మైత్రీ మూవీస్ టాలీవుడ్ లోని భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఒకేసారి బోలెడు ప్రాజెక్టులు, బోలెడు అడ్వాన్స్ లు, మరిన్ని ప్లాన్ లు. అందువల్ల విపరీతంగా ఫండ్స్ అవసరం పడతాయి.
దీని కోసం ప్లానింగ్ లో వున్న సినిమాల నాన్ థియేటర్ హక్కులకు కూడా ముందుగానే సేల్ అగ్రిమెంట్ లు చేసేస్తూ వుంటారు. అది ఒక విధంగా లాభమే. వడ్డీ లేని ఫండింగ్ వస్తుంది. కానీ ఒక్కోసారి మైనస్ అవుతుంది.
పుష్ప సినిమా విషయంలో ఇలాగే అయిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. పుష్ప అడియో రైట్స్ ను ఎప్పుడో పురానా జమానా కాలంలో విక్రయించేసారు అప్పట్లో ఉప్పెన-పుష్ప ప్రాజెక్టు అడియో రైట్స్ రెండూ కలిపి అయిదు కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది.
అల వైకుంఠపురములో తరువాత బన్నీ రేంజ్ ఓ రేంజ్ కు వెళ్లింది. ఇప్పుడు అమ్మితే అయిదు కోట్ల వరకు కేవలం పుష్పకే వచ్చేవి. ఇటీవల మహేష్ బాబు సర్కారువారి పాట 4.50 కోట్లకు పవన్ భీమ్లా నాయక్ 5.04 కోట్లకు అడియో రైట్లు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన పుష్ప అడియో మీద రెండు కోట్లు నష్టపోయినట్లే.
అయితే ఇక్కడ ఇంకో లాజిక్ కూడా వుంది. సినిమా ఫైనాన్స్ అంటే కనీసం రెండు రూపాయల వడ్డీ. ఆ లెక్కన చూసుకుంటే కిట్టుబాటే. కానీ ఒకటే సమస్య. ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బంది. తమ హీరో అడియో మూడు కోట్లకే వెళ్లింది. అవతలి హీరో సినిమా హక్కులు అయిదు కోట్లకు వెళ్లాయి అన్నదే వాళ్లు చూస్తారు.