పవన్ కల్యాణ్ పార్టీతో బిజెపి చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నదా? వీరిద్దరి బాంధవ్యాన్ని చూస్తున్న ఎవరూ అవునని చెప్పలేరు. ఇద్దరూ కలిసి ఓ కార్యక్రమం చేయరు.. కనీసం మాట్లాడుకోరు.. ఉమ్మడి కార్యచరణ ప్రణాళిక ఇప్పటిదాకా ఎన్నడూ లేదు. పవన్ కల్యాణ్ తన ఒంటెత్తు పోకడల ధోరణిలో, బిజెపితో సంప్రదించకుండానే తాను చంద్రబాబు పల్లకీ మోయడానికి రెడీ అని ప్రకటిస్తుంటారు.
బిజెపి వాళ్లు పవన్ తో మాటమాత్రమైనా ప్రస్తావించకుండానే.. చంద్రబాబును నానా తిట్లు తిట్టేసి, బాబుతో కలిసి ఎన్నికలకు వెళ్లేది లేనేలేదని.. జనసేనతో కలిసి పోటీచేస్తామని తమంత తాము వెల్లడిస్తారు. ఇలాంటి కాపురం ఎన్నాళ్లు సాగుతుందా.. అని చూసేవారు ముక్కున వేలేసుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఎన్నికల్లోగా బిజెపి కూడా చంద్రబాబుకు జై కొట్టడానికి సిద్ధపడకపోతే.. జనసేనతో సంబంధం చెడుతుందనేది మాత్రం గ్యారంటీ.. అదే జరిగితే.. ఒక మాజీ మంత్రి జనసేనలోకి ఫిరాయించే అవకాశం ఉన్నదని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఏపీలో భారతీయ జనతా పార్టీకి అసలే చెప్పుకోదగిన నాయకులు లేరు. ఏదో పార్టీ పరంగా పదవులు ఉన్నాయి గనుక.. కొందరు మీడియా ముందు వచ్చి హడావుడి చేస్తుంటారు గానీ.. ఒక స్థాయి గల నాయకులు సున్నా అని చెప్పాలి. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. ఆ పార్టీకి ఉండే మాజీ ఎంపీ గవర్నరుగా వెళ్లిపోయాడు. మాజీ మంత్రి ప్రస్తుతం మహా సైలెన్స్ ను పాటిస్తున్నాడు. ఆయన మరెవ్వరో కాదు,.. కామినేని శ్రీనివాస్. బిజెపి తరఫున చంద్రబాబు కేబినెట్లో ఇద్దరు మంత్రులుగా సేవలందించగా.. మాణిక్యాల రావు ఏకంగా చనిపోయారు. కామినేని శ్రీనివాస్.. అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియనంతగా.. చాలా గుంభనంగా ఉంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి.. ఎప్పటిలాగా (పవన్ కల్యాణ్ కోరుకుంటున్నట్టుగా) మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే సరి. అలా జరగకపోతే.. బిజెపినుంచి భారీగానే బయటకు వలసలు ఉండే అవకాశం ఉంది. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరవచ్చుననే ఊహాగానాల సంగతి తర్వాత.. భారతీయ జనతా పార్టీకే చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం.. పార్టీ ఫిరాయించి జనసేనలో చేరుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
కామినేని శ్రీనివాస్ తొలినుంచి పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితులు. 2014 ఎన్నికలకు పూర్వం కూడా తెలుగుదేశం ద్వారా టికెట్ పొందడానికి పవన్ కల్యాణ్ ను ఆశ్రయించారని, ఆయన సూచన మేరకు చంద్రబాబు వద్దకు వెళ్లారని ఒక పుకారు ఉంది. చంద్రబాబు సలహా మేరకు ఆయన బిజెపిలో చేరగా, ఆ సీటును బిజెపికి కేటాయించి.. చంద్రబాబు రెండు రకాలుగా కార్యం నెరవేర్చుకున్నారని అంటుంటారు.
అంతకుమించి ఆయనకు బిజెపితో అనుబంధం ఎంతమాత్రమూ లేదు. పవన్ కల్యాణ్ తో ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి. కాకపోతే.. పొత్తుల సంగతి తేలేదాకా ఫిరాయించే అవసరం లేదు లెమ్మని ఆయన వేచి ఉన్నట్లు సమాచారం. పొత్తుల సంగతి తేలేదాకా ఆయన ఇలాగే నిశ్శబ్దం పాటిస్తారు. జనసేన చెప్పినట్టుగా మాట విని.. బిజెపి చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడితే కామినేని శ్రీనివాస్ బిజెపి తరఫునే బరిలోకి దిగుతారు.
అలా కాకుండా.. బిజెపి వేరుకుంపటి పెట్టుకుంటే మాత్రం.. ఆయన జనసేనలోకి ఫిరాయిస్తారు. ఆ కూటమినుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడంతా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.