Advertisement

Advertisement


Home > Politics - Opinion

జనసేన.. డొల్లే డొల్ల!

జనసేన.. డొల్లే డొల్ల!

ప్రధాని నరేంద్రమోడీ నాకు ఆత్మీయ మిత్రుడు- అని, వేదిక మీద  ఆయన లేని, సభలలో చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఆయన సమక్షంలో ‘నాకు పెద్దన్నయ్య’ అని చెప్పుకోగల స్థాయికి రావడం ప్రమోషనే! ఈ ప్రమోషన్ కోసమే పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని బిజెపితో పొత్తు బంధంలోకి దించి.. తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారా? ఈ పోటీ ద్వారా ఆయన తన జనసేన పార్టీకి రాజకీయ లబ్ధిగా రాబట్టుకుంటున్నది ఎంత? పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా పరువు ప్రతిష్ఠల పరంగా పోగొట్టుకుంటున్నది ఎంత? ఇక్కడ ఎదురుకాగల దెబ్బలకి.. ఏపీలో అంతో ఇంతో ఘనంగా కనిపిస్తున్న పార్టీకి జరిగే నష్టం ఏమిటి?

తెలంగాణ బరిలోకి పార్టీ దిగుతున్న వైనం గమనిస్తే.. వాపు బలుపు లాంటి పదబంధాల పోలికలు పనికేరావు. పైన ఉన్న పటాటోపంతో ఏమాత్రం నిమిత్తం లేదు.. లోన ఉన్నదంతా డొల్లే డొల్ల అని అర్థమవుతుంది. తెలంగాణ ఎన్నికలు.. ఏపీ రాజకీయాలలో కీలకమైన ఎలిమెంట్ గా భావిస్తున్న జనసేన పార్టీపై చూపగల ప్రభావం గురించిన విశ్లేషణే.. ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ  ‘‘తెలంగాణలో బయల్పడిన వైఫల్యం.. ఏపీలోనూ ప్రభావం! జనసేన.. డొల్లే డొల్ల!’’

రాజకీయ పార్టీలు తమ తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి, ‘ఈ భూ ప్రపంచం మీద ఉన్న ఏకైక మార్గం ఎన్నికలు మాత్రమే’ అని భావిస్తుంటాయి. నిజానికి రాజకీయ పార్టీలకు ఎన్నికలు ఒక్కటే జీవిత పరమార్ధం కానే కాదు! ఈ సత్యం అవగాహన చేసుకున్న పార్టీలు ఎన్ని ఉన్నాయి మనకు? వేళ్ళ మీద కూడా లెక్కపెట్టలేం మనం! కనుచూపుమేరలో అలాంటివి కనిపించవు!! 

రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ప్రజలకు మేలు చేయడానికి తమ జీవితాన్ని అంకితం చేశామని, ప్రజాసేవలోనే జీవితం సమస్తం వెళ్లబుచ్చుతామని, ప్రజల కష్టాల ను తీర్చడానికి చేసే పోరాటాలలోనే తరించిపోతామని.. పార్టీ పెట్టిన ప్రతి రాజకీయ నాయకుడు చాలా ఘాటుగా సెలవిస్తూ ఉంటారు. కానీ వారు ఒక పడికట్టు పదబంధంలాగా వాడే ‘ప్రజాసేవ’ అనే పదానికి- ‘అధికారం ఉంటే తప్ప సాధ్యం కాదు’ అనే ‘ఇఫ్ క్లాజు’ జోడించి ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతుంటారు. అందుకనే ఎన్నికలలో పోటీ చేయడం రాజకీయ పార్టీ జీవిత పరమావధి అని- రాజకీయ అస్తిత్వ నిరూపణకు అదొక్కటే మార్గం అనే భ్రమలలోనే జీవిస్తూ ఉంటారు.

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పైన చెప్పుకున్న సిద్ధాంతానికి అతీతమైన పార్టీ ఎంతమాత్రమూ కాదు. ఆత్మ వంచనతో కూడిన ఇలాంటి సిద్ధాంతాన్ని పవన్ కల్యాణ్.. చాలా తరచుగా (దాదాపుగా ప్రతి మీటింగులోనూ) ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. ‘‘మీరు నా పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపి ఉంటే గనుక.. నేను మీకోసం చాలా చేసి ఉండేవాడిని. ఇప్పుడు నేనేం చేయగలను?’’ అని ప్రశ్నించడం, ప్రజల్ని నిందించడం ఆయన తీరు. 

ఏపీలో ఒక్కడినైనా గెలిపించారు కదా.. మరి అతను పార్టీలోనే నిలబడ్డాడా? అంటే.. అతను మోసగాడు అన్నట్లుగా పవన్ మాట్లాడతారు. అలాంటి మోసగాళ్లను, నిబద్ధత లేని వ్యక్తులను, పార్టీ అభ్యర్థులుగా మోహరించి.. నన్ను గెలిపించలేదు.. అని దీనాలాపాలు చేయడం ఏమిటో.. ఆయనకే తెలియదు. అలాంటి వారితో ఎలాంటి లాలూచీ పడి ఎంపికచేశాడో.. బయటకు చెప్పగల ధైర్యం పవన్ కు ఉండదు. నిజం చెప్పాలంటే.. తాను ప్రవచించే సిద్ధాంతాలకు తగినట్టుగా ఎంపికచేసి.. బరిలో దించడానికి ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. సిద్ధాంతాలకు తగవిన వారే కాదు కదా.. అసలు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి నిలబడగలవారే లేరు. అందుకే పరిస్థితి ఎన్నిక దాకా వచ్చినప్పుడు జనసేన పార్టీలోనొ డొల్లతనం బయల్పడిపోయింది.! ఆ పార్టీ వారు దీనిని ఒప్పుకోకపోతే.. వారికి ఆత్మహత్యా సదృశం అవుతుంది.

తెలంగాణ రాజకీయాల్లో కొన్ని పార్టీలు ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. మరికొన్ని పార్టీలు తమ అస్తిత్వాన్ని పూర్తిగా ఏపీకి మాత్రమే పరిమితం చేసుకున్నాయి. ఈ వరుసలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నాయి. నిజానికి జనసేన పరిస్థితి కూడా అంతే. కానీ.. పవన్ లో ఏదో ఆశ. తాను తెలంగాణలో నివాసం ఉంటున్నాడు కాబట్టి.. తన సినిమాల షూటింగులు గరిష్టంగా అక్కడ జరుగుతాయి కాబట్టి, తన సినిమాల మార్కెట్ అక్కడకూడా బలలంగా ఉంటుంది కాబట్టి.. ఆ రాష్ట్రంలో కూడా రాజకీయ అస్తిత్వాన్ని చాటుకుంటే.. కాస్త బిజినెస్ బాగుంటుందని ఊహ! పైగా ఆయనను, పార్టీని నమ్ముకుని తెలంగాణలో పార్టీ పెట్టిన నాటినుంచి కష్టపడుతున్న నాయకులు కూడా అనేకులు ఉన్నారు.

ఎన్నికల్లో కూడా పోటీచేయకపోతే వారి పరిస్థితి ఏమిటి. గెలుపు సంగతి తర్వాత.. కనీసం ఎన్నికల్లోకి దిగితే.. తద్వారా దక్కగల ప్రయోజనాలు, సాధించగల అభివృద్ధిపై ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. మొత్తానికి పవన్ కల్యాణ్ మౌఖిక అనుమతితో.. తాము తెలంగాణలో 35 స్థానాల్లో పోటీచేయబోతున్నట్టుగా జనసేన ప్రకటించింది. స్థానాల జాబితాను మాత్రం వెలువరించింది.

అక్కడినుంచి మలుపుల రాజకీయం షురూ అయింది. భారతీయ జనతా పార్టీని వారిని ఆశ్రయించడం.. నాలుగేళ్లుగా ఎన్డీయే  భాగస్వామిగా కాదు కదా, అసలు ఒక పార్టీగానే జనసేనను గుర్తించకుండా చులకన చేసిన వారితోనే పొత్తులకు సిద్ధపడడం జరిగింది. చాలా రోజులు నడిచిన పంచాయతీ తర్వాత.. 9,10,11 అంటూ లీకులు రాగా.. చివరికి జనసేన పార్టీకి 8 సీట్లను మాత్రం భాజపా కేటాయించింది. సీట్లకోసం పట్టుబట్టడమూ వాటిని పొందడమూ బాగానేఉంది. కనీసం అక్కడ పోటీచేయించడానికి పార్టీకి అభ్యర్థులు ఉన్నారా? ఆ విషయంలో జనసేన బలహీనత బయటపడిపోయింది. పార్టీ పైకి ఎన్నికబుర్లు చెప్పుకున్నప్పటికీ లోన మొత్తం డొల్లే అనే సంగతి తేలిపోయింది.

8 స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో కేవలం అయిదుగురు మాత్రమే.. పార్టీతో ముందునుంచి అనుబంధం కలిగి ఉన్న వారు. 8 లో 3 స్థానాలకు కనీసం తమ సొంత అభ్యర్థులకు గతిలేని, ఫిరాయించి వచ్చిన వారికి టికెటివ్వడమే తప్ప వేరే దోవ లేని దీనస్థితిలో ఆ పార్టీ ఉంది. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ముందురోజు వరకు బిజెపి టికెట్ కోసం ప్రయత్నించిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ హఠాత్తుగా జనసేనలోకి ఒక గెంతు వేసి టక్కున టికెట్ పట్టేశారు. కొత్తగూడెం అభ్యర్థి లక్కినేని సురేందర్ రావు, అశ్వారావు పేట అభ్యర్థి ముయబోయిన ఉమాదేవీ.. రెండు రోజుల ముందే ఆ పార్టీలో చేరారు. ఈ ఫిరాయింపులే గనుక లేకపోతే.. జనసేనకు కేండిడేట్లకు దిక్కులేదన్నమాటే!

ఈ వక్రతకు చంద్రబాబే గురువు!

పవన్ కల్యాణ్ లో ఇలాంటి వక్రమైన ఆలోచనలకు చంద్రబాబునాయుడు గురువు అని చెప్పాలి! తన సొంత అవసరాల నిమిత్తం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే సమయంలో.. ఆయన అనుసరించే అనేక వక్ర వ్యూహాలలో ఇది కూడా ఒకటి. పార్టీ టికెట్ కోసం తనను ఆశ్రయిస్తున్న వారిని, పొత్తులు పెట్టుకుంటున్న పార్టీ లోకి చేరాల్సిందిగా మార్గదర్శనం చేయడం. ఆ ఫలానా పార్టీలో చేరిన తర్వాత.. వారు కోరిన స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించడం అనేది చంద్రబాబు తెలివితేటలు. 

ఇందుకు ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది. 2014 ఎన్నికల సమయంలో.. పవన్ కల్యాణ్ కు దగ్గరి మిత్రుడైన కామినేని శ్రీనివాస్.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాల్సిందిగా పవన్ కల్యాణ్ ను ఆశ్రయించారు. ఆటోమేటిగ్గా పవన్, తాను వెళ్లి చంద్రబాబునాయుడును సంప్రదించారు. తనకు చాలా ఇంపార్టెంట్ ఆబ్లిగేషన్ అని కూడా చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడు చాలా తెలివిగా, కామినేని శ్రీనివాస్ ను భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా గైడ్ చేశారు. ఆయన కోరుతున్న ఎమ్మెల్యే స్థానాన్ని పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం, ఆ పిమ్మట చంద్రబాబు ఆశీస్సులు ఎటూ ఉన్నాయి గనుక.. మంత్రి కూడా అయిపోవడం చాలా సహజంగా జరిగింది. చంద్రబాబు- పవన్ మధ్య జరిగిన అనేక రాయబారాల సందర్భాల్లో కూడా కామినేని శ్రీనివాస్ చాలా కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఇదే ఆలోచనను ఇప్పుడు పవన్ కల్యాణ్ మరోసారి ప్రయోగించారా? అది వికటించిందా? చివరికి అలాంటి వక్రమైన ఆలోచన వలన తన పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. కూకట్ పల్లి జనసేన అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పేరును ప్రకటించినప్పుడు.. ఆయనతో పవన్ కల్యాణ్ కు ఎంతోకాలం నుంచి ఉన్న ఆత్మీయ బంధాన్ని అందరూ నెమరు వేసుకున్నారు. ఆయన ఎప్పటినుంచో పవన్ కు సన్నిహితులని, ఎంతో కాలంగా పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఉన్నారని డప్పు కొట్టుకున్నారు. మరి అంత ప్రేమ ఉన్న ప్రేమకుమార్.. అప్పటిదాకా జనసేనలో ఎందుకు చేరలేదు. ముందురోజు సాయంత్రం వరకు కూడా.. భారతీయ జనతా పార్టీలో ఉండి.. అక్కడ టికెట్ కోసం తీవ్రస్థాయిలో ఎందుకు ప్రయత్నాలు చేశారు. జనసేనలో ఇలా చేరిన వెంటనే అలా టికెట్ ఎలా దక్కించుకోగలిగారు? అనేది ప్రశ్న.

పవన్ కల్యాణ్ కు ఇరకాటం కలిగించే వ్యవహారం ఇది. ఎందుకంటే.. ప్రేమకుమార్ తమకు ఎంతోకాలం నుంచి సన్నిహితుడు అని చెప్పుకుంటే గనుక.. ముందురోజు వరకు బిజెపిలో ఎందుకు ఉన్నాడనే ప్రశ్నకు ఆయన వద్ద జవాబు ఉండదు. బిజెపి నుంచి ఫిరాయించి కొన్ని గంటల వ్యవధిలో జనసేన టికెట్ దక్కించుకున్న నేపథ్యంలో ఆ విషయాన్ని ఒప్పుకుంటే గనుక.. కూకట్ పల్లి వంటి ఇంపార్టెంట్ నియోజకవర్గంలో కూడా.. ఫిరాయించిన వారు వస్తే తప్ప తమ పార్టీ తరఫున జనసేనకు అభ్యర్థికి కూడా దిక్కులేదని సంకేతాలు వెళతాయి.  ఆ రకంగా పవన్ కల్యాణ్ తన పరువు తాను తీసుకున్నారు. 

గతిలేనితనంలో దొందూ దొందే!

భారతీయ జనతా పార్టీకి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో పరిశీలించినప్పుడు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఠికానా లేదు. కమ్యూనిస్టులకు బలమైన జిల్లాగా భావించే ఆ ప్రాంతంలో తమను పట్టించుకునే వారు లేరని గతంలో ఆ పార్టీ నాయకులే నిర్మొగమాటంగా చెప్పుకున్నారు. అందుకోసమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారాసను వీడినప్పుడు.. ఆయనను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 

‘తాను పార్టీకి ఉపయోగపడడం మాత్రమేనా.. పార్టీ తనకు ఉపయోగపడుతుంది కూడానా..’ అని అనేక విధాలుగా తర్కించుకున్న పొంగులేటి.. తనను పార్టీ వాడుకుంటుంది తప్ప , తనకు దక్కే ప్రయోజనం లేదని డిసైడ్ అయ్యారు. చేరడానికి నో అన్నారు. బిజెపికి అది పెద్ద షాక్.. కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలో ఉన్నారు గనుక.. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారనే ప్రచారం చేసుకుంటూ.. తాము ఎంత కొమ్ములు తిరిగిన వారినైనా రకరకాల తాయిలాలు చూపి ఆకర్షించగలం అనుకున్న వారికి ఈ తిరస్కారం మింగుడు పడలేదు.  ఖమ్మం జిల్లాలో మా పార్టీకి బలం లేదు.. అని ఈటల స్వయంగా చెప్పుకున్నది కూడా ఆ సందర్భంలోనే.

అలాంటిది.. జనసేనకు ఇచ్చిన ఎనిమిది సీట్లలో నాలుగింటిని ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోనే బిజెపి కేటాయించింది. తాము ఎప్పటికీ గెలిచే అవకాశం లేని ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావు పేట స్థానాలను కేటాయించింది. ఆరకంగా తాము డిపాజిట్లు కోల్పోయే స్థానాల సంఖ్యను తగ్గించుకోవడానికే బిజెపి , జనసేనతో పొత్తు పెట్టుకున్నదా అనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.

ఆ జిల్లాలో దక్కిన నాలుగుసీట్లలో రెండు చోట్ల పవన్ కు కూడా అభ్యర్థులు లేరు. కొత్తగా చేరిన వారే దిక్కయ్యారు.  తమకు గతిలేని జిల్లాను, అభ్యర్థులకు కూడా గతిలేని జనసేన మీదికి నెట్టేసి బిజెపి చేతులు దులుపుకుంది. దక్కిన ఎనిమిదింటిలో మూడు సీట్లను కొత్తవవారికి కట్టబెట్టిన జనసేన.. పొత్తులు లేకుండా, తాము ముందుగా ప్రకటించినట్టుగా 32 స్థానాల్లో పోటీచేయాల్సి వచ్చి ఉంటే గనుక.. మరెంతగా అభాసుపాలై ఉండేదో, అపహాస్యం పాలయ్యేదో అర్థం చేసుకోవచ్చు. 

ఇదో వికటప్రయోగం.. ఏపీలో బలహీనం..

తెలంగాణలో జనసేన పోటీ అనేది వికటించిన ప్రయోగం. ఇప్పటికే సగం నిరూపణ అయిన ఆసంగతి డిసెంబరు మొదటి వారంలో పూర్తిస్థాయిలో తేలిపోతుంది. తెలంగాణలో వచ్చినా పోయినా ఫరక్ పడదని పవన్ కల్యాణ్ చేతులు దులుపుకోవచ్చు. కానీ.. ఆయనకు తెలియకుండానే.. ఈ పరిణామాల ప్రభావం ఏపీ రాజకీయాల మీద ఉంటుంది. అక్కడ పార్టీ బలహీన పడుతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి.

ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన తెలంగాణ వైఫల్యాన్ని చులకన చేస్తూ.. పవన్ కల్యాణ్ ను అవమానిస్తూ శరపరంపరగా విమర్శలు కురిపిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. అసలే నోటిదూకుడు పుష్కలంగా ఉండే కొందరు వైసీపీ నేతలు ఇక పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని ఏ రకంగా ఆడుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే.. అక్కడ బిజెపితో, ఇక్కడ తెదేపాతో పొత్తులతో అవకతవక ప్రయోగాలు చేస్తున్న పవన్ కల్యాణ్ మీద మాటల దాడి బాగా పెరుగుతుంది. వారు ఎంతగా పవన్ ను తిట్టిపోసినా సరే.. వైసీపీ ద్వారా పవన్ కల్యాణ్ కు జరిగే నష్టం చాలా తక్కువ. అసలు ప్రమాదం తెలుగుదేశం మరియు ఇతర మార్గాలలోనే పొంచి ఉంది.

జనసేనను, పవన్ కల్యాణ్ ను.. అవకాశవాద ద్రోహచింతన గల వారిగా ఏపీలోని తెలుగుదేశం అభిమానులు, ప్రధానంగా కమ్మవారు గుర్తిస్తారు.. ఆమేరకు ప్రచారం చేస్తారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ గెలవకుండా చూడడానికి.. తమ అధినేత చంద్రబాబునాయుడు.. ఆ రాష్ట్రంలో ఎంతో క్షేత్రస్థాయి బలం ఉన్న తెలుగుదేశం పార్టీనే పోటీకి దూరం ఉంచినతీరును వారు గుర్తుచేస్తారు. చంద్రబాబు సంకల్పం ఒక తీరుగా ఉంటే.. దానికి విరుద్ధంగా.. పవన్ కల్యాణ్ వ్యవహరించడం వారికి ద్రోహంగా కనిపిస్తుంది. చంద్రబాబుతో స్నేహం కూడా పవన్ కల్యాణ్ అవకాశం వాదం మాత్రమే అని వారు ప్రచారం చేస్తారు. రేపు ఏపీలో పార్టీ అధినేతల మధ్య బంధం బాగుండి పొత్తులతో బరిలోకి దిగనుండగా.. కమ్మ వర్గం- తెలుగుదేశం వీరాభిమానులు మాత్రం జనసేనకు ఈ కారణాల వలన చేటుచేసే అవకాశం ఉంది. జనసేన అభ్యర్థులకు సహకరించే విషయంలో తేడా చేయడం, పైకి మెత్తగా కనిపించి లోలోన వారిని ఓడించడానికి ప్రయత్నించడం జరుగుతుంది.

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రతిజ్ఞ చేసి పొత్తులు పెట్టుకున్న పవన్ కల్యాణ్..  తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే చర్చ వస్తుంది. తెలంగాణలో భారాసతో లాలూచీ పడినదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపాతో చేతులు కలపడం అంటే.. పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ తో లాలూచీ పడడమే అని అనుకునే వారు పెరుగుతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి, తద్వారా కేసీఆర్ మళ్లీ సీఎం కావడానికి పవన్ కల్యాణ్ పాటు పడ్డారనే విమర్శలు తప్పవు.

వీటిని మించిన ప్రమాదం.. చంద్రబాబు వైపు నుంచే ఉంది. ఏపీలో పొత్తులు కుదుర్చుకోవడంలో భాగంగా.. సీట్ల సంఖ్యకోసం బేరమాడగల ‘పవర్’ ఈ పవర్ స్టార్ కు సన్నగిల్లిపోతుంది. ‘‘అక్కడ 8 సీట్లు పుచ్చుకుని.. నువ్వెన్ని గెలిచావు.. కాబట్టి ఓవరాక్షన్ చేయకుండా ఏపీలో ఇచ్చిన సీట్లు పుచ్చుకుని.. మా గెలుపుకోసం కష్టపడు.. నీ రాజకీయ భవిష్యత్తు సంగతి మేం చూసుకుంటాం..’’ తరహా నాటకీయమైన డైలాగులో చంద్రబాబునాయుడు మైండ్ గేమ్ ఆడే ప్రమాదం ఉంది.

119 స్థానాలలో 8 పుచ్చుకుంటే.. 175లో నీకెన్ని ఇవ్వాలి.. అనే చర్చ వచ్చిందంటే.. పవన్ కల్యాణ్ పని మటాషే. ఆయన కోరుకుంటున్న 30 కూడా దక్కవు. అలాంటి మైండ్ గేమ్ లో చంద్రబాబు నిష్ణాతుడు. చెప్పుకోడానికి తెలంగాణలో 8 సీట్లు దక్కాయి అంతే. నిజానికి అభ్యర్థులకు గతిలేని మూడును తీసేస్తే.. జనసేనకు దక్కింది అయిదు సీట్లే అనుకోవాలి. పంపకంలో ఈ దామాషా తెరపైకి వస్తే.. పవన్ కు గింగిరాలు తిరుగుతాయి. తెలంగాణ ఫలితాలను బూచిగా చూపిస్తూ.. పవన్ కల్యాణ్ అడిగే సీట్ల విషయంలో చంద్రబాబునాయుడు చాణక్యం ప్రదర్శిస్తారు. 

రాజకీయ అవగాహన లేమికి అతిపెద్ద నిదర్శనం అయిన పవన్ కల్యాణ్.. ఆయన ఎత్తుల ముందు ఖచ్చితంగా బోల్తా కొడతారు. ఇప్పటిదాకా చేసిన ప్రతిజ్ఞల నేపథ్యంలో పొత్తుల నుంచి వెనక్కు వెళ్లలేరు. (నిజానికి వెనక్కు వెళ్తే ఏపీలో అన్నిచోట్ల అభ్యర్థులను వెతుక్కోవడానికి వారికి ఏడాది పడుతుంది!) అలాగని పొత్తులతో ముందుకు వెళ్తే..చంద్రబాబునాయుడే పరమపద సోపాన పటంలో పెద్దపాములాగా మింగేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలా పవన్ పార్టీ ఏపీలోకూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

రాజకీయ అవగాహన అధినేతకు లేకపోవడం అనేది పెద్ద నేరమో, ఘోరమో కాదు. కానీ లేని బలాలను అతిగా ఊహించుకుంటూ రెచ్చిపోయి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఆత్మహత్యా సదృశమే అవుతాయి. ఇప్పుడు తెలంగాణలో అలాంటి నిర్ణయాలతో.. రేపు ఏపీలోకూడా అలాంటి ఫలితాలను చవిచూడబోతూ.. పవన్ కల్యాణ్ ఈ సిద్ధాంతానికి ఒక ఉదాహరణగా నిలుస్తారు.

.. ఎల్.విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?