అమరావతి పాదయాత్రికులపై మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోతున్నారు. ఘాటు విమర్శలు చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంబటి విమర్శలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే కొద్ది ఆయన చెలరేగిపోవడం చర్చనీయాంశమైంది. ఇవాళ అమరావతి పాదయాత్రకు బ్రేక్ పడింది.
పోలీసులు అడ్డుకుంటున్నారని, న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని అమరావతి పాదయాత్రికులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు తనదైన శైలిలో వారిపై విమర్శలు గుప్పించారు. ఒళ్ల బలిసిన వాళ్ల పాదయాత్రగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, పాదయాత్ర చేస్తున్న వారంతా దోపిడీ దొంగలని విరుచుకుపడ్డారు.
ఇటీవల ఇవే మాటలన్నారు. అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు వచ్చినా ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి పాదయాత్రికులది ఫేక్ యాత్రగా అభివర్ణించారు. పాదయాత్రలో నిజమైన రైతుల కంటే రాజకీయ నేతలే ఎక్కువ ఉన్నారని అన్నారు. అందుకే పాదయాత్ర మధ్యలోనే ఆగిపోతుందన్నారు.
ఆధార్ కార్డు అడిగితేనే పారిపోయారంటే, అది ఫేక్ పాదయాత్ర కాకుండా మరేంటని అంబటి ప్రశ్నించారు. పాదయాత్రకు తాత్కాలిక విరామం అని చెబుతున్నారని, కానీ అది శాశ్వత విరామమే అని ఆయన తేల్చి చెప్పారు. అరసవెల్లికి వెళ్లాల్సిన పాదయాత్ర ఏ కారణంతో నియోజకవర్గాల మీదుగా చేస్తున్నారని అంబటి నిలదీశారు. టీడీపీ, జనసేన కలిసి చేస్తున్న పాదయాత్ర అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా వుండగా ఒళ్లు బలిసిన వాళ్లు, దోపిడీ దొంగలని వ్యాఖ్యానించడంపై అమరావతి పాదయాత్రికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.