ఈ సారి సంక్రాంతికి వస్తున్నన్ని సినిమాలు గతంలో ఎప్పుడూ రాలేదేమో. ప్రస్తుతానికి వున్న పరిస్థితి అది. సంక్రాంతికి వస్తున్న తమిళ డబ్బింగ్ సినిమా లాల్ సలామ్. కేవలం విష్ణు విశాల్ హీరో గా వస్తున్న సినిమా అయితే పెద్దగా మాట్లాడుకునేది వుండేది కాదేమో?
రజనీ కాంత్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుండడం, లైకా, రెడ్ జయింట్ మూవీస్ లాంటి రెండు పెద్ద సంస్థలు కలిసి నిర్మింస్తుండంతో ఈ సినిమా మీద ఆసక్తి కలుగుతోంది. పైగా మన సినిమాలు తమిళనాట విడుదల కావాలనుకుంటున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు అక్కడ వున్నాయి. వాటి ముందు మనవాటికి ప్రయారిటీ ఏ మేరకు వుంటుందన్నది అనుమానమే.
ఈ సంగతి అలా వుంచితే ఈ లాల్ సలామ్ టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసారు. కేవలం జస్ట్ ఓ కమర్షియల్ సినిమా కాదు ఇది అర్థం అవుతోంది టీజర్ చూస్తుంటే. సమాజంలో పెరిగిపోతున్న హిందూ ముస్లిం అసమానతల నేపథ్యంలో ఈ కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. దానికి క్రికెట్ గేమ్ ను థ్రెడ్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ఓ ఊరిని దేశానికి సింబల్ గా తీసుకుని చిత్రీకరణ సాగిందనుకోవాలి.
టీజర్ లో ఓ మాంచి ఫైట్ సీన్ తో పాటు, మతసామరస్య సన్నివేశాల్లో రజనీ కనిపించారు. రజనీ కుమార్తెనే దర్శకురాలు ఈ సినిమాకు. మేకింగ్, క్రియేషన్ లో క్వాలిటీ కనిపిస్తోంది. సినిమాకు కమర్షియల్ టచ్ ఏమేరకు వుంటుంది అన్న క్లారిటీ మాత్రం టీజర్ లో లేదు. రాను రాను వదిలే కంటెంట్ లో వుంటుందేమో?