ప్రేక్షకుల్లో ఇంకా కాంతారా హ్యాంగోవర్ నడుస్తోంది. ఒక రేంజ్‌లో థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చూసిన వాళ్లకి మామూలు సినిమాలు ఆనవు. దీని ప్రభావం తర్వాత వచ్చే సినిమాలపై కనిపిస్తూ వుంది. ఈ వారం వచ్చిన సినిమాలకి జనం లేరు. నెలరోజుల పాటు ఒక రేంజ్‌లో వుంటే తప్ప, ఏ సినిమా కూడా ఆడదు.
బ్లాక్ బస్టర్లు వచ్చిన ప్రతిసారీ ఈ వాక్యూమ్ వుంటుంది. సినిమాలకే కాదు, ఆ హీరోలకి కూడా సమస్యే. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస ప్లాప్‌లకి ఇదే రీజన్. ఆ స్థాయిలో వూహిస్తారు. ప్రతిసారీ ప్రభాస్ బాహుబలి చేయలేడు కదా? రేపు రిషబ్ షెట్టికి కూడా ఈ సమస్య వస్తుంది. అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ వరుస ప్లాప్‌లు ఎదుర్కొన్నట్టు, రిషబ్ కూడా కాంతారా మించి తీస్తేనే ఆడతాయి. లేదంటే పెదవి విరుస్తారు.
ఒక కన్నడ డబ్బింగ్ సినిమా సెకెండ్ వీక్ కూడా కలెక్షన్లు కురిపించడానికి కారణం, అది ప్రేక్షకుల మూలాల్ని తాకింది. ఒక రకమైన మాస్ హిస్టీరియా సృష్టించింది. రిషబ్ సొంత వూరు కేరడి కథే అయినా అది మనందరి కథగా మారింది.
నగరాల్లో నివసిస్తూ వున్నా, మనలో చాలా మంది గ్రామ వాసులమే. తాతతండ్రులంతా గ్రామీణ జానపదులే. చిన్నప్పుడు అందరూ ఆచారాలు, విశ్వాసాలు, నమ్మకాలు, పూనకాల మధ్య పెరిగిన వాళ్లమే. ప్రాంతం ఏదైనా , భాష ఏదైనా రకరకాల అభూత కల్పనలు, ప్యాంటసీ ప్రపంచంలో జీవించిన వాళ్లమే.
కాంతారా రెండోసారి చూసినపుడు కూడా బోర్ కొట్టలేదు. ఇది మామూలు కథే. అడవి పల్లె, ఒక హీరో, ఫారెస్ట్ అధికారి కపట వేషంలోని విలన్, చిన్న లవ్ ట్రాక్. ఇంతే అయితే ఆడేది కాదు. దేవుడికి, దుర్మార్గుడికి మధ్య జరిగిన సంఘర్షణ యుద్ధంగా మారే సరికి సీన్ మారిపోయింది. ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఆ లైన్ నుంచి పక్కకు రాలేదు. హీరో తప్పుదారిలో వెళుతున్నప్పుడు దారి చూపే శక్తి అతని మనసే. అతని మానసిక శక్తే పంజులి దేవుడు.
పెద్ద వాళ్లయి, చదువుకున్న తర్వాత శాస్త్రీయ దృక్పథం అలవడి మనకి చాలా విషయాలు చాదస్తంగా, మూఢత్వంగా అనిపించొచ్చు. అయితే బాల్యం నుంచి మెదడులో ఇంకిపోయిన ఆలోచనలు, భావజాలం అంత సులభంగా పోదు. చాలా మంది కమ్యూనిస్టులు పైకి ఎంత చెప్పినా, రహస్యంగా గుళ్లకి వెళ్లడం, ఇళ్లలో దేవుడి ఫొటోలు పెట్టుకోవడంలోని మూలం ఇదే.
నేను చిన్నప్పుడు కర్నాటక సరిహద్దులోని రాయదుర్గంలో పెరిగాను. ఆ వూరి నిండా గ్రామదేవతలే. నిరంతరం ఏదో ఒక పరుష (జాతర) జరిగేది. దుగ్గిలమ్మ గుడి ప్రాంతంలో ఒక కథ ప్రచారంలో వుండేది. రాత్రిళ్లు ఆ తల్లి గుర్రం మీద తిరుగుతూ, దుర్మార్గాలు జరగకుండా కాపాడుతుందని. హైవే మీద గాలి మారెమ్మ గుడి వుండేది. అన్ని వాహనాలు అక్కడ ఆగి కొబ్బరి కాయ కొట్టే వాళ్లు. ఆవిడ శాంతిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవని నమ్మకం. ఉలిగమ్మ (ట్రాన్స్‌జెండర్స్ దేవత) జాతరకి కొన్ని వందల మంది ట్రాన్స్ జెండర్లు వచ్చి పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేసేవాళ్లు. చౌడమ్మ, సిద్ధులయ్య వీళ్లంతా జానపదుల దేవుళ్లు, దేవతలు.
కొండల్లో సీతాఫలం చెట్లకి కాపలా వెళ్లేవాళ్లు. అడవిలోకి పశువులు తోలుకెళ్లేవారు. అడవి పండ్ల కోసం, తేనె కోసం ఎలుగు బంటిని ఎదుర్కొనేవాళ్లు, వీళ్లందరికీ తమని ఏదో దేవుడో, దేవతో కాపాడుతుందని నమ్మకం లేకపోతే ఒక్కరోజు కూడా బతకలేరు.
చదువుకుని ఉద్యోగాలు చేసినా, మనలో అధిక శాతం మంది అంతరాత్మలో జానపదులే. ఈ ఆత్మని రిషబ్ షెట్టి కాంతారాలో పట్టుకున్నాడు.
జీఆర్ మహర్షి