వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత కేబినెట్లో కొందరు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించదా? అనే ప్రశ్న ఆసక్తిని రేపుతూ ఉంది. కొన్ని నెలల కిందటే ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేశారు. అంతకు ముందున్న కేబినెట్ ను పూర్తిగా రద్దు చేసి.. కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు జగన్. దాదాపు మూడేళ్ల పాలన అనంతరం పాతమంత్రుల స్థానంలో కొత్త మంత్రులు వచ్చారు. కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆ కేబినెట్ కు రెండున్నరేళ్ల పాటు మాత్రమే అవకాశం ఉంటుందని, రెండున్నరేళ్ల తర్వాత ఐదుమందిని తప్ప మిగతా వారందరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంటుందని అప్పట్లో జగన్ ప్రకటించారు. రెండున్నరేళ్లకే కాకపోయినా.. ఆ తర్వాత కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరిగింది.
ఆ తరుణంలో కొందరు హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా మంత్రివర్గం నుంచి తప్పించారు జగన్. సీఎంపై ఈగ వాలనివ్వరేమో అనేంత స్థాయిలో వ్యవహరించే వారిని కూడా తప్పించారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. మరి జగన్ చేత మూడేళ్ల తర్వాత మెప్పు పొంది మంత్రి పదవులను పొందిన వారంటే వారి స్థాయి పెరిగినట్టే. మంత్రివర్గంలోని వారిని తప్పించి వీరికి అవకాశం ఇచ్చారంటే వీరి పట్ల జగన్ కు పూర్తి సానుకూల ధోరణి ఉన్నట్టే. మరి ఇలా మంత్రివర్గంలో స్థానం పొందిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదంటే అది అత్యంత ఆశ్చర్యకరమైన అంశమే!
ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకరమైన వార్తలే వస్తున్నాయి ఇద్దరు ప్రస్తుత మంత్రుల విషయంలో. వారిద్దరూ మహిళా మంత్రులే కావడం గమనార్హం. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ కష్టమే అనే జాబితాలో ఉన్నారు కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా! వీరిద్దరూ ఇటీవలే జగన్ కేబినెట్లో చోటు సంపాదించినా, వచ్చే సారి వీరికి టికెట్ కష్టమే అనే టాక్ నడుస్తూ ఉంది.
ఉషశ్రీచరణ్ కు గత ఎన్నికల్లో తొలి సారి అసెంబ్లీ టికెట్ లభించింది. బలమైన ప్రత్యర్థి మీదే ఆమె ఘన విజయం సాధించారు. బీసీ కోటాలో ఆమెకు మంత్రి వర్గంలో చోటు కూడా లభించింది. కురుబ సామాజికవర్గానికి చెందిన శంకర్ నారాయణను కేబినెట్ నుంచి తప్పించిన పరిస్థితుల్లో అదే సామాజికవర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ కు జగన్ కేబినెట్లో చోటు దక్కింది. మరి మూడేళ్ల తర్వాత ఆమెకు మంత్రివర్గంలో చోటు జరిగిందంటే.. అది సానుకూలమైన పరిణామమే. అయితే ఇప్పుడు ఆమెకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఆమె పెంచుకున్న వ్యతిరేకత నేపథ్యంలో ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించిందనే ప్రచారం జరుగుతూ ఉంది. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఇలా టికెట్ దక్కని సిట్టింగుల జాబితాలో ఉషశ్రీ చరణ్ ఉన్నారనేది టాక్.
ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హార్డ్ కోర్ అనుకూల నేతల్లో ఒకరు ఆర్కే రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచినే ఆమె పోరాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎమ్మెల్యేగా కూడా ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన వేధింపులనే ఎదుర్కొన్నారు. ఇక 2019లో మరోసారి ఎమ్మెల్యేగా నెగ్గిన రోజాకు మంచి ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది. ఆమెకు జగన్ కేబినెట్లో మొదట చోటు లభించకపోయినా.. వెనువెంటనే ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కింది. అలా ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ హోదాను పొందారు రోజా.
ఇక జగన్ కేబినెట్ పునర్వ్యస్థీకరణలో ఆమె కు మంత్రి పదవి కూడా దక్కింది. తొలి సగంలో మంచి నామినేటెడ్ పదవి, రెండో సగంలో మంత్రి పదవి.. ఇలా ఐదేళ్ల కూ తగు ప్రాధాన్యతను పొందారు రోజా. మరి ఆ సంగతలా ఉంటే.. నియోజకవర్గ స్థాయిలో మాత్రం రోజాకు వ్యతిరక పరిణామాలున్నాయనే ప్రచారం ముందు నుంచి ఉంది. గత ఎన్నికల్లోనే ఆమెకు టికెట్ వద్దని కొందరు పట్టుబట్టారంటారు. అయితే జగన్ చొరవ చూపి..ఆమెకు ఎమ్మెల్యే టికెట్, ఆ పై ఏపీఐఐసీ చైర్మన్, ఇంకా ఇప్పుడు మంత్రి పదవితో మంచి ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పటి వరకూ రోజాకు అంతా సానుకూలంగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఆమె స్థానంలో నగరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకరు పోటీ చేయవచ్చనే టాక్ ఉంది.
వచ్చే ఎన్నికల్లో టికెట్ ను దక్కించుకోలేని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో రోజా కూడా ఒకరనే ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తానికి ఇలా ఇద్దరు మహిళా మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చనే అభిప్రాయాలు అయితే క్షేత్ర స్థాయి నుంచి, రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రచారాలు ఎంత వరకూ నిజం అవుతాయనేది ఆసక్తిదాయకమైన అంశం. సిట్టింగులను మార్చేందుకు జగన్ కంకణం కట్టుకుంటున్న నేపథ్యంలో వీరు మాజీ ఎమ్మెల్యేలుగా మిగలబోతున్నారా, లేక ఎన్నికల నాటికి పరిస్థితులను తిరిగి తమకు అనుకూలంగా మార్చుకుంటారా.. అనేది పెద్ద ప్రశ్నే!