‘అతి సర్వత్ర వర్జయేత్’ అని మన పెద్దలు చాలా మామూలుగా అనేక సందర్భాల్లో సలహా ఇచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో వెటకారానికి ఉపయోగించే మాటలాగా కూడా ఇది ధ్వనిస్తుంటుంది. ఆహార నిద్రా భయ మైథునం చ సామాన్యమే తత్ పశుభిర్నరాణామ్ అన్నట్టుగా.. ప్రతి జీవికి కూడా సర్వసాధారణమైన తిండి నిద్ర భయం రతి విషయాలలో కూడా ‘అతి’ పనికిరాదు. సామాన్యమైన సంగతుల నుంచి సంపదల దాకా ఇది వర్తిస్తుందని గుర్తించిన వారు ధన్యులు.
అయితే ‘ఏ విషయంలోనైనా అతిని విడిచి పెట్టాలి’ అని మనకు మార్గదర్శనం చేసే ఈ మాట లాగానే.. మరో సంగతిని కూడా మనం గ్రహించాలి. జీవితానికి అలవరచుకోవాలి. ఏ సందర్భంలోనైనా సరే.. కోపాన్ని విడిచిపెట్టాలి! అంటే ‘కోప సర్వత్ర వర్జయేత్’ అంటూ మనకు మనం ఒక జీవితనియమాన్ని నిర్దేశించుకోవాలి.
సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ‘ఉత్తమే క్షణ కోపస్యాత్/ మధ్యమే ఘటికా ద్వయం/ అధమస్య అహోరాత్రం/ పాపిష్ఠే మరణాంతకం’’ అనేది ఆ శ్లోకం. ఉత్తముడికి కోపం వస్తే క్షణ కాలం ఉంటుందిట. మధ్యముడికి కోపం వస్తే రెండు ఘడియలు అంటే సుమారుగా 48 నిమిషాలు! అదే అధముడి విషయంలో ఒక రోజంతా (రాత్రీ పగలూ) ఉంటుందిట. పాపిష్టి వాడికి కోపం వస్తే మాత్రం వాడు చచ్చేదాకా పోదుట!
ఒక మంచి ఉదాహరణ చెప్పుకుందాం. పసితనంలో- తల్లి మనల్ని కోప్పడుతుంది.. చిటికెలోనే మళ్లీ పిలిచి ప్రేమను కురిపిస్తుంది. గోరుముద్దలు చేసి తినిపిస్తుంది. కొట్టిన తల్లి మీద కోప్పడి మనం దూరం వెళ్లిపోతాం. క్షణాల వ్యవధిలోనే ఆమె ఒడిని చేరుకుని గారాలు పోతాం. వయసు పెరుగుతున్న కొద్దీ మనకు కోపం వస్తే తిరిగి మెత్తబడే వ్యవధి పెరుగుతూ ఉంటుంది. ఊహ తెలిసి ఎదిగే వయసులో అమ్మ కొడితే అలిగి ఓ గంట సేపు భీష్మించుకుంటాం. కానీ ఆకలి వేసే వేళకు అమ్మ చేతి బువ్వ కావాల్సిందే. అప్పుడిక కోప కారణాలు గుర్తుండవు, చిన్నవిగా అనిపిస్తాయి. చచ్చేదాకా- తనలో రేగే కోపం కొనసాగే వ్యవధిని పెంచుకుంటూ పోకుండా.. చిటికెలో కోపాన్ని మరచిపోగల పసితనాన్ని తన హృదయంలో కాపాడుకోగలిగిన వారు మహనీయులు.
ఒకప్పటి మీ కోప కారణాలు ఇప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తే.. అప్పట్లో నేనింత అసహ్యంగా వ్యవహరించానా? అని మీ కోపం గురించి మీకే బాధ కలిగితే.. అప్పటినుంచి ఇప్పటివరకు మీలో ఎదుగుదల ఉన్నట్టు లెక్క. ఇప్పుడు కూడా మీలో పుట్టిన కోపం ఎంత త్వరగా మిమ్మల్ని విడిచి వెళ్లిపోతోంది.. అనే ప్రమాణమే.. ‘కోపం’ విషయంలో మీ వ్యక్తిత్వానికి ప్రతీక. మీకు కోపం రాగానే, అందుకు దారితీసిన కారణాలు అవివేకంగా, వెర్రిగా మీకు అనిపిస్తే మీ ఎదుగుదల గొప్పది.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।।
(భగవద్గీత- సాంఖ్యయోగం; 2-63)
‘కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది. అది స్మృతి భ్రమను కలుగజేస్తుంది. దానివలన బుద్ధి నశిస్తుంది. చివరికి బుద్ధి నాశనం వలన మనిషి పతనం అవుతాడు!’ అని ఈ శ్లోక భావం. భగవద్గీత శ్లోకాల జోలికి వెళ్లకుండా మొత్తం సారాంశాన్ని కొన్ని వాక్యాల జీవనవేదంగా ప్రవచించే పెద్దలు, తాత్వికులు కూడా.. ‘కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, ఏపనీ చేయవద్దు’ అనేది గీతా ప్రబోధంగా చెప్తారు.
సర్వకాల సర్వావస్థలలోనూ మనకు ఉపయోగపడని, చేటుచేసే విషయాలలో కోపం ఒకటి అని మనం గుర్తుంచుకోవాలి. మానవ సహజమైన ఒక స్థాయి ఆవేశం లేకుండా జీవించడం ఎందుకు అని వాదించేవాళ్లు కొందరుంటారు. అవి సహజమే. కానీ.. వాటిని ఎంత త్వరగా నియంత్రించుకుంటున్నామనేది ఇక్కడ ముఖ్యం. కోపం రాకుండా ఉండడానికి మనం యోగులము, సాధకులము కాదు. కానీ.. ఆ కోపం మనల్ని చర్యల వైపు పురిగొల్పుతుందా? ఆలోచనవైపు పురిగొల్పుతుందా? అనేది మనమీద ఆధారపడి ఉంటుంది.
== == ==
ఇటీవలి ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బెంగుళూరు నుంచి విజయవాడకు బయల్దేరింది. కావలిలోని చేపల మార్కెట్ వద్దకు వచ్చేసరికి ముందు ఉన్న కారును అడ్డు తొలగమని సంకేతం ఇవ్వడానికి డ్రైవరకు హారన్ మోగించాడు. దీంతో కోపగించిన ఆ ముందువెళ్లే కారులోని నలుగురు వ్యక్తులు దిగి వచ్చి, బస్సు డ్రైవరు బిఆర్ సింగ్ ను కిందికి లాగి అతడిమీద దాడిచేసి కొట్టారు. అక్కడితో వారి కోపం ఉపశమించి.. నలుగురు కలిసి ఒక్కడే అయిన డ్రైవరును దారుణంగా కొట్టగలిగినందుకు వారి అహం శాంతించి వెళ్లిపోయి ఉంటే ఏమై ఉండేదో మన ఊహకు తెలియదు. కానీ కథ అక్కడ ముగియలేదు.
బస్సు కావలి పట్టణం శివార్ల వరకు వెళ్లేసరికి అదే కారులోని వ్యక్తులు, మరొక కారులో మరికొందరిని కూడా పోగుచేసుకుని ఆ బస్సు వెంటబడి అక్కడకు వచ్చారు. డ్రైవరు సింగ్ ను మళ్లీ బస్సులోంచి కిందికి లాగి విచక్షణా రహితంగా కొట్టారు. కింద పడేసి ఎడాపెడా కాళ్లతో తంతూ ఘోరంగా కొట్టారు. వారిని వారించడానికి ప్రయత్నించిన మరో డ్రైవరు శ్రీనివాసరావు, కొందరు ప్రయాణికులను కూడా దౌర్జన్యానికి దిగి కొట్టారు. చూస్తున్నవారు వీడియో తీస్తోంటే.. ఆ ఫోన్లను లాక్కుని వాటిని ధ్వంసం చేశారు.
ఈ దుర్మార్గంపై డ్రైవరు సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి వీడియోలు వైరల్ అయ్యాయి. రాష్ట్రాన్ని కుదిపేశాయి కూడా.
ఆ తర్వాతే అసలు ఎపిసోడ్ మొదలైంది. మొత్తం పదిమంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. చాలామంది పాత నేరస్థులే అని తేల్చారు. పోలీసులు రంగంలోకి దిగగానే పరారైన దేవరకొండ సుధీర్ అనే వ్యక్తి అసలు కీలకమైన వ్యక్తిగా గుర్తించారు. సుధీర్ ను వెతికి పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు నిర్ఘాంతపోయే అనేక విషయాలు వెల్లడయ్యాయి. సదరు సుధీర్ ఒక పెద్ద మాఫియా డాన్ స్థాయిలో తప్పుడు వ్యవహారాలు నడిపిస్తున్న కేంద్రబిందువు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఈ వ్యక్తి.. తప్పుడు పనులనే తన మార్గంగా మార్చుకున్న వాడు. సీజనల్ మోసాలతో చెలరేగిపోయేవాడు. పెద్దనోట్ల మార్పిడి పేరుతో కోట్లకు కోట్లు మోసాలు చేయడం, తక్కువ ధరకు బంగారం విక్రయం పేరుతో నగదు కాజేసే కుట్రలు, ఇలాంటి తప్పుడు పనులు అతడికి అలవాటు. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే సంస్థకు జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడిగా అతనికి ఒక గుర్తింపు కార్డు కూడా ఉంది. కానీ చేసే వ్యవహారాలు మాత్రం అన్నీ తప్పుడు పనులే.
ఈ తప్పుడు పనులను అతను సినిమా స్థాయిలో అత్యంత భారీగా నిర్వహిస్తుంటాడు. ఎంతో విలాసవంతమైన ఖరీదైన భవనాలు, ఆ భవనంలో జామర్లు, మారణాయుధాలు, పిస్తోళ్లు, ఆధునాతన పరికరాలు, వాకీటాకీలు ఇలాంటివన్నీ సుధీర్ నివాసంలోని అతడి నేరసామ్రాజ్యంలో పోలీసులకు దొరికాయి. తమాషా ఏంటంటే.. కొన్నేళ్లుగా ఇన్ని రకాల నేరాలకు అలవాటు పడిన సుధీర్ ను గతంలో పోలీసులు పట్టుకోలేదు. ఇప్పుడే దాడికేసులో అతడి కోసం అన్వేషించినప్పుడు ఈ సంగతులన్నీ తెలుసుకున్నారు.
కేవలం.. అడ్డు తొలగాల్సిందిగా హారన్ కొట్టినందుకు ఆర్టీసీ బస్సు డ్రైవరు మీద కోపంతో వెంటాడి మరీ అతడి మీద దాడి చేసి కొట్టిన సుధీర్ కోపం అతడిని పోలీసులకు పట్టిచ్చింది. పాతనేరాలన్నింటి గుట్టు విప్పింది. హారన్ కొట్టినందుకు డ్రైవరు మీద వచ్చిన కోపాన్ని నియంత్రించుకుని పక్కకు తొలగి ఉంటే అసలు ఈ చర్చే ఉండేదికాదు. అప్పుడు వచ్చిన కోపంతో అతడిని కొట్టాడు సరే.. అక్కడితో కోపాన్ని చల్లార్చుకుని పోయి ఉంటే.. పోలీసు కేసు అయ్యేది కాదు. ఊరు దాటి వెళ్లిపోయిన బస్సును, అనుచరులతో సహా వెంటాడి వెళ్లి, మళ్లీ కొట్టడం.. అప్పటిదాకా అదే కోపాన్ని కాపాడుకోవడం అతడి వినాశనానికి బీజం వేసింది.
కోపంలో మనిషి అదుపుతప్పితే.. ఆ క్షణానికి అతడి అహం (ఈగో) సంతృప్తి చెందవచ్చు గాక. కానీ ఆ కోపం యొక్క దీర్ఘకాలిక ఫలితం, లబ్ధి అతడి వినాశనం మాత్రమే… అనే సత్యాన్ని మనం గ్రహించాలి.
కొందరికి అకారణ కోపాలు వస్తుంటాయి. నిత్యం అసహనానికి గురవుతూ ఉంటారు. ఇతరుల పట్ల నిత్య అసంతృప్తితో ద్వేషంతో మనుగడ సాగిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసి జాలి పడడం తప్ప మనం చేయగలిగేది ఏమీ ఉండదు.
== == ==
కోపం రావడం అనేది మనలోని బలహీనతకు, అసమర్థతకు నిదర్శనం. ఒక వ్యక్తి మీద మనకు కోపం వచ్చిందంటే.. అది మన చేతగానితనంగా గుర్తించాలి. భార్య రుచికరంగా వంటచేసిపెట్టాలి, అది ఆమె విధి అని ఒక వ్యక్తి నమ్ముతున్నాడు. అసలు ఆమె వంట చేయనే చేయదు, లేదా ఒకపూట చేయలేదు, అనుకుందాం! అతడికి భార్య మీద కోపం వస్తుంది. అది ఎక్కడికి దారితీస్తుందనేది మనకు అనవసరం. కానీ.. ఆ కోపానికి అసలు కారణం.. ఆమె చేయకపోవడం కాదు. అతనికి వంట చేతకాకపోవడం.
తనకు తప్పనిసరి అవసరమైన ఆహారం విషయంలో, వంట చేయడం చేతగాని తన బలహీనత కారణంగా మరొక వ్యక్తి మీద పూర్తిస్థాయిలో ఆధారపడినప్పుడు.. వారు చేయకపోతే వచ్చేది కోపమే. ఆ బలహీనత అతనికి లేకపోతే.. చక్కగా తనే వండుకుని తినగలడు. పిల్లలు సరైన దారిలో లేరనే కోపం వస్తుంది. అది వారిని సరిగా పెంచలేకపోయిన అతని అసమర్థతకు నిదర్శనం. అప్పు అడిగితే ఇవ్వని వాడి మీద కోపం వస్తుంది.. కష్టంచేసి సంపాదించుకోలేని అసమర్థతకు అది నిదర్శనం. అప్పు తీసుకుని తీర్చని వాడి మీద కోపం వస్తుంది.. అలాంటి వాడిని నమ్మి ఇచ్చిన బలహీనతకు నిదర్శనం.
కోపం వల్ల ఎప్పటికీ ఏమీ సాధించగలిగేది ఉండదు అనే సంగతిని కూడా గ్రహించాలి. ఒకరి మీద కోప్పడడం వలన వారిలో మార్పు వస్తుందనే భ్రమలో చాలామంది ఉంటారు. కానీ అది ఎన్నటికీ జరగదు. వారు మారదలచుకున్నప్పుడు మారుతారు తప్ప.. తమ మీద ఎవరో కోప్పడ్డారు కాబట్టి మారరు. మార్కులు సరిగా రాలేదని విద్యార్థి మీద టీచరు కోప్పడినంత మాత్రాన వాడు అద్భుతంగా చదివేయడం జరగదు. వాడికసలు చదువుమీద శ్రద్ధ పుట్టాలి, చదివేది, టీచరు చెప్పేది వాడికి అర్థం కావాలి.. అది ముఖ్యం. అప్పుడే బాగా చదవగలడు.
ఇవి కేవలం ఊహాత్మకమైన ఉదాహరణలు. కానీ ఏ సందర్భంలో ఎవరి మీద కోపం వచ్చినా కూడా.. ఆ కోపాన్ని కాస్త నియంత్రించుకుని, అదుపులో పెట్టుకుని, ఈ కోణంలో ఆలోచన సాగించినట్లయితే.. మన లోపాలు, బలహీనతలు, అసమర్థతలు అందుకు కారణమో కాదో మనకు అర్థమవుతుంది. అవేవీ కాదని బోధపడి అప్పటికీ కోపం మిగిలిఉంటే.. అది మంచి కోపం.
స్థూలంగా చూసినప్పుడు.. 1) కోపం మనం చేతగానితనానికి నిదర్శనం. 2) కేవలం కోపం వ్యక్తీకరించడం వలన సాధించే సత్ఫలితం సున్నా. అనే రెండు మౌలిక సిద్ధాంతాలను అర్థం చేసుకుంటే, నమ్మితే.. ఇక ఏ వ్యక్తి జీవితంలోనూ కోపం ఉండదు. తత్ఫలితంగా ప్రశాంతత, నిత్యసంతృప్తి మాత్రమే వర్ధిల్లుతుంది.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె