కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను ఈ ఉప ఎన్నిక తీవ్ర ప్రభావితం చేయనుంది. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
బహుశా తెలంగాణలో ఇదే చివరి ఉప ఎన్నిక కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది సెమీ ఫైనల్‌గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే పోటాపోటీగా బరిలో తలపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని గట్టి పట్టుదలతో వుంది. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఈ క్రమంలో మునుగోడులో విజయం సాధించేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది.
మరోవైపు దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించిన నేపథ్యంలో తెలంగాణలో పట్టు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే పునరావృతం అవుతాయని టీఆర్ఎస్ భయపెడుతోంది. అందుకే ఎప్పుడూ లేనంతగా ఉప ఎన్నికను ఎదుర్కోడానికి సైన్యాన్ని దించింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి గురించి రేవంత్‌రెడ్డి కన్నీళ్లే చెబుతున్నాయి.
ఈ ఎన్నికలపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక పోరును వీధి కుక్కల కొట్లాటగా అభివర్ణించారు. మునుగోడులో అత్యంత ఖరీదైన ఎన్నిక జరుగుతోందని విమర్శించారు. సంతలో పశువుల మాదిరిగా నేతలు అమ్ముడు పోతున్నారని ఆమె తీవ్ర విమర్శ చేశారు. ప్రతిరోజూ అటూఇటూ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్న నేపథ్యంలో ఆమె విమర్శలు చేశారు. ఉప ఎన్నిక మాత్రమే కాదు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే రీతిలో ఖరీదుగా జరుగుతాయి. వాటిని ఆమె ఎలా ఎదుర్కొంటుందో మరి!