తలలు పట్టుకుంటున్న గులాబీ మంత్రులు, ఎమ్మెల్యేలు

మునుగోడు ఉప ఎన్నిక దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా దీన్ని పరిగణిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీ కూడా భారీగా ఖర్చు చేస్తోంది. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉండగా మరొకటి…

మునుగోడు ఉప ఎన్నిక దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా దీన్ని పరిగణిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీ కూడా భారీగా ఖర్చు చేస్తోంది. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉండగా మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. రెండు పార్టీల అభ్యర్థులు డబ్బున్నవారే. బాగా తక్కువగా ఖర్చు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎన్నికల ఖర్చుపై టీఆర్ఎస్ ఇంచార్జిలు టెన్షన్ పడుతున్నారట. ప్రచారానికి పార్టీ ఫండ్ కొంత వస్తున్నప్పటికీ.. అది ఏ మాత్రం సరిపోవడం లేదంటున్నారు. దీంతో  చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత డబ్బును ఖర్చు పెడుతున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు ఓటర్లకు ప్రతి రోజూ చికెన్, మటన్, మద్యం పార్టీలతో.. ఖర్చు తడిసి మోపెడవుతోందని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.

తమ సొంత నియోజకవర్గంలో కూడా ఇంత ఖర్చుపెట్టలేదని.. వాపోతున్నారట. ధన ప్రవాహం ఇప్పుడు అక్కడ కట్టలు తెంచుకుంటున్నది. మొన్నటిదాకా హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డును మునుగోడు బద్దలు కొడుతోంది.  మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థులు సాధారణ ఎన్నికల్లో పెట్టే ఖర్చుతో సమానం అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో అన్ని పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనను సామాన్యుల మదిలో నుంచి తుంచి వేస్తున్నాయి.. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆగర్భ శ్రీమంతులు మాత్రమే అందుకు అర్హులనే నిర్వచనాన్ని ఇస్తున్నాయి.

ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారో.. అప్పుడే మునుగోడులో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఇతర పార్టీలకు నాయకులను కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు ఓ పార్టీలో ఉండేందుకు ఇటీవల ఎంపిటిసి కి ఆయన పార్టీ 5 లక్షలు ఇచ్చింది. మరునాడు ఇంకో పార్టీ వచ్చి 10 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఆ ప్రజాప్రతినిధి ఆ డబ్బు తీసుకొని పార్టీ ఫిరాయించాడు. తాజాగా మూడో పార్టీ ఆయనకు 20 లక్షలు ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఇక ఆయన ఒక గ్రామానికి సర్పంచ్.. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు.. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన చేతిలో పెద్దగా ఓట్లు కూడా లేవు. మహా అయితే 50లోపే ఉంటాయేమో. కానీ ఓ పార్టీ నేత ఆయనకు ఏకంగా 30 లక్షలు ఇచ్చారు. అంతే ఆ సర్పంచ్ పార్టీ మారారు.

ఇప్పుడు ఇతర పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ రెండు ఉదాహరణలు మునుగోడులో ధనస్వామ్యానికి నిదర్శనాలు. గట్టుప్పల్, చౌటుప్పల్, మునుగోడు, సంస్థాన్ నారాయణపురం వంటి మండలాల్లో డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఓటర్ కు 1000 నుంచి పదివేల వరకు ఇస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ఒక పార్టీ 6000 చొప్పున, మరో పార్టీ 1500 చొప్పున ఇస్తే.. ఇప్పుడు మునుగోడులో కేవలం తొలి విడతలోనే వెయ్యి నుంచి పదివేల వరకు పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా ఒక్క కుటుంబానికి 30 వేల వరకు ముట్ట చెప్పేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్న వారికి కాకుండా పోలింగ్ రోజు వచ్చి ఓటు వేసేందుకు బయట ఉన్న వారికి కూడా ఇప్పటికే ఒక పార్టీ ఓటుకు 40 వేల చొప్పున ఆఫర్ చేసింది.

మరో పార్టీ వారికే ఓటుకు తులం బంగారం ఇస్తామని చెప్పింది. ఆయా పార్టీలు ఇప్పటికే కొన్నిచోట్ల వాటి పంపిణీ కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలతో మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు కొత్త శిఖరాలకు వెళుతుంది. తెలంగాణలో ఎన్నికల ఖర్చు మునుగోడుకు ముందు, మునుగోడుకు తర్వాత అనేలా ఉన్నాయి పరిణామాలు. కండువా కప్పుకుంటే చాలు 30 వేల వరకు ఇస్తున్నాయి. ఇదంతా కూడా కేవలం ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నాయి. ఇటీవల గట్టుప్పల్ మండలంలో ఓ పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకుడితోపాటు అనుచరులకు ఒక్కొక్కరికి 30 వేల చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. నాయకుల కొనుగోలును కొన్ని నెలల కిందనే ప్రారంభించినా. ఇప్పుడు అది తారాస్థాయికి చేరింది.

కొన్ని వారాల కిందట జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులకు సగటున రెండు లక్షల చొప్పున కొన్ని పార్టీలు పంపిణీ చేశాయి. రోజులు గడిచే కొద్దీ రెండు లక్షలు అన్నది కాస్త ఇప్పుడు చిన్న మొత్తం అయిపోయింది. తాజాగా వీరి ధర పది లక్షల నుంచి 30 లక్షల వరకు పలుకుతోంది. గతంలో ఒక పార్టీ డబ్బు ఇచ్చినా.. ఇప్పుడు మరో పార్టీ కూడా డబ్బు ఇస్తున్నది. అయితే తమ పార్టీ తరఫున పనిచేయాలని చెబుతోంది. కుదరకపోతే ఎదుటి పార్టీ తరఫున పనిచేయకుండా గమ్మున ఉండాలని చెబుతోంది. అయితే ఎన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినా నేతలు మాత్రం సిగ్గు లేకుండా తీసుకుంటూనే ఉంటున్నారు. ఇక ఎన్నికల ఖర్చులు చూస్తుంటే సంపన్నులు కూడా రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచే అభ్యర్థి పదవీ కాలం ఎంత ?

మామూలుగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. కానీ అది నేరుగా జరిగే ఎన్నికల్లోనే. అదే ఉపఎన్నికల్లో అయితే .. శాసనసభ ఎంత కాలం ఉంటుందో.. అంత కాలం మాత్రమే పదవి ఉంటుంది. ఈ ప్రకారం మునుగోడులో ఉపఎన్నికల్లో గెలిచే అభ్యర్థి పదవి కాలం కేవలం ఏడాది మాత్రమే. కానీ రాజకీయ పార్టీలు అలా అనుకోవడం లేదు. ఏడాది కోసం ఖర్చు అవసరమా అని అనుకోవడం లేదు. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. అభ్యర్థులు కూడా అంతే. తమిళనాడులో జయలలిత చనిపోయిన తర్వాత ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఒక్కో ఓటుకు  రూ. ఇరవై వేల వరకూ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. అక్కడి డబ్బు ప్రవాహాన్ని చూసి ఈసీనే ఆశ్చర్యపోయి..చివరికి ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. 

మునుగోడులో కూడా ఆ స్థాయిలోనే డబ్బుల ప్రవాహం కనిపిస్తోంది అప్పట్లో  లేనంత ఆన్ లైన్ విప్లవం ఇప్పుడు ఉంది. అందుకే నోట్ల ద్వారా మాత్రమే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా డబ్బులు పంచుతున్నారు.  అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రచారానికి.. పార్టీ నేతల్ని కొనడానికి.. ఖర్చు చేస్తున్నారు.  అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. దుబ్బాక, హుజురాబాద్  తరహా ఫలితం పునరావృతం కావద్దని.. ఒకవేళ అలా జరిగితే.. పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని భావిస్తోంది. అందువల్ల మునుగోడులో గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ మునుగోడులో దించారు సీఎం కేసీఆర్ .

మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లస్టర్లుగా విభజించి వాటికి ఇంచార్జులను నియమించారు. 14 మంది మంత్రులతో పాటు 72 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధికి ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జ్‌గా ఉన్నారు. సీఎం కేసీఆర్ కూడా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి ఇంచార్జిగా ఉన్నారు. ఒక చిన్న గ్రామంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసుకున్నారంటే.. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.  ప్రచార గడువు ముగిసేవరకు  వరకు మంత్రులు, ఎమ్మెల్యేలంతా.. ఎవరికి కేటాయించిన గ్రామాల్లోనే వారు ఉండాలని కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయట. మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ఎంపీటీసీ పరిధిలో ప్రచారం చేస్తున్నారా? లేదా? అని కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారట. 

కొందరు నేతలు లైట్ తీసుకోవడంతో… వారిపై సీరియస్ అయ్యారట. కొందరు ఉదయం పూట ప్రచారం నిర్వహించి.. రాత్రిపూట హైదరాబాద్‌కు వస్తున్నారట. అలాంటి వారిపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అత్యవసరమైతే తప్ప.. మునుగోడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లకూడదని ఇంచార్జిలను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. పగలు మాత్రమే కాదు.. రాత్రిళ్లు కూడ అక్కడే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. గ్రామంలోని ముఖ్య నేతలు, అసంతృప్తులతో మాట్లాడేందుకు ఆ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారట. గులాబీ పార్టీ మునుగోడు ఉప ఎన్నికలో గెలవకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవకపోవొచ్చనే భయం పట్టుకుంది.