస్ మరీ డమ్మీ కూడా అయ్యేలా లేదు ఈ ఉప ఎన్నికలో. ఎన్నో కొన్ని ఓట్లను పొంది ఫలితాన్ని కొంత వరకూ ప్రభావితం చేసే స్థితిలో కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని ఓడిస్తుందనేది ఫలితాలు వస్తే కానీ చెప్పగలిగే అంశం కాదు.
ఇక ప్రధాన పోటీ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్యనే ఉందనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాటే. మరి నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యి, ప్రచార హోరు కొనసాగుతున్న తరుణంలో ఇంతకీ మునుగోడులో పరిస్థితి ఎలా ఉందంటే.. పోటాపోటీగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోటాపోటీగా ఉండటం విడ్డూరం కాదు కానీ, ఇరు వర్గాల్లోనూ గెలుపు పట్ల ధీమా, అదే సమయంలో ఓటమి భయం కూడా ఉండటం గమనార్హం. అటు భారతీయ జనతా పార్టీ విజయం పట్ల ధీమాతో ఉంది. అదే సమయంలో ఎక్కడో చిన్న ఆందోళన ఉందని టాక్. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఉప ఎన్నికల చాంఫియన్. తెలంగాణ ఏర్పడక ముందు అయితే టీఆర్ఎస్ పదే పదే ఉప ఎన్నికలను కోరుకునేది. తెలంగాణ వచ్చాకా కూడా తొలి ఐదేళ్లలో ఉప ఎన్నికలు అంటే టీఆర్ఎస్ ఉత్సాహపడేది. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీలు తెచ్చుకుని విజయం సాధించేది. అయితే గత కొంతకాలంగా ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కు అంత ఉత్తేజాన్ని ఇవ్వడం లేదు.
హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి. వీటిల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ ను ఇస్తూ భారతీయ జనతా పార్టీకి విజయాలు దక్కాయి. ఇలా ఇప్పుడు ఉప ఎన్నికల చాంఫియన్ గా బీజేపీ నిలుస్తోంది. ఇలాంటి క్రమంలో.. మునుగోడు కూడా భారతీయ జనతా పార్టీ పరం అయితే రాజకీయంగా ఆ పార్టీ బలోపేతం దిశగా అడుగుడు వడివడిగా వేస్తున్నట్టే. ఉప ఎన్నికల ఫలితాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోటీ ఇవ్వడం.. ఇవన్నీ తేలికగా తీసుకోదగిన అంశాలు అయితే కాదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీకి ఈ విజయాలన్నీ మరింత ఉత్తేజాన్ని ఇస్తాయి. టీఆర్ఎస్ కు ఈ పరిణామాలు నిస్పృహను కలిగిస్తాయి.
అలాగని టీఆర్ఎస్ మునుగోడులో తేలికగా తలొగ్గేలా లేదు. నియోకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉండవచ్చు. కాంగ్రెస్ నుంచి ఆ క్యాడర్ కొంతమేర రాజగోపాల్ రెడ్డి వెంట తరలి వచ్చి ఉండవచ్చు. ఇక అంగ, అర్థబలాల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తిరుగులేదు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉన్న క్యాడర్ మొత్తం ఇప్పుడు మునుగోడులో బీజేపీ విజయం కోసం పని చేస్తూ ఉంది. ఎలాగూ బీజేపీ- రాజగోపాల్ రెడ్డిలే ఈ ఉప ఎన్నికను తీసుకు వచ్చాయి కాబట్టి.. విజయం కూడా వారికే ప్రతిష్టాత్మకం. తేడా వస్తే మాత్రం జాయింటుగా పరువుపోతుంది.
ఇక మునుగోడులో గెలిస్తే టీఆర్ఎస్ కు కొత్త బలం వచ్చినట్టే. కాంగ్రెస్ సీటు ఇది. బీజేపీ నుంచి టీఆర్ఎస్ సాధించుకున్నట్టుగా అవుతుంది. కేసీఆర్ పాలన ఎనిమిదేళ్లను పూర్తి చేసుకుంటున్నా.. కేసీఆర్ కు తిరుగులేనట్టే అవుతుంది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ వల్ల వచ్చింది కాదు. బీజేపీ వల్ల వచ్చిన ఉప ఎన్నిక టీఆర్ఎస్ బలాన్ని పెంచినట్టుగా అయితే ఇప్పుడు గులాబీ పార్టీకి కాషాయ పార్టీ చేసిన మేలు అంతా ఇంతా కాదు.
ఇక ఈ పోరులో కాంగ్రెస్ పరిస్థితి డిపాజిట్ కు ఎక్కువ అన్నట్టుగా ఉంది. కనీసం డిపాజిట్ ను సంపాదించుకున్నట్టుగా అయితే కాంగ్రెస్ పార్టీ పరువు నిలబడినట్టే. గత చరిత్ర, గత ఎన్నికల విజయం కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లను తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సి ఉంది.
ఇక ఈ ఉప ఎన్నికలకు ముందు నేతలు అటూ ఇటూ గెంతుతున్నారు. టీఆర్ఎస్ కు ఒకరు రాజీనామా చేస్తే, బీజేపీకి ఇద్దరుముగ్గురు రాజీనామాలు చేశారు. నిన్నలా మొన్న బీజేపీలోకి చేరిన వారు.. ఇంతలోనే రాజీనామా చేశారు. ఇదంతా మునుగోడు ఎన్నికల వేడి అనుకోవాలి. ఈ రాజీనామాలతో పార్టీలు పరస్పరం బలాబలాలు చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇక డబ్బు ఖర్చు విషయంలో కూడా మునుగోడు ఉప ఎన్నిక రికార్డులను సృష్టిస్తోందని వినికిడి. ఒక్కో ఓటుకు ముప్పై వేల రూపాయలకు పైనే ఖర్చు అవుతుంది అన్ని పార్టీల తరఫు నుంచి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటు అటుగా నియోజకవర్గానికి రెండు లక్షల ఓట్లు ఉంటాయనుకుంటే.. అన్ని పార్టీలూ కలిపి కనీసం ఐదారు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క ఉప ఎన్నికపై ఖర్చు చేయవచ్చు! భారత ప్రజాస్వామ్యం ఎంత కాస్ట్లీగా మారిపోయిందో ఇలాంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడే తెలుస్తుంది. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సందర్భాల్లో ఇలా ప్రజాస్వామ్య విలువ పెరుగుతూ ఉంటుంది. అంతిమంగా ఈ ఉప ఎన్నిక వల్ల ప్రభుత్వాలు కూలిపోవడం, ఏర్పడటం అనే ప్రసక్తి లేకపోయినా.. రాజకీయ నేతల ఇగోలకూ, ఆత్మవిశ్వాసాలకు ఇదో సందర్భం అవుతోంది.