ఏపీ తెలంగాణాల మధ్య జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా నది నీటి విషయంలో రెండు రాష్ట్రాలు కొట్లాటకు దిగుతున్నాయి. కానీ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సొంత ఇలాకా శ్రీకాకుళంలో కూడా ఇలాంటివి చూసినపుడు ఆశ్చర్యమే కలుగుతుంది.
టెక్కలి ఎమ్మెల్యేగా గత రెండు సార్లుగా గెలుస్తూ వస్తున్న అచ్చెన్నాయుడు కూడా జల జగడాలకు కారణం అవుతున్నారంటూ రైతులు ఆరోపించడం విశేషం. జిల్లాలో వంశధారా కాలువ ద్వారా వస్తున్న నీటిని ఒడిసిపట్టి ఎగువన ఉన్న టెక్కలి రైతాంగం కోసం దక్కేలా అచ్చెన్నాయుడు తనదైన రాజకీయం చేస్తున్నారు అంటూ దిగువ ప్రాంత రైతాంగం ఘాటు విమర్శలు చేస్తోంది.
పలాసా నియోజకవర్గం దిగువన ఉండడంతో వారికి వంశధార కాలువల ద్వారా నీరు దక్కకుండా అనధికార ఎత్తిపోతల పధకాలను అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నాడని, దాంతో గత రెండేళ్ళుగా తాము కరవు బారిన పడిపోయామని రైతులు విలపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ని కలసి ఫిర్యాదు కూడా చేశామని వజ్రపు కొత్తూరు రైతు నాయకుడు దువ్వాడ మధుకేశ్వరరావు చెప్పారు.
అచ్చెన్న పుణ్యమాని దిగువకు చుక్క నీరు రాకుండా తమ పొలాలు ఎండిపోతున్నాయని పలాసా నియోజకవర్గంలోని వజ్రపు కొత్తూరు, పలాస, నందిగాం మండలాల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కలెక్టర్ కలుగ చేసుకుని దిగువకు నీటిని పంపకపోతే తమకు ఆకలి చావులే గతి అని వారు అంటున్నారు.
మొత్తానికి చూసుకుంటే బాధ్యత కలిగిన నాయకుడు అచ్చెన్న సొంత ఇలాకాలోనే ఎగువ దిగువ ప్రాంతాలు అంటూ పక్ష పాతం చూపిస్తే ఇక రాష్ట్రాలు ఆ పని చేస్తే తప్పేంటి అన్న మాట కూడా వినిపిస్తోంది.