మంత్రి బొత్స సత్యనారాయణపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రెచ్చిపోయారు. అంతేకాదు, రాజధాని ఆందోళనకారులకు ఆయన భరోసా ఇవ్వడం గమనార్హం. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలిస్తామని ఇటీవల మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతున్నారు. వీరిలో సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఉన్నారు.
రఘురామకృష్ణంరాజు సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. రాజధానిపై మంత్రి బుద్ధిలేని, మతిలేని ప్రకటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బుర్ర లేని సచ్చు వెదవల సలహా లతోనే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన, దిక్కుమాలిన సూత్రాలు చెప్ప వద్దని మంత్రికి సలహాలిచ్చారు మంత్రి అనుకున్నట్లు రాజధాని విశాఖ వెళ్ళడం అయ్యే పని కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలను కోరుతున్నానన్నారు. రఘురామకృష్ణంరాజు విమర్శల్లో తీవ్రత పెంచారు.
రఘురామ అరెస్ట్, అనంతరం అనేక పరిణామాలు చోటుకున్నాయి. అవేవీ ఆయన్ను నోరు మూయించకపోగా, మరింత విరుచుకపడేలా చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కంటే రఘురామే వైసీపీని ఎక్కువగా విసిగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ ప్రత్యర్థులు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.