‘ప్రభుత్వ ఆఫీసులోనే ఫర్నిచర్ మరియు కంప్యూటర్లు ఉంటే నిర్వహణ లేక పాడైపోతాయి. కేవలం అందువల్లనే.. వాటిని ఆయన తన సొంత ఇంటికి (క్యాంపు కార్యాలయానికి) తీసుకువెళ్లారు. దీనివెనుక ఇతరత్రా దురుద్దేశాలేమీ లేవుగాక లేవు’… ఇదీ కోడెల శివప్రసాదరావుగారి ఉవాచ. దందాలు సాగిస్తూ పోలీసు కేసుల్లో ఇరుక్కున కూతురు, కొడుకు ఒకరకంగా తన పరువు, పార్టీ పరువు కూడా కలగలుపుగా తీసేసిన తర్వాత.. ఆయన స్వయంగా ఫర్నిచర్ కాజేసిన ఆరోపణల్లో ఇరుక్కున్నారు. వ్యవహారం బయటపడిపోయిన తర్వాత కూడా నీతులు వల్లిస్తున్నారు.
హైదరాబాదునుంచి ఏపీ ప్రభుత్వం మొత్తం అమరావతికి తరలిపోయింది. ఆ క్రమంలో శాసనసభలోంచి ఏపీ వాటాకు వచ్చిన ఫర్నిచర్ గట్రా వ్యవహారాలు కూడా తరలిపోయాయి. కానీ ఏపీ స్పీకరు కార్యాలయానికి చెందిన ఫర్నిచరు కూడా నాలుగు లారీల్లో బయల్దేరింది. కానీ అది అమరావతికి చేరలేదు. మార్గమధ్యంలో కోడెల శివప్రసాదరావుగారి క్యాంపు కార్యాలయంలో కొలువు తీరింది.
అంతవరకూ ఓకే.. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం కూడా మారింది. వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కోడెల కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. ఇన్నాళ్లూ తన వద్ద ఉంచుకున్న ఫర్నిచర్, కంప్కూటర్లను తిరిగి ఇవ్వాలనే ఆలోచనే ఆయనకు రాలేదు. ఎంచక్కా ఉంచేసుకున్నారు. తీరా అసెంబ్లీ కార్యదర్శి వాటి సంగతేంటని ఉత్తరం రాస్తే పట్టించుకోలేదు. (తిరిగి ఇచ్చేస్తానని ఉత్తరం రాశాను.. ఆ ఉత్తరం అందినట్లు లేదు అంటూ కోడెల ఇప్పుడు మరో కథనం చెబుతున్నారు, ఇచ్చేస్తానంటూ ఇప్పుడు మళ్లీ లేఖ రాస్తానని అంటున్నారు) తీరా వ్యవహారం రచ్చకెక్కి.. ‘ఇది దొంగతనం తప్ప మరొకటి కాదు..’ అంటూ వైకాపా నాయకులంతా రోడ్డుకెక్కి తన పరువు తీసేస్తోంటే.. ఆయనలో చలనం వచ్చినట్లుంది. దురుద్దేశంతో చేయలేదు అంటూ నీతులు చెబుతున్నారు.
సాధారణ వ్యక్తి ఇలా చేస్తే దాన్ని దొంగతనమో, దోపిడీయో అంటారంటూ.. దొరికిపోయిన తర్వాత.. తిరిగి ఇస్తానంటున్న కోడెల వైనాన్ని వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేస్తున్నారు. మరి దీనికి కోడెల ఏం జవాబు చెప్తారో?