వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కీలకనేత విజయసాయిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. విశాఖలో వైఎస్సార్ వర్ధంతి సభ ఇందుకు వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ 12వ వర్ధంతిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి.
విశాఖలో వైఎస్సార్ విగ్రహానికి విజయసాయిరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వర్ధంతి సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోను కావడం గమనార్హం.
తన పేరుపై ఎవరైనా అక్రమాలకు పాల్పడుతుంటే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. తనకు డబ్బుపై ఆశ లేదని, హైదరాబాద్‌లో సొంతిల్లు కూడా లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్టు తెలిపారు.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకో గానీ, తనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారన్నారు. విశాఖలో స్థిరపడాలనే ఆశ ఉందన్నారు. అదే జరిగితే, భీమిలి సమీపంలో నాలుగైదు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, అక్కడే ఇల్లు కట్టుకుని తుదిశ్వాస విడచాలని ఉందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. తనపై భూఆక్రమ ణల ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలో రెండు టోల్‌ఫ్రీ నంబర్లు ఇస్తానని, ఎవరైనా తనపేరుతో దందాలకు పాల్పడితే, వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.