ఏపీ నిఘా విభాగం ప్రభుత్వానికి తాజాగా ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక సారాంశం ఏంటో తెలుసుకుందాం. జగన్ కేబినెట్‌లోని కాపు మంత్రులపై జనసేన శ్రేణులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. దీంతో కాపు మంత్రులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అలాగే కాపు మంత్రులకు భద్రత పెంచే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
ఇటీవల కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్‌కల్యాణ్ తన సామాజిక వర్గానికి చెందిన మంత్రులపై ప్రత్యేకంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సోదరుడని పిలిచిన పాపానికి ఓ మంత్రిని ఎవడు నీకు సోదరుడని నిలదీశారు. మరోసారి అలా పిలవొద్దని ఘాటు హెచ్చరిక చేశారు.
ఈ నేపథ్యంలో కాపు మంత్రులపై దాడులకు పవన్ ప్రసంగం ప్రేరేపించినట్టుగా ఏపీ నిఘా విభాగం పసిగట్టింది. అసలే వైసీపీ, జనసేన మధ్య వ్యవహారం ఉప్పు, నిప్పులా ఉంది. ఏ మాత్రం అవకాశం దొరికినా పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితికి రాజకీయం దిగజారిందన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువుల్లా పరస్పరం తిట్ల పురాణానికి పాల్పడుతున్నారు. ఇది హద్దులు దాటింది.
నా కొడుకుల్లారా అంటూ చెప్పు చూపుకునే వరకూ దారి తీసింది. కులాలు, ప్రాంతాల పేరుతో ఏపీ రాజకీయాల్లో విద్వేషం నెలకుంది. ఈ నేపథ్యంలో కాపు మంత్రులపై జనసేన దాడి చేసే అవకాశాలున్నాయన్న నిఘా విభాగపు నివేదిక కలకలం రేపుతోంది. అసలే ఎన్నికల వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితుల్లో రాజకీయం ముసుగులో దాడులకు తెగబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిణామాలు చివరికి ఎక్కడికి దారి తీస్తాయో అనే ఆందోళన లేకపోలేదు.