పవనే ముఖ్యమంత్రి….మరి బాబు సంగతి…?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది. నిజానికి 2019లో జగన్ సీఎం అయిన దగ్గర నుంచి అయన దిగిపోవాలి తక్షణం ఎన్నికలు రావాలీ అన్న ఆకాంక్షనే విపక్షాలు పదే పదే వ్యక్తం…

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది. నిజానికి 2019లో జగన్ సీఎం అయిన దగ్గర నుంచి అయన దిగిపోవాలి తక్షణం ఎన్నికలు రావాలీ అన్న ఆకాంక్షనే విపక్షాలు పదే పదే వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇపుడు మూడున్నరేళ్ళు అయింది. అయినా ఎంతెంత దూరం ఎన్నికలు అనుకుంటూ విపక్షాలు ఆయాసంతో పాటు ఆరాటాన్ని కూడా పడుతున్నాయి.

ఏపీలో ఎన్నికల కంటే చాలా ముందే టీడీపీ జనసేన కలిసాయి. సంఘీభావాన్ని ప్రకటించుకున్నాయి. దాంతో పొత్తులకు తెరలేచింది అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అంటే కచ్చితంగా చంద్రబాబు పేరే ఎవరైనా చెబుతారు. దీనికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు.

పైగా టీడీపీ పెద్ద పార్టీ, గెలుపోటములతో సంబంధం లేకుండా మొత్తం సీట్లకు పోటీ చేయగలదు అన్నది కూడా అందరూ చెబుతారు. అయితే విశాఖకు చెందిన జనసేన నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం ఖాయం. కచ్చితంగా పవన్ 2024 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అవుతారు అని జోస్యం చెబుతున్నారు. మరి చంద్రబాబు తో దోస్తీ కాకుండా ఒంటరిగా వెళ్తారా. వెళ్తే 175 సీట్లకు పోటీ పెడతారా అన్నది మాత్రం చెప్పడం లేదు.

అలాగే పొత్తుల గురించి కూడా మాట్లాడడం లేదు. కానీ పవనే సీఎం అని జనసేన నాయకులు చెబుతున్నారు. వారి ఆలోచనల మేరకు అయితే పవనే ముఖ్యమంత్రి కావాలి అని ఉంది. కానీ పొత్తులు కనుక కుదిరితే కధ అలా ఉంటుందా. చంద్రబాబు సీఎం సీటుని ఎవరికైనా ఇస్తారా. పోనీ అధికారంలో వాటా అంటూ అయిదేళ్ల కాలాన్ని రెండుగా విభజంగించి పంచుకుంటారా అంటే అది జరిగే పని కాదనే అంటున్నారు.

కానీ జనసైనికులు మాత్రం పవన్ సీఎం అని ప్రకటిస్తున్నారు. ఇది టీడీపీకి తమ్ముళ్ళకు ఎలా వినిపిస్తుందో తెలియదు కానీ పొత్తుల కధ ముందుకు సాగుతున్న వేళ జనసైనికుల బలమైన కోరికగా దీనిని చూడాలని అంటున్నారు.