ఏవరివయ్య స్వామి నేను నిన్నెరుగను
హరిని నేనటంచు అనగనేల
నాడు నన్నుబ్రోచు నారాముడవుగావు
నాటి రూపుచూప నమ్మగలను
..ఈ గీతం అందాల రాముడు సినిమాలో ఆరుద్ర రాసినది. ఇప్పుడు ఎందుకీ ప్రస్తావన అంటే ఆదిపురుష్ సినిమాలో రాముడి స్టిల్ చూసి ఈ వాక్యాలు గుర్తుకు వచ్చాయి. బాపు గీతల దగ్గర నుంచి తీసిన చిత్రాల వరకు తెలుగు జనాల మనో ఫలకాల మీద రాముడు అంటే ఓ సౌకుమార్య స్వరూపం కళ్ల ముందు నిలిచిపోయింది. ఆజాను బాహువు..అరవింద దళాయదాక్షుడు అని మాత్రమే కాకుండా అత్యంత సుందరవదనం..సౌకుమార్యం కలిగిన వాడు గా చూస్తూ వచ్చాం. బాపు అయినా రవి వర్మ అయినా విష్ణు స్వరూపాన్ని అలాగే చూపించారు.
ఎన్టీఆర్ దగ్గర నుంచి రామకృష్ణ, శోభన్ బాబు, మీదుగా సీతాకళ్యాణంలో నటించిన రవి వరకు మనం చూసిన రాముడు వేరు. (ఇక్కడ శ్రీరామరాజ్యం లో కనిపించిన బాలకృష్ణ రాముడు మినహాయింపు) ఇప్పుడు ఆది పురుష్ లో చూస్తున్న రాముడు వేరు.
ఎందుకో ఈ ఆదిపురుష్ రాముడు ఆకట్టుకోలేకపోతున్నాడనే చెప్పాలి. పైకి ఎత్తికట్టిన ఆ జుత్తు తో అందంగా వుండే ప్రభాస్ మొహం పెద్దగా మారిపోయింది. దానికి తోడు రాజసం ఉట్టిపడే మీసాలు తగిలించారు. రాముడు క్షత్రియుడు కనుక లాజికల్ గా కరెక్టే. కానీ మనం ఇన్నాళ్లు చూస్తున్న రాముడు వేరు కదా. అందుకే ‘నా రాముడు కావు నీవు’ అనే లైన్లు గుర్తుకువచ్చాయి.
ఎన్టీఆర్ రాముడిగా ఎలా వుండేవాడు అన్నది కొత్తగా చెప్పనక్కరలేదు. బాపు ఈ ఆనవాయితీని బ్రేక్ చేసి శోభన్ బాబును రాముడిగా మార్చినపుడు జనాలు శహభాష్ అన్నారు. ఆ తరువాత దాసరి ఓ సినిమాలో రామకృష్ణను విష్ణుమూర్తిగా చూపినపుడు బాగున్నాడుగా అనే అన్నారు. బాపు మరోసారి రవి అనే నటుడిని సీతాకళ్యాణంతో రాముడిగా చూపిస్తే ‘ఎంత అందంగా వున్నాడో’ కదా అనే అన్నారు. ‘రాములోరు వచ్చినోడు రా’ పాటలో మహేష్ బాబును రాముడిగా చూపించకపోయినా, మహేష్ బాబు కూడా సెట్ అయ్యేలా వున్నాడే అన్న ఆలోచన రప్పించారు.
కానీ ఇప్పుడు ప్రభాస్ రాముడు వీరుడిగా కనిపిస్తున్నాడు తప్ప మనకు అలవాటైన సౌకుమార్య, సుందర రాముడిగా మాత్రం కాదు. ఆదిపురుష్ సబ్జెక్ట్ ప్రకారం వీరత్వమే కనిపించాలి అని అంటే ఓకె అని అనొచ్చు. కానీ ఒకటి రెండు స్టిల్స్ అయినా సుకుమార, సుందర రాముడి గెటప్ లో కూడా అందిస్తే తెలుగు ప్రేక్షకులకు ఆనందంగా వుంటుంది.