చంద్రబాబుకు ఎప్పుడు ఎవరిపై ప్రేమ, పగ పుడుతాయో తెలియదు. సహజంగా రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు అభిప్రాయాలు ముడిపడి వుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయంగా పనికొస్తారని భావిస్తే, గొంగలి పురుగునైనా ఆయన కౌగలించుకుంటారు. లేదంటే ఎంతటి వారినైనా పక్కన పెడతారు. మామ ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి నాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలను దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో దగ్గుబాటి, హరికృష్ణల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే.
బీజేపీతో విభేదించిన సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆంధ్రాలో అడుగు పెట్టనివ్వకూడదనే పట్టుదలతో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో చూశాం. శ్రీవారికి దర్శనం నిమిత్తం కుటుంబంతో సహా తిరుమలకు వచ్చిన అమిత్‌షాపై దాడికి తెగబడడం ఒక్క టీడీపీకి, చంద్రబాబుకే చెల్లింది. అలాగే మోదీ ఏపీకి వస్తే… నిరసనగా బ్లాక్ బెలూన్స్ ఎగురవేయించిన ఘన చరిత్ర చంద్రబాబుది.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అమిత్‌షా, మోదీ ప్రాపకం పొందేందుకు పడుతున్న తపన చూస్తే జాలేస్తుంది, నిన్న (శనివారం) అమిత్‌షా పుట్టిన రోజు. సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, మిత్రపక్ష నాయకుడు పవన్‌కల్యాణ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ చంద్రబాబు అంతటితో ఆగితే ప్రత్యేకత ఏముంటుందని భావించినట్టున్నారు.
అమిత్‌షాకు ఫోన్ చేసి మరీ బర్త్ డే విషెస్ చెప్పినట్టు తన మీడియా ద్వారా తెగ ప్రచారం చేసుకుంటు న్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ చంద్రబాబు ఉద్దేశం శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు. తద్వారా బీజేపీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయనే సంకేతాల్ని జనంలోకి పంపడానికి చంద్రబాబు వేస్తున్న సర్కస్ ఫీట్లగా అర్థం చేసుకోవాలి.
రానున్నది ఎన్నికల కాలం కాబట్టి, కేంద్ర ప్రభుత్వంతో బాగున్నారనే సంకేతాల్ని పంపడం ద్వారా కొన్ని అంశాల్లో ప్రయోజనాలు నెరవేరుతాయనేది బాబు వ్యూహం. అయితే చంద్రబాబు జిమ్మిక్కులకు మోసపోయే కాలం ఎప్పుడో పోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. కోటి విద్యలు కూటి కోసమే అనే చందంగా… కోటి ఉపాయాలు ఓట్ల కోసమే అనేది చంద్రబాబు సిద్ధాంతం. కాదని ఎలా అనగలం.