తెలుగుదేశం పార్టీ, జనసేన ల పొత్తు దాదాపు ఖరారు అయినట్టే. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 40 సీట్లను డిమాండ్ చేస్తోందనే టాక్ నడుస్తోంది. అయితే అది డిమాండ్ మాత్రమే కావొచ్చు. జనసేనకు చంద్రబాబు నాయుడు అన్ని సీట్లు కేటాయించకపోవచ్చు. ఆ డిమాండ్ ను సగం స్థాయికి తీసుకు రావొచ్చు. మళ్లీ అందులో కూడా తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగనూవచ్చు! ఇలాంటి పొత్తుఎత్తులు చంద్రబాబుకు కొత్త కాదు. మహామహులను ఇలా బురిడీ కొట్టించారు చంద్రబాబు. అలాంటిది పవన్ కల్యాణ్ ను ఇలా పొత్తుతో చిత్తు చేయడం చంద్రబాబుకు సునాయాసం!
మరి ఈ పొత్తు కుదిరితే రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ప్రభావం ఎలా ఉంటుందనేది మరో ఆసక్తిదాయకమైన చర్చ. జనసేన ప్రభావం కొన్ని నియోజకవర్గాలకు, కొన్ని జిల్లాలకే పరిమితం అనే అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. కాపుల జనాభా గణనీయంగా ఉన్న చోట మాత్రమే జనసేన ఉనికి ఉంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా కాపుల జనాభా విషయంలో ముందు వరసలో ఉన్న నియోజకవర్గాల్లోనే పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇలా నియోజకవర్గాల ఎంపికలో కూడా కుల సమీకరణాలను ఏ మాత్రం మిస్ కాలేదు పవన్ కల్యాణ్. మరి అలా పోటీ చేసి కూడా పవన్ కల్యాణ్ గెలిచింది లేదు. అది వేరే సంగతి.
ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే.. జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు రాయలసీమలో ఎలా ఉంటుందనే అంశం గురించి విశ్లేషిస్తే… పొత్తుతో ఉన్నా లేకపోయినా రాయలసీమ వరకూ జనసేన ప్రభావం చెప్పుకోదగిన స్థాయిలో అయితే ఉండదు. దానికి అనేక కారణాలున్నాయి.
రాయలసీమలో జనసేనను, పవన్ కల్యాణ్ ను అమితంగా అభిమానించేది బలిజలు. వీరు సహజంగానే తెలుగుదేశం పార్టీ అనుకూలురు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో గణనీయంగా ఉన్న బలిజలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా పేరెన్నిక గన్నారు. చాలా నియోజకవర్గాల్లో వీరి జనాభా గట్టిగానే ఉన్నా.. ఇప్పుడు పొత్తుతో ఇవి తెలుగుదేశం పార్టీకి దక్కేదేమీ లేదు. గతం నుంచినే ఈ ఓట్లపై తెలుగుదేశం పార్టీకి పట్టుంది. ఇప్పుడు పొత్తు ఉన్నా లేకపోయినా.. తెలుగుదేశం పార్టీకి అదనంగా సమకూరే బలం లేదు.
ఇక ఇదే సమయంలో జనసేన తో తెలుగుదేశం పార్టీ పొత్తు.. లేని పోని రచ్చలకు దారి తీయవచ్చు. గత కొన్నేళ్లలో తాము జనసేన కార్యకర్తలం, నేతలం అంటూ కొందరు బలిజ యువకులు, పవన్ కల్యాణ్ సినిమా ఫ్యాన్స్ తయారయ్యారు. వీరి ఉనికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకూ, నేతలకూ నచ్చడం లేదు. మరి ఇప్పుడు పొత్తు అంటూ..వారికే తెలుగుదేశం పార్టీ పిలిచి ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంది. ఇది ఇరు వర్గాల మధ్యనా రచ్చ చేసేదే.
అలాగే పవన్ కల్యాణ్- జనసేన అభిమానుల్లో నందమూరి సినీ అభిమాన వ్యతిరేక వర్గం కూడా ఉంటుంది. సినీ అభిమానాలు దురాభిమానాలుగా తయారై.. రాజకీయ పార్టీలతో వాటిని ముడిపెట్టుకోవడం తెలుగు గడ్డపై అలవాటే. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్యన రాజకీయ వైరం కూడా ఉంటుంది. ఇన్నాళ్లూ చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వత్తాసు పలకడమే మెగాభిమానులకు అంత ఆనందకరమైనది కాదు. అయితే పంటిబిగువన ఈ కోపాన్ని వారు భరిస్తూ వచ్చారు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కమ్యూనిస్టు పార్టీలనూ, బీఎస్పీని కలుపుకుని ఎన్నికలకు వెళితే పవన్ కల్యాణ్ సినీ అభిమానులు కూడా హర్షించారు. వారి ఓట్లు ఎన్నైనా.. వారి శక్తి ఎంతదైనా.. మారుమూల పల్లెల్లో కూడా నాలుగైదు ఓట్లైనా జనసేనకు పడ్డాయి. వెయ్యి ఓట్లు ఉన్న పంచాయతీ స్థాయిలో జనసేన అభ్యర్థులకు కనీసం ఐదారు ఓట్లు పడ్డాయి ఆ సమయంలో. అది పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి హోదాలో ఎన్నికలకు వచ్చినందుకు దక్కిన ప్రతిఫలం అది. పవన్ ను సీఎంగా చూడాలనుకునే వారి ఓట్లు అవి. అయితే తెలుగుదేశం, జనసేనల పొత్తులో పవన్ కల్యాణ్ కచ్చితంగా సీఎం అభ్యర్థి కాడు!
అయితే చంద్రబాబు, అనంతరం లోకేష్ లు మాత్రమే ఆ పొత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థులవుతారు. పవన్ కల్యాణ్ కు అంత సీను ఉండదు. చంద్రబాబు అలాంటి అవకాశాన్ని కలలో కూడా ఇవ్వడు. ఇది జనసేన వీరాభిమానులను నిరుత్సాహ పరిచే అంశమే. మహా అంటే.. పదో పదైదు సీట్లు ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను ఊరకోబెడతాడు చంద్రబాబు. ఆ సీట్లలో గెలిచేవి ఎన్నో ఎవరూ చెప్పలేరు. వాటిల్లో చంద్రబాబు ఎన్నిచోట్ల తిరుగుబాటు అభ్యర్థులతో వెన్నుపోటేస్తాడో కూడా ఇప్పుడు ఎవరూ ఊహించలేరు. ఆ మాత్రం సీట్లతో పవన్ కల్యాణ్ సీఎం కావడం దుర్లభం, ఆ ఊహకు కూడా అవకాశం లేదు. మరి పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనే కోరికతో ఓటేసిన వారు ఇప్పుడు ఆయన మద్దతు చంద్రబాబు కు అనే లెక్కలతో దూరం జరిగినా పెద్ద ఆశ్చర్యం లేదు.
తిరుపతి, రాజంపేట, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లో బలిజల జనాభా గట్టిగా ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో జనసేన సోలోగా పోటీ చేసి పోరాడితే.. ఒకటీ రెండు చోట్ల కనీసం రెండో స్థానాన్ని పొందగలదు. అయితే ఈ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం- జనసేనలు కలిసి పోటీ చేస్తే.. సమీకరణాలు మారిపోతాయి. వీటిల్లో జనసేన పోటీ చేస్తే తెలుగుదేశం వర్గాలు సహకరించవు, తెలుగుదేశం పోటీ చేస్తే జనసేన అటు వైపు చూడదు. ఇలా జనసేన సోలోగా పోటీ చేసి ఉనికిని చాటుకోగల సీట్లలో కూడా పరిస్థితులు తేడాగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది తెలుగుదేశంతో పొత్తుతో.