గుజరాత్‌కు సంబంధించిన ఓ కేసు విషయమై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశం… జగన్ ప్రభుత్వ వాదనను తెరపైకి తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
“న్యాయమూర్తులు తమ తీర్పులు ఉత్తర్వుల ద్వారానే మాట్లాడాలి. మౌఖిక ఆదేశాలు ఇవ్వకూడదు. మౌఖిక ఆదేశాలు న్యాయ రికార్డల్లో భాగం కావు. మౌఖిక తీర్పుల ద్వారా న్యాయపరమైన జవాబుదారీతనం కొరవడి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి అవి ఆమోదయోగ్యం కాదు” అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
గతంలో పలు సందర్భాల్లో జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం, వాటిని ఎల్లో మీడియా పతాక శీర్షికలతో ప్రచురించడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అసలు రాజ్యాంగం అమలవుతోందా? లేదా? తేల్చేస్తాం, ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీస్తోందా? ఎందుకని ప్రభుత్వ భూములను విక్రయిస్తోంది? ….ఇలా ఇంకా అనేకానేక సందర్భాల్లో హైకోర్టు నుంచి ఏపీ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రభుత్వానికి న్యాయస్థాన వ్యాఖ్యలు డ్యామేజీ కలిగిస్తున్నాయని, ఒకవేళ ఇవే వ్యాఖ్యలను తీర్పులో పొందుపరిస్తే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తామని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పలు సందర్భాల్లో కోరిన సంగతి తెలిసిందే. అంటే న్యాయస్థానం ఏదైనా మౌఖికంగా కాకుండా రాతమూలకంగానే మాట్లాడాలని సజ్జల అనేక సార్లు చెప్పారు.
ఇప్పుడు ఇదే విషయాన్ని సర్వోన్నత ధర్మాసనం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్ కేసుకు సంబంధించిన అంశమైనా… ఆదేశాలు అన్ని చోట్లా వర్తించేలా ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యలపై పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే సుప్రీంకోర్టు చెబుతున్నట్టు న్యాయ స్థానంలో జవాబుదారీతనం పెరగాలంటే … రాతమూలక తీర్పులతోనే సాధ్యం. నోటి మాటలు గాలిలో కలిసిపోతాయి. ఇదే రాత అయితే భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశకత్వం చేస్తుంది. ఈ ధోరణి పెరగాలనేది దేశ ప్రజల కాంక్ష. తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు మన దేశ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది.