ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ.. మరీ ముఖ్యంగా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై వరల్డ్ లోకి తారక్ ఎంట్రీ.. చాన్నాళ్లుగా నలుగుతున్న ఈ మేటర్ పై ఈరోజు పూర్తి స్పష్టత వచ్చింది. హృతిక్ రోషన్ హీరోగా రాబోతున్న వార్-2 సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఈరోజు రిలీజైన టైగర్-3 సినిమాతో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
సల్మాన్ హీరోగా నటించిన టైగర్-3 ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్ లో వార్-2కు లీడ్ ఇచ్చారు నిర్మాతలు. కబీర్ (హృతిక్)కు కల్నల్ లూథ్రా (అశుతోష్ రాణా) కాల్ చేస్తాడు. ఓ భయంకరమైన వ్యక్తిని పరిచయం చేస్తాడు.
ఇండియాకు ఓ కొత్త శత్రువు తయారయ్యాడు. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ఎలా ఉంటాడో తెలీదు, అతడి పేరు కూడా తెలీదు. పూర్తిగా చీకట్లోనే ఉంటాడు. అతడిని ఎదుర్కోవాలంటే నవ్వు కూడా చీకట్లోకి వెళ్లాలంటూ హృతిక్ కు చెప్పే సీన్ అది. అతడితో పోరాటం మరణం కంటే ప్రమాదం అంటూ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది.
నేరుగా ఎన్టీఆర్ పేరు చెప్పనప్పటికీ, ఆ ఎలివేషన్ మొత్తం తారక్ పాత్రదే అనే విషయం ఆడియన్స్ కు అర్థమైపోయింది. ఈ సినిమాలో తారక్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఆ మేటర్ ఈరోజు కన్ ఫర్మ్ అయింది.
నెగెటివ్ షేడ్స్ లో కనిపించడం ఎన్టీఆర్ కు కొత్త కాదు. జై లవకుశలో ఓ క్యారెక్టర్ లో అతడు నెగెటివ్ గా కనిపించాడు. అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై వరల్డ్ లో విలన్లు కూడా అప్పుడప్పుడు హీరోలుగానే కనిపిస్తారు. ధూమ్ ఫ్రాంచైజీలో జరిగిందిదే. కాబట్టి వార్-2లో కూడా ఎన్టీఆర్ పాత్రకు ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చి ఉంటారని టాక్.