ఒక్క శాతం కూడా డౌట్ పడలేదు.. కొంప ముంచింది

ఓ పెద్ద సినిమాను రిలీజ్ చేస్తున్నప్పుడు మేకర్స్ అటుఇటు చూసుకుంటారు. తమ సినిమాకు పోటీగా ఏమొస్తున్నాయో చెక్ చేసుకుంటారు. అవసరమైతే వాళ్లతో సంప్రదింపులు జరిపి, పక్కకు తప్పుకునేలా చేస్తారు. కుదరని పక్షంలో తామే మరో…

ఓ పెద్ద సినిమాను రిలీజ్ చేస్తున్నప్పుడు మేకర్స్ అటుఇటు చూసుకుంటారు. తమ సినిమాకు పోటీగా ఏమొస్తున్నాయో చెక్ చేసుకుంటారు. అవసరమైతే వాళ్లతో సంప్రదింపులు జరిపి, పక్కకు తప్పుకునేలా చేస్తారు. కుదరని పక్షంలో తామే మరో తేదీ వెదుక్కుంటారు. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ.

భోళాశంకర్ రిలీజ్ టైమ్ లో కూడా ఈ ఎక్సర్ సైజ్ జరిగింది. దాదాపు 5 నెలల ముందు నుంచే అన్నీ సెట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేస్తున్న నిర్మాతలకు సమాచారం ఇచ్చారు. ఆల్ సెట్ అనుకున్నారు. కానీ జైలర్ గురించి ఒక్క శాతం కూడా ఆలోచించలేకపోయారు. అదే పెద్ద మైనస్ అయింది.

చిరంజీవి లాంటి స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, పరభాష నుంచి వస్తున్న ఓ డబ్బింగ్ సినిమాను పట్టించుకోనక్కర్లేదు. అది రజనీకాంత్ సినిమా అయినా సరే. ఎందుకంటే, రజనీకాంత్ ఈమధ్య కాలంలో తెలుగులో సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. కాబట్టి భోళాశంకర్ యూనిట్, జైలర్ ను లైట్ తీసుకుంది.

కేవలం లైట్ తీసుకోవడమే కాదు, జైలర్ రిలీజైన 24 గంటల తర్వాత భోళాశంకర్ రిలీజైతే.. జైలర్ ను చాలా స్క్రీన్స్ నుంచి తప్పించి మరీ భోళాశంకర్ వేశారు. కానీ ఓ పెద్ద హీరో సినిమాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఏమాత్రం టాక్ బాగున్నా, హిట్ రేంజ్ నుంచి రోజుల వ్యవథిలో బ్లాక్ బస్టర్ రేంజ్ కు వెళ్లిపోతుంది. జైలర్ విషయంలో అదే జరిగింది.

రివర్స్ లో భోళాశంకర్ కు థియేటర్లు తగ్గించి మరీ జైలర్ కు కేటాయించారంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవాను అర్థం చేసుకోవచ్చు.

ఈ కాలం ఫ్లాప్ అంటే ఫ్లాప్ అంతే. ఈ విషయంలో మరో చర్చకు తావులేదు. కాకపోతే బరిలో జైలర్ లేకుండా ఉండుంటే, భోళాశంకర్ సినిమా హిట్ అవ్వకపోయినా, కనీసం భారీగా నష్టం వాటిల్లకుండా ఉండేది. రికవరీ పర్సంటేజీ పెరిగేది. భోళాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు జైలర్.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జైలర్ దూసుకుపోతోంది. నిన్నటితో 10 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ కూడా ఈ సినిమాదే హవా.