దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో గురువారం వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ఎవరెవరు వెళ్తారనే చర్చ సర్వత్రా సాగుతోంది. పైగా రాజకీయాలకు అతీతంగా ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేసినట్టు విజయమ్మ చెప్పుకొస్తున్నారు. కానీ ఆ కార్యక్రమం మాత్రం రాజకీయాల చుట్టూ చక్కర్లు కొడుతోంది.
ఎందుకంటే వైఎస్ కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అత్యంత ప్రభావశీలమైంది కాబట్టి. ఈ ఆత్మీయ సభకు హాజరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్వాహకులకు పెద్దగా సానుకూల సంకేతాలు వెళ్లడం లేదని సమాచారం.
దివంగత నేత వైఎస్సార్ పేరుతో అవిర్భవించిన వైసీపీనే, ఆ సమావేశం నిర్వహణపై సానుకూలంగా లేదు. వైఎస్సార్ వెంట నడి చినవాళ్లలో ఎక్కువగా వైసీపీలోనే వున్నారు. దీంతో సమావేశానికి వెళితే, జగన్ నుంచి ఎలాంటి ఇబ్బందులొస్తాయోననే ఆందోళన వైసీపీ నేతల్లో ఉండడం గమనార్హం. దీంతో వైసీపీ నుంచి ఆ సమావేశానికి ఏ ఒక్కరూ వెళ్లరనేది ఖాయమైంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే …ఒకవైపు వైఎస్ కుటుంబంపై పోరాడుతూ, మరోవైపు పార్టీ నేతలు వెళితే నెగెటివ్ సంకేతాలు వెళ్తాయనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. బీజేపీలో కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు. వైఎస్ కేబినెట్లో ఆయన మంత్రే తప్ప, అంతకు మించి ఆత్మీయ సంబంధాలు లేవని చెబుతున్నారు. దీంతో ఏపీ పాలక ప్రతిపక్ష పార్టీల నుంచి వెళ్లే వాళ్లు దాదాపు లేరనే చెప్పొచ్చు.
తెలంగాణలో మాత్రం కొంత సానుకూలత వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఇది రాజకీయంగా ఆయా పార్టీలకు లాభిస్తుందనే అభిప్రాయం లేకపోలేదు. వైఎస్సార్ కేబినెట్లో పనిచేసిన మంత్రులు ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీలో కీలక స్థానాల్లో ఉన్నారు. విజయమ్మ ఆత్మీయ సమావేశానికి వెళ్లడం ద్వారా… షర్మిల పార్టీపై కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొచ్చనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ నేతలు రాజకీయ ప్రయోజనాల కోణంలో సమావేశానికి వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఆత్మీయ సమావేశానికి తప్పక వస్తామని చెప్పిన వాళ్లలో ఇద్దరే ఇద్దరున్నారని సమాచారం. ఆ ఇద్దరు… వైఎస్సార్ ఆత్మగా చెప్పే కేవీపీ రామచంద్రరావు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ఈ ఇద్దరు నేతలు దివంగత వైఎస్సార్‌కు ఎంత సన్నిహితులో తెలుగు సమాజానికి బాగా తెలుసు.
రాజకీయాలతో సంబంధం లేకుండా విజయమ్మ ఆత్మీయ సమావేశానికి వెళ్లాలని ఆ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం విజయవంతంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.