ఒక రాజుగారు అరబ్బు దేశం నుంచి మేలురకం తెల్ల గుర్రాన్ని కొనుక్కురమ్మన్నాడట. సేనాపతి, భటుడు వెళ్లి బేరమాడి కొన్నారు. యాజిటీజుగా తెల్లగుర్రాన్ని పట్టుకొస్తే తమ ప్రత్యేకత ఏముంటుందని దానికి చిత్రమైన మార్పులు చేద్దామనుకున్నాడు సేనాపతి.
తప్పదు కాబట్టి భటుడు ఒప్పుకున్నాడు. అందంగా ఉన్న తెల్లగుర్రం తోకని, మెడ మీదున్న వెంట్రుకల్ని కత్తిరించేసి, ఒంటి నిండా నల్ల చారలు పూసారు. ఎందుకంటే రాజుగారి మెప్పుకోసం సేనాపతికి మార్పు చెయ్యాలన్న ఆలోచనైతే వచ్చింది గానీ, ఏది కత్తిరిస్తే అందం పోతుందో, ఏది తగిలిస్తే అందం పెరుగుతుందో తెలియదు పాపం.
గుర్రానికి, జీబ్రాకి పుట్టినట్టున్న సంకరజాతి జంతువులాగున్న ఆ సరికొత్త గుర్రం రాజుగారికైతే నచ్చింది కానీ, ఆయన దాని మీద ఊరేగుతుంటే జనం మాత్రం గొల్లున నవ్వారట. రాజుగారికి కోపమొచ్చింది. సేనాపతిని పిలిపించాడు. తెలివిగా సేనాపతి ఇదంతా భటుడు చేసిన నిర్వాకమని చెప్పి తప్పించుకున్నాడు.
ఆ తర్వాత ఆ కథ ఎమయ్యిందో గుర్తులేదు కానీ ఇదెప్పుడో చిన్నప్పుడు విన్న కథ. ఇప్పుడు గుర్తురావడానికి కారణం “భీంలా నాయక్”.
ఇక్కడ తెల్లగుర్రం మళయాళ సినిమా “అయ్యప్పయుం కోషియుం”. విచిత్ర జంతువులా మారిన గుర్రం “భీమ్లా నాయక్ష. రాజుగారేమో పవన్ కళ్యాణ్. సేనాపతి త్రివిక్రం. భటుడు దర్శకుడు సాగర్.
ఇద్దరూ కలిసి మేలుజాతి గుర్రాన్ని కంగాళీ చేస్తున్నారన్న సంకేతాలు ఈ రోజు విడుదలైన పాటతో అందాయి. అసలు ఒరిజినల్ మళయాళ చిత్రంలో నటుడు కాకుండా పాత్ర మాత్రమే కనిపించింది. ఇక్కడ పాత్ర కాకుండా పవన్ కళ్యాణే కనపడుతున్నాడు.
ఏదో గొప్ప పురాణపురుషుడు టైపు బిల్డప్పిచ్చారు పాటలో. ఏ చెట్టు కింద పుట్టాడు, ఏ సమయంలో క్యారుమన్నాడు లాంటి వివరాలు చెప్పారిందులో. అక్కడితో చాలదన్నట్టు భీంలా నాయక్ తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు కూడా చెప్పడం అతిశయోక్తికే అతి అనిపించేలా ఉంది.
చింత చచ్చినా పులుపు చావకపోవడంటే ఇదే. మాస్ హీరోని పెట్టి సినిమా తీస్తే మరీ ఇంతిలాంటి కాలం చెల్లిన బిల్డప్ పాటలు పెట్టేయ్యాలా?
ఇక లిరిక్స్ విషయానికొస్తే “సల్లగుండ, పెద్ద గూండా, నిప్పు కొండ, తప్పకుండా” అంటూ రొట్టకొట్టుడు ప్రాస పదాలతో డప్పు వాయించేసారు రామజోగయ్య గారు. ఇది మీ నుంచి ఆశించింది కాదండీ? ఈ టైపు ప్రాస పదాలు ఎలిమెంటరీ స్కూలు పిల్లలు కూడా చెప్తారు కదాండి.
ఒక చోట “భీమ్లా నాయక్” కి ప్రాసకోసం పడిన ప్రయాసలో “లాఠీ గాయక్”, అనే ప్రయోగం చెసారు. లాఠీ గాయకుడేంటో? “టెంపరమెంటు హాటు- పవరుకు ఎత్తిన గేటు- ఆ నేం ప్లేటు”…అంటే ఇక్కడ పవర్ అంటే పవర్ స్టారనే కదా? మరీ ఇంత స్టారు భజనా?
సదాశివాసన్యాసి లాంటి గొప్ప పాటలు రాయగల రామజోగయ్య గారిని వెకిలి ప్రాసలు రాయించి భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు.
ఇంకా ఎన్నాళ్లు భరించాలో ఇలాంటి డప్పు మోతలు. ఫ్యాన్సుకి ఇవే నచ్చుతాయి అంటే..థియేటర్స్ లో ఇలాంటి సినిమాలొచ్చినప్పుడు సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్సుకి జనాలెంతమందొస్తారో తెలియడం లేదు. ఉన్న సినిమాలు కూడా థియేటర్స్ ని వద్దనుకుని ఓటీటీల్లో రిలీజవుతున్నాయి. కొన్ని భయపడి విడుదలలు వాయిదా వేసుకుంటున్నాయి.
ఒక వేళ థియేటర్సులో విడుదలైనా ఆ ఫ్యాన్సున్నది ఎంతమంది? అంతా కలిసి ఈలలేసుకుంటూ ఒక్కరోజులో చూసేస్తారు. మిగిలిన జనమంతా చూసేది ఓటీటీల్లో, టీవీల్లోనూ. కాలం మారింది కదా. ఇలాంటి బిల్డప్ పాటలు ఇంట్లో కూర్చుని చూస్తే అతి ఎక్కువయ్యి వెగటు పుడుతుంది.
ఇలాంటి చేష్టలవల్లే మలయాళ చిత్రరంగానికున్న గౌరవం తెలుగుకి లేకుండా పోతోంది. సొంత పైత్యంతో మాస్ సినిమాలు తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ పరభాషా చిత్రాల హక్కులు కొన్నప్పుడు కూడా ఇలా అసలు రుచిని చెడగొడుతుంటేనే చిరాగ్గా ఉంటుంది.
శైలజ రమేష్ అన్నంగి