ఒకవైపు తెలుగుదేశం, జనసేనల పొత్తు దాదాపు ఖరారు అయినట్టే అనే ప్రచారం జరుగుతున్న వేళ, చంద్రబాబు- పవన్ కల్యాణ్ లు చట్టాపట్టాలేసుకుంటున్న తరుణంలో..భారతీయ జనతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉండదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అంతే కాదు..తెలుగుదేశం పార్టీ కుటుంబ రాజకీయం చేస్తుందని, ఆ పార్టీ అవినీతమయం అని, గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ తీరుతో చేదు అనుభవాలను చవి చూసినట్టుగా దేవధర్ వ్యాఖ్యానించడం విశేషం. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఆలోచనే లేదన్నట్టుగా దేవధర్ వ్యాఖ్యానించారు.
అలాగే పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ ను ఇవ్వడం విషయం గురించి అంతర్గతంగా చర్చించనున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. అలాగే కన్నా లక్ష్మినారాయణ విషయాన్నీ సీరియస్ గా తీసుకోనక్కర్లదేని దేవధర్ చెప్పుకొచ్చారు.
మొత్తానికి దేవధర్ మాటలు పవన్ కల్యాణ్ కు పరోక్ష హెచ్చరికల్లా ఉన్నాయి. రోడ్ మ్యాప్ గురించి వెయిట్ చేయమన్నట్టుగా, తెలుగుదేశం పార్టీతో మాత్రం పొత్తు ఊసు పెట్టుకోవద్దని పవన్ కల్యాణ్ కు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి చెప్పినట్టేనేమో!
ఏ రాష్ట్ర స్థాయి బీజేపీ నేతో ఈ మాట చెబితే.. బీజేపీ పొత్తులను ఖరారు చేసేది ఢిల్లీ పెద్దలనే వాదన వినిపించవచ్చు తెలుగుదేశం నేతలు. అయితే ఢిల్లీ నుంచి ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి స్వయంగా ఈ విషయాన్ని సెలవిచ్చారు. పవన్ కల్యాణ్ కు ఈ విషయంలో స్పష్టత వస్తున్నట్టేనేమో!