టాలీవుడ్ లో చిన్నోడు-పెద్దోడు అనే ఉపమానానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో మహేష్ బాబు చిన్నోడు, వెంకటేష్ పెద్దోడుగా స్థిరపడిపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ తో రాముడిగా రామ్ చరణ్, భీముడిగా ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడీ చిన్నోడు-పెద్దోడు, రాముడు-భీముడు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు.
రామ్ చరణ్ దీపావళి సందర్భంగా తన ఇంట్లో గెట్-టు-గెదర్ ఏర్పాటుచేశాడు. ఈ పార్టీకి వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు. కుటుంబాలతో పాటు రామ్ చరణ్ ఇంటికొచ్చిన ఈ హీరోలు, ఆనందంగా కొంత సమయం గడిపారు. అలా దిగిన ఫొటోలు, సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి, ఆ వెంటనే ఆటోమేటిగ్గా వైరల్ అయ్యాయి.
అనుమానాలకు చెక్.. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య చిన్న గ్యాప్ వచ్చిందనే ప్రచారం బాగా నడిచింది. మరీ ముఖ్యంగా ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చినట్టు ఊహాగానాలు చెలరేగాయి. ఒకదశలో చరణ్ ను మించి తారక్ కు హాలీవుడ్ లో ప్రాధాన్యం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చరణ్ రంగంలోకి దిగిన వెంటనే, తారక్ కు అన్యాయం జరిగినట్టు కథనాలు చూశాం.
తాజాగా జరిగిన పార్టీతో ఈ పుకార్లన్నింటినీ హోల్ సేల్ గా చెక్ పడింది. అన్నట్టు ఈ పార్టీకి అల్లు అర్జున్ హాజరయ్యాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. రిలీజ్ చేసిన ఫొటోల్లో ఎక్కడా బన్నీ కనిపించలేదు, బన్నీ భార్య మాత్రం ఉంది. ఈ పార్టీలో మహేష్ బాబు భార్య, ఎన్టీఆర్ భార్య బాగా ఎంజాయ్ చేశారంట.