నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నిన్న ఈడీ విచారణకు హాజరవ్వగానే చాలా మంది అనుమానపు చూపులు చూశారు. రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ లో ఆమె విచారణకు హాజరయ్యిందనే వార్తలు ఆశ్చర్యపరిచాయి. అయితే ఆ కేసులో ఆమె ఒక సాక్షి కమ్ బాధితురాలు మాత్రమేననేది తాజా సమాచారం.
ఒకవైపు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు పలువురు డ్రగ్స్ కేసులో చోటు చేసుకున్న మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఇదే తరహా స్కామ్ లో విచారణకు ఈడీ అధికారుల వద్ద హాజరైంది. ఈ శ్రీలంకన్ నటి ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించిందని వేరే చెప్పనక్కర్లేదు.
రెండు వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన విచారణలో ఆమెను అధికారులు పిలిచారు. అయితే ఈ స్కామ్ లో జాక్వెలిన్ సూత్రధారిగా హాజరు కాలేదట. కేవలం ఒక సాక్షిగా, బాధితురాలిగా హాజరయ్యిందని సమాచారం. ఆ ముఠా చేతిలో మోసపోయిన వారిలో జాక్వెలిన్ కూడా ఒకరని వార్తలు వస్తున్నాయి.
చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ స్కామ్ సూత్రధారి అట. జాక్వెలిన్ తో అతడి గర్ల్ ఫ్రెండ్ పరిచయాన్ని పెంచుకుందట. ఆ పరిచయంతో ఈమెను ఆ స్కామ్ లోకి లాగారని తెలుస్తోంది. వారి మాయలో పడి జాక్వెలిన్ కూడా మోసపోయిందట.
మరి అది ఆర్థికంగానా, లేక వారు జాక్వెలిన్ ఇమేజ్ ను మరోరకంగా ఉపయోగించుకున్నారా.. అనే అంశంపై అధికారులు ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం అయితే ఆ కేసులో జాక్వెలిన్ ఒక సాక్షిగా, బాధితురాలిగా విచారణకు హాజరైంది. విచారణలో ఈమె అధికారులతో స్కామ్ కు సంబంధించి పలు విషయాలను వెల్లడించినట్టుగా సమాచారం.