కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ కథ కంచికేనా?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నాయకుడు అందలం ఎక్కుతాడో, ఏ నాయకుడి కథ కంచికి చేరుతుందో తెలియదు. అన్ని పార్టీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇది మరింత ఎక్కువగా…

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నాయకుడు అందలం ఎక్కుతాడో, ఏ నాయకుడి కథ కంచికి చేరుతుందో తెలియదు. అన్ని పార్టీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పీతల సీసాకు మూత అక్కరలేదనే సామెత ఆ పార్టీకి బాగా వర్తిస్తుంది. తెలంగాణా కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకంటే గ్రూపు రాజకీయాలు ఎక్కువ. పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఎక్కువకాలం పదవిలో ఉండని, పదవీకాలం పూర్తి చేసుకోలేని చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. సీఎంలను, పీసీసీ అధ్యక్షులను నిలకడగా ఉండనివ్వని చరిత్ర కాంగ్రెస్ పార్టీకి వుంది. ఇందుకు పార్టీ నాయకులే కారణం. వారి రాజకీయాలే కారణం. 

ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అనుమానాలు వెలిబుచ్చింది సాక్షాత్తూ టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ? గెలవదా? అనే విషయాన్ని పక్కన పెడితే ఆయనకు తన పదవి ఉంటుందా ? ఊడుతుందా ? అనే భయం పట్టుకుంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయన పదవి ఉంటుందనే నమ్మకం లేదు. పార్టీ ఓడిపోతే మాత్రం ఆయనను గద్దె దింపడానికి సీనియర్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి సీనియర్లు ఆయన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మునుగోడు అభ్యర్థి  విషయంలో రేవంత్ రెడ్డితో సీనియర్లకు మొదటి నుంచి విభేదాలు వచ్చాయి.

రేవంత్ రెడ్డి వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును ప్రతిపాదించగా.. సీనియర్లు మాత్రం పాల్వాయి స్రవంతి పేరు తెరపైకి తెచ్చారు. ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డి అయితేనే బీజేపీ, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోగలమని రేవంత్ చెప్పినా.. హైకమాండ్ మాత్రం సీనియర్లు సూచించిన స్రవంతికే టికెట్ ఇచ్చారు. అయినా స్రవంతి కోసం ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాని సీనియర్లు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. స్రవంతికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదించిన నేతలు కూడా ఇప్పుడు మునుగోడు వైపు చూడటం లేదు. ప్రస్తుతం ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి అనుచరులుగా ముద్ర పడిన నేతలు మాత్రమే సీరియస్ గా వర్క్ చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కూడా ఏదో వచ్చాం అన్నట్లుగా వచ్చి వెళుతున్నారు తప్ప సీరియస్ గా ప్రచారం చేయడం లేదు. మునుగోడులో కాంగ్రెస్ నేతల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు నేతలు కావాలనే మునుగోడు ప్రచారానికి రావడం లేదని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారనే టాక్ వస్తోంది. మునుగోడులో పార్టీకి ఘోరంగా ఓడిపోతే.. దానిని సాకుగా చూపి రేవంత్ రెడ్డిని బాధ్యుడిన చేయాలనే ప్లాన్ లో కొందరు హస్తం నేతలు ఉన్నారంటున్నారు.ఈ విషయం తెలిసిన రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. తనను పీసీసీ పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక రేపుతుండగా.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని.. తనను ఒంటరి చేశారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మునుగోడులో పార్టీని పూర్తిగా బలహీనం చేసి.. ఆ నెపాన్ని తనపై వేసి.. పీసీసీ పదవి నుంచి తనను తప్పించాలని సొంత పార్టీలోనే కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించి.. తనను పిసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించాలని భారి కుట్ర జరుగుతోందన్నారు. దీన్ని కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ గమనించాలంటూ వేడుకున్నారు.రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే సొంత పార్టీ నాయకులు కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నారని, తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయని అన్నారు. 

తనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలిరావలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను ఒంటరివాడిని  చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆయన పీసీసీ పదవి పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది. కాని అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో కాంగ్రెస్ కు పెద్దగా నష్టం లేకపోయింది. రేవంత్ రెడ్డి కూడా హుజురాబాద్ ను సీరియస్ గా తీసుకోలేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి నిలబెట్టిన బల్మూరి వెంకట్ కు కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 

ఈటల రాజేందర్ ను గెలిపించడం కోసమే రేవంత్ రెడ్జి ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. హుజురాబాద్ సిట్టింగ్ సీటు కాకపోవడంతో రేవంత్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది కాలేదు. కాని ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగానే సీట్లు సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కోటగా చెప్పుకునే మునుగోడులో ఈసారి ఓట్లు తగ్గితే అది పార్టీపై ఖచ్చితంగా ప్రభావం రేవంత్ రెడ్డి మీద పడుతుంది.