మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ మాటలు (హామీలు) కోటలు దాటుతున్నాయి. హామీల్లో ప్రధాన పార్టీలతో పోటీ పడుతున్నాడు.
మునుగోడు నియోజకవర్గంలో గెలిపిస్తే అక్కడ ఉన్న వందల మంది పిల్లలను తాను చదివిస్తానని, మండలానికి ఒకటి చొప్పున ఆసుపత్రిని, కాలేజీని కట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇక రైతుల సమస్యలను సైతం పరిష్కరిస్తానని చెప్పిన కే ఏ పాల్ మునుగోడు లో ఉన్న ఏడు మండలాల్లో ఏడు వేల మందికి ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.
రెండు సంవత్సరాలలో మునుగోడులో నిరుద్యోగ సమస్య లేకుండా చేసి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని కె ఏ పాల్ హామీ ఇచ్చాడు. నిరుద్యోగులు అందరూ తన కేఏపాల్ యాప్ లో లాగిన్ అవ్వమని చెప్పిన ఆయన, అలాగే ఆ యాప్ ని షేర్ చేయమని కోరాడు.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడులోని ఓ చిన్నహోటల్ లో దోశలు వేసి అక్కడ ఉన్న ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేశాడు. అంతేకాదు సదరు హోటల్ నిర్వహిస్తున్న దంపతుల ఇద్దరు పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు తానే చదివిస్తానని కె ఏ పాల్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.