స్టీల్ ప్లాంట్ మీద కొత్త మాట…నమ్మొచ్చా…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం దూకుడుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏణ్ణర్ధం అయింది ప్లాంట్ విషయంలో కేంద్రం అడుగులు ఏ దిశగా పడుతున్నాయన్నది అంతా గమనిస్తున్నారు.…

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం దూకుడుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏణ్ణర్ధం అయింది ప్లాంట్ విషయంలో కేంద్రం అడుగులు ఏ దిశగా పడుతున్నాయన్నది అంతా గమనిస్తున్నారు. మా ప్లాంట్ మా ఇష్టం మధ్యలో మీకేంటి సంబంధం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర మంత్రులు ఒక దశలో గట్టిగానే ప్రశ్నించారు అన్నది కూడా ఇక్కడ ప్రస్థావనార్హం.

స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడవడం లేదు కాబట్టి మేము అమ్మేస్తామని చెబుతున్నారు. అయితే సొంత గనులు ఇస్తే లాభాలు కచ్చితంగా వస్తాయి కదా అని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరితే మాత్రం జవాబు ఉండదు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమం అయితే చాలా కాలంగా కోనసాగుతూనే ఉంది.

ఈ నేపధ్యంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించమని ఎన్ ఎం డీసీలో కేంద్రం విలీనం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తాజాగా చెబుతున్న మాట. అంటే స్టీల్ ప్లాంట్ అస్థిత్వం అంటూ ఉండదు ఇక మీదట ఎన్ ఎం డీసీలో భాగమై పోతుంది అన్న మాట. ఇది ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపడానికి మధ్యేమార్గమని విశాఖకు చెందిన బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

అయితే కేంద్రం విలీనం అయినా చేసి ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో ఉంచుతుందా అంటే దానికి కేంద్ర స్థాయిలో కీలక బాధ్యుల నుంచి మాత్రం సరైన సమాధానం అయితే రావడం లేదు. అసలు ఎన్ ఎం డీసీలో విలీనం ఎందుకు, ఎందరో త్యాగాల నుంచి పుట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని దాని సొంత అస్థిత్వం ఉండేలా చూడవచ్చు కదా. సొంత గనులు కేటాయించి ప్లాంట్ ని లాభాల బాటలో కొనసాగేలా తరతరాలుగా విశాఖ ఖ్యాతిగా నిలిచేలా చర్యలు చేపట్టవచ్చు కదా అని ఉద్యమకారులు అయితే కోరుతున్నారు.

బీజేపీ నేతలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పటికి ప్రైవేట్ ముప్పు తప్పిందని అనుకోవచ్చా. ఈ మాటలు నమ్మ వచ్చా అంటే కాస్తా ఆలోచించాల్సిందే. ఎందుకంటే కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాలలో  ఏవీ వెనక్కు మళ్ళిన ఆలోచనలు ఎపుడూ చేయలేదు అని గుర్తు చేస్తున్నారు.