పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కేంద్రంగా త్వరలో కాపు సామాజిక వర్గ శ్రేయస్సే లక్ష్యంగా ఓ రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతున్నది. టీడీపీ మాజీ ఎంపీ, దివంగత మెంటే పద్మనాభం అల్లుడు, న్యాయవాది ఆరేటి ప్రకాష్ ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించినట్టు సమాచారం. టీడీపీ హయాంలో ఉధృతం గా నడిచిన కాపు ఉద్యమానికి ప్రధాన కారకులలో ఆరేటి ప్రకాష్ ఒకరు. ఈ ఉద్యమం లోకి ముద్రగడ పద్మనాభం ను తీసుకురావడానికి ఆయన విశేష కృషి చేశారు.
తెలుగు దేశం ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ సాధించలేకపోయామనే అసంతృప్తి ప్రకాష్ కు ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో కూడా కాపులకు న్యాయం జరగడం లేదన్న అసహనంలో ప్రకాష్ ఉన్నారు. కాపులలో ప్రముఖులైన కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ సాంబశివరావు, ఐఏఎస్ మాజీ అధికారి చంద్రశేఖర్ వంటి పలువురిని ఒకే చోటకు చేర్చి, కాపు సామాజిక శ్రేయస్సు కు సంబంధించిన అంశాల పై ఉద్యమించాల్సిన అవసరం పై విస్తృతంగా చర్చించారు.
వీరంతా ఒక చోట కలవడానికి ఆరేటి ప్రకాష్ సంధాన కర్త గా పనిచేశారు. కానీ, ఈ సమావేశాలు ఎటువంటి క్రియా తీసుకోలేదు. దీంతో, ఒక రాజకీయ పార్టీ స్థాపన తోనే పిల్లి మెడలో గంట కట్టవచ్చునన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు సమాచారం.
తనకు రాజకీయాలతో సంబంధం లేదని, కాపుల సామాజికాభివృద్ధికి పాటు బడతామని వైసీపీ, టీడీపీలో ఎవరు హామీ ఇస్తే ఆ పార్టీ కి అనుకూలంగా కాపులలో ప్రచారం చేస్తామని ఆరేటి ప్రకాష్ చెప్పారు.
భోగాది వెంకటరాయుడు