జనసేనాని పవన్‌కల్యాణ్ వెంట నడుస్తున్న వారిని చూస్తే గౌరవప్రదమైన వ్యక్తులెవరూ కనిపించరు. అంతోఇంతో చెప్పుకోదగ్గ నాయకుడెవరైనా ఉన్నారా? అంటే… నాదెండ్ల మనోహర్ ఒక్కడే కనిపిస్తారు. ఆయన తప్ప జనసేనలో ఉన్న నాయకుల్లో కాస్త విషయ పరిజ్ఞానం, పెద్దరికం ఉన్న వాళ్ల కోసం దివిటీ పెట్టి వెతికినా ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు.
సమాజంలో గౌరవప్రదమైన నాయకులుగా గుర్తింపు పొందిన ఉన్నతాధికారులు, నాయకులు జనసేనలోకి రావడం, అంతకంటే వేగంగా వెనుతిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్‌కల్యాణ్ ఒంటెత్తు పోకడలే వారిని జనసేనలో కొనసాగనివ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు, మాజీ ఐఏఎస్ చంద్రశేఖర్, ప్రముఖ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, విద్యావంతుడు అద్దేపల్లి శ్రీధర్, మరీ ముఖ్యంగా పవన్‌కు స్ఫూర్తిగా చెప్పుకునే రాజారవితేజ… తదితరులెవరూ జనసేనాని వెంట రాజకీయ ప్రయాణం సాగించలేకపోయారు.
దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్‌కల్యాన్ మాటలకు, చేతలకు పొంతన లేకపోవడమే. ఎవరూ అడక్కుండానే తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేస్తానని, ఇక సినిమాలు తీయనని పవన్ చెప్పారు. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
పవన్‌కల్యాణ్‌కు రాజకీయ జ్ఞానం శూన్యమని గ్రహించడం వల్లే ప్రముఖులంతా ఒక్కొక్కరుగా జారుకున్నారు. పవన్ వెంట చివరికి మిగిలింది సినిమా అభిమానులే. ఈలలు, కేకలు వేయడం తప్ప వారికేమీ తెలియదని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. నిన్నమొన్నటి వరకూ పవన్‌కల్యాణ్ కనిపిస్తే …సీఎం సీఎం అంటూ పూనకం వచ్చిన వారి మల్లే అరిచేవారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకోనున్న నేపథ్యంలో ఇక ఆ సంతోషం కూడా జనసేన శ్రేణులకు మిగల్లేదు.
సీఎం చంద్రబాబు అని వాయిస్ మార్చాల్సి వుంటుంది. ఎందుకంటే తమ అభిమాన నాయకుడే ఆ మాట చెబుతున్నారు కాబట్టి. పవన్ కల్యాణ్ స్వభావం ఏంటో ఆయన వెంట నడుస్తున్న వాళ్లని చూస్తే అర్థం చేసుకోవచ్చని ప్రత్యర్థుల విమర్శల్లోని లోతైన అర్థాన్ని కొట్టి పారేయలేం.