ఇదేంటీ …విచిత్రంగా ఉంది. రేవంత్ వర్సెస్ కాంగ్రెస్ ఏమిటీ అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా. ఆయనకు పార్టీకి పడకపోవడం ఏమిటి? రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడైన కొత్తలో కొంత వ్యతిరేకత వచ్చినా క్రమంగా అంతా సర్దుబాటు అయిందనుకున్నారు.
రేవంత్ ఆధ్వర్యంలో దళిత గిరిజన సభలు కూడా సభలు కూడా విజయవంతమయ్యాయి. ధర్నాలు, దీక్షలు, ఇతర నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. నేతలంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేశారు. మరి ఎక్కడ తేడా కొట్టింది? ఇదే అసలు పాయింటు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ ఆలోచనలను, వ్యూహాలను పడనివ్వడంలేదు పార్టీ నాయకులు.
అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకు పడటంలేదు. కొండా సురేఖను ఫిక్స్ చేశారనుకునే సమయంలో మరో మెలిక పెట్టారు నాయకులు. నిజానికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి.
బీజేపీ, టీఆర్ఎస్లను ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ అభ్యర్థిగా బలమైన నాయకురాలు కొండా సురేఖ ఉండాలని రేవంత్ రెడ్డి భావించారని.. ఇందుకోసం ఆయన ఆమెను ఒప్పించారని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి అండ్ టీమ్ నచ్చజెప్పడంతో.. హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆమె అంగీకరించిందనే టాక్ కూడా వచ్చింది.
పార్టీలో ఆమెకు ఎక్కువమంది నాయకులు మద్దతు ఇచ్చారని కూడా సమాచారం వచ్చింది. అయితే తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్ మరో రకంగా ఆలోచిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్, బీజేపీని ఫాలో కావాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు రాష్ట్ర ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ను కోరారు. ఈ రెండు పార్టీలు స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేశాయని గుర్తు చేశారు. ఈటల రాజేందర్‌తో తలపడేందుకు టీఆర్ఎస్ కూడా స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ కోసం స్థానికులు కాకుండా స్థానికేతరులను బరిలోకి దింపితే ఇబ్బందులు వస్తాయని ఠాగూర్‌కు కొందరు నేతలు సూచించారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధుకు చెక్ చెప్పేలా.. హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థిని ఎంపిక చేయాలని కొందరు కోరారు. దీంతో ఆ దిశగా ఆలోచించాలని మాణిక్యం ఠాగూర్ నేతలకు సూచించారని సమాచారం. దీంతో సీన్ మారిపోయింది.
ఎవరెవరి పేర్లో ప్రచారంలోకి తేకుండా అప్లికేషన్లు ఆహ్వానించాలని, ఇంటర్వ్యూలు చేయాలని, వారిలో నుంచి కొందరిని ఎంపిక చేసి హై కమాండ్ కు పంపాలని డిసైడ్ చేశారు. నిన్న ఇదే విషయాన్నివర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు చెప్పాడు.
గాంధీ భవన్ లో ఈరోజు నుంచి ఐదో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, వరంగల్, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్లునాయిని రాజేందర్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ బృందం ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటుందని, దరఖాస్తుతో పాటు రూ.5 వేల డీడీ ఇవ్వాలని, అనంతరం వారిని ఇంటర్వ్యూ చేస్తారంటూ ప్రకటించారు.
ఈ నెల 10 తర్వాత ఏఐసీసీకి నివేదిస్తామని, ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవక పోయినా గౌరవప్రదమైన ఫలితాలు సాధించాలంటే కొండా సురేఖ వంటి వారే బరిలో ఉండాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి. ఈ విషయంలో అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించాలని యోచిస్తున్నారు. మరి.. చివరి నిమిషంలో కాంగ్రెస్ ప్లాన్ మారుతుందా? లేక రేవంత్ రెడ్డి అనుకున్నట్టే జరుగుతుందా? అన్నది చూడాలి.