తన కుటుంబానికి చెందిన అతి పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది సీనియర్ హీరోయిన్ ఆమని. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అయితే వాళ్లు నిజానికి ఆమని సొంత చెల్లెళ్లు కాదట. ఆ ఇద్దర్నీ దత్తత తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమని బయటపెట్టింది.
“5 నెలల వయసున్నప్పుడు మా అమ్మ వాళ్లిద్దర్నీ తెచ్చుకుంది. అనాథలుగా ఉన్న వాళ్ల బాధ చూడలేక దత్తత తీసుకుంది. నాకంటే, నా తమ్ముడి కంటే ఎక్కువగా వాళ్లిద్దర్నీ ప్రేమగా చూసుకుంది. వాళ్లను పెద్దచేసి చదివించింది. పెళ్లిళ్లు కూడా చేసింది. ప్రస్తుతం వాళ్లంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్లు దూరంగా వెళ్లినా మా అమ్మ దగ్గరకు వచ్చిపోతుంటారు.”
తమ కుటుంబంలో, ఇండస్ట్రీలో చాలామందికి ఈ విషయం తెలియదని చెప్పుకొచ్చింది ఆమని. పిల్లల్ని చూసుకోవడం కోసం అమ్మ ఇంటి పట్టునే ఉండిపోవడంతో తను ఒంటరిగా షూటింగ్స్ కు రావాల్సి వచ్చేదని… తను ఒంటరిగా షూటింగ్స్ కు రావడానికి కారణం ఇదేనని వెల్లడించింది.
క్యారెక్టర్ రోల్స్ తో టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమని.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ కు తల్లిగా నటించింది. పాతికేళ్ల కిందట సిసింద్రీ సినిమాలో అఖిల్ కు అమ్మగా నటించానని, మళ్లీ ఇన్నాళ్లకు అఖిల్ కు తల్లిగా నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అఖిల్ కూడా తనపై ఎంతో ప్రేమ చూపిస్తాడని అంటోంది.