కోమటిరెడ్డి: రోగి కోరినదే వైద్యుడు ఇచ్చాడు!

రోగి కోరినదే వైద్యుడు ఇచ్చాడని మనకు తెలుగునాట ఒక సామెత ఉంది. ఆ సామెత ఇప్పుడు అచ్చంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అతికినట్టుగా సరిపోతుంది. Advertisement మునుగోడులో స్వయంగా ఆయన తమ్ముడు రాజగోపాల్…

రోగి కోరినదే వైద్యుడు ఇచ్చాడని మనకు తెలుగునాట ఒక సామెత ఉంది. ఆ సామెత ఇప్పుడు అచ్చంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అతికినట్టుగా సరిపోతుంది.

మునుగోడులో స్వయంగా ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న తరుణంలో.. ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, ఎంపీగా చెలామణీ అవుతున్న వెంకటరెడ్డి వ్యవహార సరళి సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఆయన ప్రవర్తిస్తున్న తీరు గమనిస్తే.. పార్టీనుంచి తాను తనంతగా బయటకు వెళ్లకుండా.. పార్టీనే తన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది.

పార్టీనే తనను బహిష్కరించే పరిస్థితి కూడా కల్పించాలని ఆయన కోరుకుంటుండవచ్చు. అలా పార్టీ వెలివేస్తే.. తాను తన దారేదో తాను చూసుకునే ఆలోచన చేస్తుండవచ్చు. బహుశా అలాంటి ఆలోచనతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నిక విషయంలోగానీ, ఇతరత్రా గానీ.. చాలా పెడసరంగా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు! అదే నిజమైతే ఆయన కోరుకుంటున్నట్టుగానే.. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. అక్కడ అనివార్యం చేసిన ఉపఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. తమ్ముడితో ఎంతో సత్సంబంధాలు ఉండే అన్నయ్య వెంకటరెడ్డి మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. ఎంపీగా పదవి అనుభవిస్తున్నారు. 

మునుగోడు ఎన్నిక విషయంలో ఆయన తమ్ముడి ఓటమికి పనిచేయలేరు. కాకపోతే.. నెపం తనమీదకు లేకుండా పీసీసీ మీదకు నెట్టడానికి శతధా తన ప్రయత్నాలు చేస్తున్నారు.

ముందుగా, మునుగోడులో అభ్యర్థిని తనకు తెలియకుండా ప్రకటించారని అలిగారు. కానీ పార్టీ ఆయనకు అ్రగతాంబూలం ఇస్తూ మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ స్టార్ కాంనపెయినర్ గా ప్రకటించింది. అయినా ఆయన మునుగోడులో కాలు పెట్టలేదు. కనీసం, రాహుల్ తెలంగాణలో పాదయాత్ర సాగిస్తుండగా దానికైనా మద్దతు ప్రకటించలేదు. సరిగ్గా రాహుల్  తెలంగాణలోకి రావడానికి కొన్ని రోజుల ముందు ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. 

మునుగోడులో లోకల్ లీడర్ కు ఫోన్ చేసి, తన తమ్ముడు రాజగోపాల్ కు ఓటేయాల్సిందిగా కోరడం, ఏం చేసినా సరే కాంగ్రెస్ గెలవదు అని ఆస్ట్రేలియాలో చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఆయన కోరుకున్నదే చేయదలచుకున్నట్టుగా పార్టీ ఆయన మీద క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. షోకాజ్ నోటీసు జారీ చేసింది. పది రోజుల్లోగా జవాబివ్వాలని హూంకరించింది. 

అయితే.. పార్టీనుంచి తన మీద నెపంలేకుండా జారుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వెంకటరెడ్డి.. ఈ షోకాజ్ కోసమే ఎదురుచూస్తున్నారేమో అనిపిస్తుంది. దీనికి జవాబిచ్చే ప్రక్రియలో.. కాంగ్రెస్ నుంచి వెలుపలికి వెళ్లేలా, లేదా పార్టీనే తనను బయటకు గెంటేసేలా ఒక వాతావరణాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

పార్టీ తెగతెంపులు కావాలనే ఆయన కోరుకుంటున్నారు. కాకపోతే.. తన చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోవాలనేది ఆయన అత్యాశ.