కొనసాగుతున్న కన్ఫ్యూజన్.. ఏది ఎప్పుడు వస్తుందో!

టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడూ ఇంత కన్ఫ్యూజన్ లేదు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. స్వయంగా మేకర్స్ ప్రకటించినప్పటికీ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆచార్య,…

టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడూ ఇంత కన్ఫ్యూజన్ లేదు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. స్వయంగా మేకర్స్ ప్రకటించినప్పటికీ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆచార్య, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, అఖండ, భీమ్లానాయక్, సర్కారువారి పాట.. ఇలా ఒకటి కాదు, అన్ని పెద్ద సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందరికీ సంక్రాంతే కావాలి.

నిజానికి ఈ కన్ఫ్యూజన్ కు ప్రధాన కారణం ఆర్ఆర్ఆర్ సినిమా. అక్టోబర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఆ సినిమా అనివార్యంగా వాయిదాపడింది. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా బయటకు చెప్పలేదు కానీ విషయం మాత్రం ఇండస్ట్రీకి తెలిసిపోయింది. దీంతో ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ చుట్టూ మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ చక్కర్లు కొడుతున్నాయి.

మొన్నటివరకు ఆర్ఆర్ఆర్ సినిమా సమ్మర్ కు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి ఇప్పుడు సంక్రాంతిపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదం ఏదో ఉంటుందని తెలిసి ముందుగానే మహేష్, ప్రభాస్, పవన్ కల్యాణ్ తమ సినిమాల్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించుకున్నారు.

వాళ్లు ప్రకటనలు అయితే ఇచ్చుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా చేజారిపోయేలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను అందరికంటే ముందుగా జనవరి 7 తేదీల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. అదే కనుక జరిగితే మహేష్, ప్రభాస్, పవన్ లో కనీసం ఇద్దరు తప్పుకోవాల్సిందే. సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ తో పాటు మరో పెద్ద హీరో సినిమాకు మాత్రమే అవకాశం ఉంటుంది. 

సంక్రాంతి బరిలో 3 పెద్ద సినిమాలు వచ్చినా ఫర్వాలేదు, బాక్సాఫీస్ తట్టుకుంటుందంటూ దిల్ రాజు లాంటి నిర్మాతలు చెప్పే మాటలు ఇక్కడ పనిచేయవు. ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ సినిమా అన్నింటికంటే పెద్దది కాబట్టి.

ఇక ఆర్ఆర్ఆర్ ప్రభావం మిగతా సినిమాలపై ఎలా పడిందో చూద్దాం. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియక ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించకుండా అలా ఆపేశారు. ఒకవేళ అర్ఆర్ఆర్ సంక్రాంతికే ఫిక్స్ అయితే, ఆచార్యను క్రిస్మస్ కు దింపాలనేది చిరంజీవి ప్లాన్. కానీ ఆల్రెడీ ఆ స్లాట్ లో పుష్ప సిద్ధంగా ఉంది. సో.. ఇలాంటి టైమ్ లో రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి నుంచి వెనక్కి రాలేదు. అఖండ సినిమా ముందుకు కదల్లేదు. ఇక ఎఫ్3, గని లాంటి సినిమాల సంగతి సరేసరి.

ఇలా కేవలం ఆర్ఆర్ఆర్ చుట్టూ పెద్ద సినిమాల విడుదల తేదీలన్నీ ఆధారపడి ఉన్నాయి. అటు రాజమౌళి మాత్రం తన సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన కనీసం 3 వారాలు గ్యాప్ దొరికే డేట్ కోసం చూస్తున్నట్టు సమాచారం. సంక్రాంతి బరిలో మాత్రం అది అసాధ్యం.