తెలుగు సమాజంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పకథకాలతో సంక్షేమ సారథిగా ప్రజల గుండెల్లో కొలువయ్యారు. వైఎస్సార్ వారసుడిగా వైఎస్ జగన్ కూడా తండ్రికి మించి సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు.
సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని తండ్రి జ్ఞాపకాలను వైఎస్ జగన్ నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ వైరల్ అవుతోంది.
‘నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగు లోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’ అంటూ నాన్నను జగన్ పొగడ్తలతో ముంచెత్తారు.
తండ్రికి కేవలం తనయుడిగా మాత్రమే తాను వారసుడిని కాదని, ఆయన ఆశయాలకు కూడా అని జగన్ మరోసారి చాటి చెప్పారు. ఇందుకు తన పాలనే నిదర్శనమని జగన్ ట్వీట్ చెప్పకనే చెబుతోంది.